కటింగ్ బాబూ.. కటింగ్..
సూర్యాపేట: విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మంగళవారం సూర్యాపేట పట్టణంతో పాటు మండలంలో కూలి పనులు చేశారు. వివిధ రకాల పనులు చేసి రూ.2,37,500 సంపాదించారు. సూర్యాపేట బిగ్‌బాస్ క్షౌ రశాలలో బాలుడికి కటింగ్ కూడా చేశారు.
చాయ్.. గరమ్ చాయ్..
హైదరాబాద్: వరంగల్ టీఆర్‌ఎస్ బహిరంగసభకు నిధుల సమీకరణలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మంగళవారం పలుచోట్ల కూలి పనులు చేశారు. రికార్డు స్థాయిలో రూ.16.50 లక్షలు సంపాదించి కూలి నంబర్–1గా నిలిచారు. సనత్‌నగర్ టిఫిన్ సెంటర్‌లో టిఫిన్, లక్కీ హోటల్‌లో చాయ్, బీకేగూడలో పుస్తకాల అమ్మకం, జలవిహార్ వాటర్ జోన్‌లో టికెట్ల అమ్మారు.
చేపలమ్మా.. చేపలూ..
హైదరాబాద్: బౌద్ధనగర్ వీధుల్లో మంత్రి పద్మారావుగౌడ్ మంగళవారం చేపలు విక్రయించారు. దీంతో పాటు వివిధ కూలీ పనులు చేసిన మంత్రి రూ.15 లక్షల ఆదాయం ఆర్జించారు.
చిటికెలో చేస్తా.. సిమెంట్ పని..
హైదరాబాద్: హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి గాంధీనగర్‌లో కూలీగా పనిచేసి మొత్తం రూ.3,51,232 సంపాదించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న కళాజ్యోతి ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసినందుకు గాను రూ.1,00,116 చెక్కును అందుకున్నారు. గాంధీనగర్‌లోని ఉదయ్ ఆదితి డెవలపర్స్ వద్ద సిమెంట్ పని చేసి రూ. 2,51,116 సంపాదించారు.
కూల్ కూల్ ఐస్‌క్రీమ్..
హైదరాబాద్: గులాబీ కూలిలో భాగంగా ఎంపీ కే.కేశవరావు బంజారాహిల్స్ ఓరిస్ హోటల్‌లో ప్రత్యేకంగా తయారు చేసిన ఐస్‌క్రీమ్‌కు తెలంగాణ ఐస్‌క్రీమ్‌గా నామ కరణం చేశారు. ఇందుకు గాను కేకే రూ.2 లక్షలు అందుకున్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఆయన వెంట ఉన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ నోవా ఇంజినీరింగ్ కాలేజీలో పాఠాలు చెప్పి మరో రూ.2 లక్షలు సంపాదించారు.