సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పద్మారావు
ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రెండు పార్టీల నుంచి మూడు పార్టీల నుంచి ముగ్గురు హేమాహేమీలు
ముక్కోణపు పోటీలో గెలుపు ఎవరిదో?
సాక్షి, సిటీబ్యూరో/సికింద్రాబాద్: సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ఇప్పటికే బీజేపీ నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్లను ఆ పార్టీలు ప్రకటించగా, తాజాగా బీఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.పద్మారావుగౌడ్ పేరును ప్రకటించారు. ముగ్గురూ ప్రజాబలంతో ఎదిగిన నేతలే. నాగేందర్, పద్మారావులకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో అనుబంధం ఎక్కువనే పేరుంది. ఇటీవలీ దాకా ఒకే పారీ్టలో, ఒకే నాయకత్వం కింద కలిసి పని చేసిన వారిద్దరు ఇప్పుడు నువ్వా? నేనా? అని తేల్చుకునేందుకు సిద్ధం కావడంతో ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రత్యేక ఆకర్షణగా మారింది. దానం నాగేందర్ అనగానే ఇంకా బీఆర్‌ఎస్‌లో ఉన్నట్లుగానే ప్రజలకు గుర్తుంది. ఆయన కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిసినప్పటికీ, ఇంకా బలంగా నమోదు కాలేదు. దీంతో నాగేందర్, పద్మారావు అనగానే ఇద్దరూ ఒకే పార్టీ కదా .. అంటున్న వారు సైతం ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ తమ ప్రచారాన్ని ఎలా నిర్వహిస్తారన్నది వేచి చూడాల్సిందే.
గెలుస్తాం: కేసీఆర్ ధీమా
పార్టీ అభ్యరి్థగా పద్మారావును ప్రకటించే సందర్భంగా నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ నుంచి కేంద్రమంత్రి పోటీలో ఉన్నారని వెరవాల్సిన పనిలేదని.. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ 2004లో తొలిసారిగా పద్మారావు ఎమ్మెల్యేగా పోటీ చేసింది అప్పటి రాష్ట్ర కేబినెట్ మంత్రి పైనే (తలసాని శ్రీనివాస్‌యాదవ్) అయినా ఆయనను ఓడించారని గుర్తు చేసినట్లు తెలిసింది. పద్మారావు గురించి మీకు తెలియంది కాదు. ఇటీవలి ఎన్నికల్లో మీరంతా మీ గెలుపు కోసం కష్టపడ్డారు. ఈ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను ఆరింట (నాంపల్లి మినహా) మనమే గెలిచాం. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉంది. ఇప్పుడు పార్టీ కోసం మరింత ఎక్కువగా కష్టపడి గెలిపించాలని హితబోధ చేసినట్లు సమాచారం. పద్మారావు అభ్యరి్థత్వానికి అందరూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఆయన పేరు ప్రకటించారు.
ఐదింట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే
సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో అంబర్‌పేట, ముషీరాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లుండగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లిలో మాత్రం ఎంఐఎం అభ్యర్థి గెలవగా, మిగతా ఆరు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలిచారు. వారిలో ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ ఇప్పుడు సికింద్రాబాద్ లోక్‌సభకు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలిచిన పద్మారావు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో తలపడుతున్నారు.
త్వరలోనే ప్రచారంలోకి..
అభ్యర్థిత్వం ఖరారు కావడంతో పద్మారావు ఆదివారం నియోజకవర్గంలోని పార్టీ నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. సోమవారం హోలీ ముగిశాక మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. అదే సమావేశంలో జనరల్ బాడీ సమావేశ తేదీని నిర్ణయించే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నాయకుడొకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment