Secunderabad Lok Sabha seat
-
రాజీనామాయే ప్ర‘దానం’!
రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ తో బీఆర్ఎస్ కీలక నేతలు పార్టీని వీడుతుండటం కలకలం రేపుతోంది. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే సికింద్రాబాద్ ఎంపీగా పోటీకి దింపుతామని కాంగ్రెస్ అధిష్టానం తేల్చినట్టు వచ్చిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి. దీనికితోడు మంత్రి కోమటిరెడ్డి కూడా దానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీగా పోటీ చేస్తే ఇబ్బందులు వస్తాయని వ్యాఖ్యానించారు. ఇక వచ్చే నెల 6న తుక్కుగూడలో నిర్వహించే సభ, లోక్‌సభ మేనిఫెస్టోపై చర్చించేందుకు టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ శుక్రవారం భేటీ అయింది. కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్యను కలిసిన దీపాదాస్ మున్షీ, మల్లురవి, సంపత్ కుమార్ అంతకుముందు గాం«దీభవన్ వేదికగా టీపీసీసీ ప్రచార కమిటీ భేటీ అయింది. ఇక బీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, మల్లు రవి, ఇతర నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసానికి వెళ్లి కాంగ్రెస్‌లోకి ఆహ్వనించారు. కె. కేశవరావు కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్‌లో చేరనున్నారు. కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా చేరేందుకు రంగం సిద్ధమైంది. నర్సాపూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కూడా శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. – సాక్షి, హైదరాబాద్ -
దానం అవుట్.. సికింద్రాబాద్ సీటు మరొకరికి??
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు షాకిచ్చే యోచనలో ఏఐసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పటికే ఆయన పేరును ఆ పార్టీ ప్రకటించింది. అయితే ఆయన తీరుతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇప్పుడు ఆ టికెట్ మరొకరికి ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే.. ఎంపీ టికెట్ ఉంటుందని దానంకు ఏఐసీసీ ఇదివరకే స్పష్టం చేసింది. దీంతో మూడో జాబితాలో దానం నాగేందర్ పేరును అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్. అయితే ముందు ఓకే చెప్పి తర్వాత ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ఈలోపు ఆయన ఎన్నికపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. కోర్టు సైతం ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఇదంతా పరిగణనలోకి తీసుకున్న ఏఐసీసీ దానంను తప్పించి.. ఆ స్థానంలో మరో అభ్యర్థిని నిలపాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తెర మీదకు వచ్చింది. ఆయన పేరును ఏఐసీసీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో అధిష్టానం నిర్ణయం ఏంటన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్.. హైకోర్టులో మరో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. దానం కాంగ్రెస్ చేరడం, సికింద్రబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరుగనుంది. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నగరానికి చెందిన రాజు యాదవ్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్‌పై పోటీ చేసి దానం ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక, కొద్దిరోజుల క్రితమే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో, దానంకు కాంగ్రెస్ ఎంపీ సీటు ఆఫర్ చేసింది. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి దానం బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి పోటీ చేయడం రాజ్యాంగ విరుద్దం, చట్ట విరుద్దమంటూ పిటిషనర్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా దానం నాగేందర్‌పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే సమయంలో దానంపై అనర్హత వేయాల్సిందిగా కోరారు. కాగా, ఈ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే, దానం నాగేందర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని విజయారెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఓటర్లకు డబ్బులు పంచారని, ఈ విషయంలో కేసులు నమోదయ్యాయని కోర్టుకు వివరించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం దానంకు నోటీసులు జారీ చేసింది. -
రసవత్తరంగా మారనున్న లష్కర్ పోరు
సాక్షి, సిటీబ్యూరో/సికింద్రాబాద్: సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ఇప్పటికే బీజేపీ నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్లను ఆ పార్టీలు ప్రకటించగా, తాజాగా బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.పద్మారావుగౌడ్ పేరును ప్రకటించారు. ముగ్గురూ ప్రజాబలంతో ఎదిగిన నేతలే. నాగేందర్, పద్మారావులకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో అనుబంధం ఎక్కువనే పేరుంది. ఇటీవలీ దాకా ఒకే పారీ్టలో, ఒకే నాయకత్వం కింద కలిసి పని చేసిన వారిద్దరు ఇప్పుడు నువ్వా? నేనా? అని తేల్చుకునేందుకు సిద్ధం కావడంతో ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రత్యేక ఆకర్షణగా మారింది. దానం నాగేందర్ అనగానే ఇంకా బీఆర్ఎస్లో ఉన్నట్లుగానే ప్రజలకు గుర్తుంది. ఆయన కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిసినప్పటికీ, ఇంకా బలంగా నమోదు కాలేదు. దీంతో నాగేందర్, పద్మారావు అనగానే ఇద్దరూ ఒకే పార్టీ కదా .. అంటున్న వారు సైతం ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ తమ ప్రచారాన్ని ఎలా నిర్వహిస్తారన్నది వేచి చూడాల్సిందే. గెలుస్తాం: కేసీఆర్ ధీమా పార్టీ అభ్యరి్థగా పద్మారావును ప్రకటించే సందర్భంగా నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ నుంచి కేంద్రమంత్రి పోటీలో ఉన్నారని వెరవాల్సిన పనిలేదని.. