సికింద్రాబాద్ లోక్సభ సీటుపై ఎంఐఎం కన్ను
హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఉవ్విళ్లూరుతూ మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు. వారసిగూడలోని మహ్మద్ గూడాలో జరిగిన మైనార్టీల సభలో ఆయన మాట్లాడారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి పోటీ చేస్తుందని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల ప్రయోజనాలను పరిరక్షించేవిధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసేందుకు జరిగిన కుట్రలను తాము సమర్థవంతంగా తిప్పికొట్టామన్నారు. నరేంద్ర మోడీని నిలువరించడం ద్వారానే దేశంలో ముస్లింలు స్వతంత్రంగా జీవించగలుగుతారని పేర్కొన్నారు.