బీజేపీలో ‘సికింద్రాబాద్’ ఆసక్తి
అక్కడి నుంచి పోటీకి కమలనాథుల పోటాపోటీ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం.. బీజేపీలో హాట్ సీట్‌గా మారిపోయింది. ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఎక్కువమంది బీజేపీ నేతలు ఆసక్తి చూపుతున్నారు. అవకాశం వస్తే ఈసారి సికింద్రాబాద్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవాలని తెగ తాపత్రయపడుతున్నారు. గతంలో రెండుసార్లు ఈ నియోజకవర్గం నుంచి పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ హవా కారణంగా సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేస్తే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయన్న అంచనాతో నగర బీజేపీ నేతలు ఎక్కువమంది ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. గతంలో రెండుసార్లు పార్టీ అభ్యర్థిగా గెలిచిన బండారు దత్తాత్రేయ ఈసారీ పోటీ చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నారు.
అయితే వరుసగా రెండు దఫాల నుంచి ఇక్కడ ఓడిపోవడంతో ఆయనను మార్చే అవకాశాలు ఉన్నాయని పార్టీలో అంతర్గతంగా కథనాలు రావడంతో.. కొందరు నేతలు ఇక్కడి నుంచి పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకోవడం మొదలుపెట్టారు. 1999-2004 మధ్యకాలంలో పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రేమ్‌సింగ్‌రాథోడ్ సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి తన పేరును పరిశీలించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు కిషన్‌రెడ్డి కూడా ఈసారి లోక్‌సభ ఎన్నికలకు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారన్న ప్రచారం పార్టీలో బలంగా వినిపిస్తోంది. అయితే ఈ కథనాలను కిషన్‌రెడ్డి ఎప్పటికప్పుడూ ఖండిస్తూనే ఉన్నప్పటికీ పార్టీ నేతల్లో ఇలాంటి ప్రచారం ఎక్కువగానే వినిపిస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మరో నాయకుడు కూడా ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీకి ఆసక్తితో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.