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ 2004లో తొలిసారిగా పద్మారావు ఎమ్మెల్యేగా పోటీ చేసింది అప్పటి రాష్ట్ర కేబినెట్ మంత్రి పైనే (తలసాని శ్రీనివాస్‌యాదవ్) అయినా ఆయనను ఓడించారని గుర్తు చేసినట్లు తెలిసింది. పద్మారావు గురించి మీకు తెలియంది కాదు. ఇటీవలి ఎన్నికల్లో మీరంతా మీ గెలుపు కోసం కష్టపడ్డారు. ఈ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను ఆరింట (నాంపల్లి మినహా) మనమే గెలిచాం. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉంది. ఇప్పుడు పార్టీ కోసం మరింత ఎక్కువగా కష్టపడి గెలిపించాలని హితబోధ చేసినట్లు సమాచారం. పద్మారావు అభ్యరి్థత్వానికి అందరూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఆయన పేరు ప్రకటించారు. ఐదింట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో అంబర్‌పేట, ముషీరాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లుండగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లిలో మాత్రం ఎంఐఎం అభ్యర్థి గెలవగా, మిగతా ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. వారిలో ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ ఇప్పుడు సికింద్రాబాద్ లోక్‌సభకు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలిచిన పద్మారావు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో తలపడుతున్నారు. త్వరలోనే ప్రచారంలోకి.. అభ్యర్థిత్వం ఖరారు కావడంతో పద్మారావు ఆదివారం నియోజకవర్గంలోని పార్టీ నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. సోమవారం హోలీ ముగిశాక మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. అదే సమావేశంలో జనరల్ బాడీ సమావేశ తేదీని నిర్ణయించే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నాయకుడొకరు తెలిపారు. -
BRS Party: సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ తమ అభర్థిని ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ను ఎంపీ అభ్యర్థిని ఖరారు చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ శనివారం పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయం మేరకు సికింద్రాబాద్ అభ్యర్థిగా పద్మారావు పేరును ఖరారు చేశారు. కాగా ఇప్పటి వరకు 14 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. భువనగిరి, నల్గొండ, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. చదవండి: Liquor Case: ఎమ్మెల్సీ కవితకు కస్టడీ పొడిగింపు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీరే.. నాగర్‌కర్నూల్ - ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్. మెదక్ - వెంకట్రామిరెడ్డి. మహబూబ్‌నగర్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి కరీంనగర్- వినోద్ కుమార్. పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్. జహీరాబాద్ - గాలి అనిల్ కుమార్ ఖమ్మం - నామా నాగేశ్వర్ రావు. చేవెళ్ల - కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. మహబూబాబాద్- మాలోత్ కవిత. మల్కాజ్గిరి - రాగిడి లక్ష్మారెడ్డి ఆదిలాబాద్ - ఆత్రం సక్కు. నిజామాబాద్ - బాజిరెడ్డి గోవర్ధన్. వరంగల్ - కడియం కావ్య -
బీజేపీలో ‘సికింద్రాబాద్’ ఆసక్తి
అక్కడి నుంచి పోటీకి కమలనాథుల పోటాపోటీ సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం.. బీజేపీలో హాట్ సీట్‌గా మారిపోయింది. ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఎక్కువమంది బీజేపీ నేతలు ఆసక్తి చూపుతున్నారు. అవకాశం వస్తే ఈసారి సికింద్రాబాద్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవాలని తెగ తాపత్రయపడుతున్నారు. గతంలో రెండుసార్లు ఈ నియోజకవర్గం నుంచి పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ హవా కారణంగా సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేస్తే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయన్న అంచనాతో నగర బీజేపీ నేతలు ఎక్కువమంది ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. గతంలో రెండుసార్లు పార్టీ అభ్యర్థిగా గెలిచిన బండారు దత్తాత్రేయ ఈసారీ పోటీ చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే వరుసగా రెండు దఫాల నుంచి ఇక్కడ ఓడిపోవడంతో ఆయనను మార్చే అవకాశాలు ఉన్నాయని పార్టీలో అంతర్గతంగా కథనాలు రావడంతో.. కొందరు నేతలు ఇక్కడి నుంచి పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకోవడం మొదలుపెట్టారు. 1999-2004 మధ్యకాలంలో పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రేమ్‌సింగ్‌రాథోడ్ సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి తన పేరును పరిశీలించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు కిషన్‌రెడ్డి కూడా ఈసారి లోక్‌సభ ఎన్నికలకు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారన్న ప్రచారం పార్టీలో బలంగా వినిపిస్తోంది. అయితే ఈ కథనాలను కిషన్‌రెడ్డి ఎప్పటికప్పుడూ ఖండిస్తూనే ఉన్నప్పటికీ పార్టీ నేతల్లో ఇలాంటి ప్రచారం ఎక్కువగానే వినిపిస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మరో నాయకుడు కూడా ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీకి ఆసక్తితో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. -
సికింద్రాబాద్ లోక్‌సభ సీటుపై ఎంఐఎం కన్ను
హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఉవ్విళ్లూరుతూ మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు. వారసిగూడలోని మహ్మద్ గూడాలో జరిగిన మైనార్టీల సభలో ఆయన మాట్లాడారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తుందని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల ప్రయోజనాలను పరిరక్షించేవిధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసేందుకు జరిగిన కుట్రలను తాము సమర్థవంతంగా తిప్పికొట్టామన్నారు. నరేంద్ర మోడీని నిలువరించడం ద్వారానే దేశంలో ముస్లింలు స్వతంత్రంగా జీవించగలుగుతారని పేర్కొన్నారు.