యుద్ధానికి సిద్ధం కావాలన్న బీఆర్‌ఎస్
సాక్షి, సిటీబ్యూరో/సికింద్రాబాద్: లోక్‌సభ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారడంతో అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని పరిధిలోని చార్మినార్ మినహా మిగతా మూడు నియోజకవర్గాలు మరింత కీలకంగా మారాయి. మిగతా రాష్ట్రమంతా ఒక ఎత్తు.. నగర పరిధిలోని నియోజకవర్గాలు మరో ఎత్తు అన్నట్లుగా వాటిలో గెలుపు కోసం తగిన వ్యూహాలు రచిస్తున్నాయి. అందుకనుగుణంగా ఆలోచనలు చేస్తున్నాయి. కేంద్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఈసారి అత్యధిక స్థానాల్లో గెలవాలనే తలంపులో బీజేపీ ఉంది.
అందులో భాగంగా అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంతో ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజధానిలో సత్తా చాటాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్‌లో రోజుకో పేరు తెరపైకి వస్తోంది. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాన్నే పరిగణనలోకి తీసుకుంటే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ నుంచి మొదలై ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఖరారైనట్లు చెబుతున్నారు. ఇద్దరూ బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరినవారే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో గెలిచేందుకు పార్టీలోకి కొత్తగా చేరే వారికై నా సరే ఇవ్వాలన్న తలంపులో ఆ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా వెల్లడించేంత వరకు ఏ మార్పులైనా జరగవచ్చు.
సీనియర్‌నే పోటీలో ఉంచాలని..
ఇక బీఆర్‌ఎస్ పరిస్థితి మరోలా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ నేతలే గెలిచినప్పటికీ, లోక్‌సభ విషయానికొచ్చేసరికి ఆ పార్టీలో పెద్దగా ఆసక్తి కనబడటం లేదు. ఎలాగూ ఇవ్వాలనుకున్న వారికే అధిష్టానం టిక్కెట్ ఇస్తుందనే ఉద్దేశంతో టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు కనబడటం లేదు. ముఖ్యంగా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నేతలు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ నుంచి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్‌లను దృష్టిలో ఉంచుకున్న పార్టీ అగ్రనేతలు వారిని ఎదుర్కొనగల నేతను బరిలో దింపాలని భావిస్తున్నారు. ఇందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేనే బరిలో దింపాలనే ఆలోచనతో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌ను పోటీకి దింపనున్నట్లు తెలిసింది.
తన బదులు తన కుమారుడు రామేశ్వర్‌గౌడ్‌కు అవకాశమివ్వాల్సిందిగా పద్మారావు కోరినప్పటికీ, ఈ ఎన్నికలు పార్టీ మనుగడకే కీలకమైనవైనందున సీనియర్లే ఉండాలని, పోటీ తప్పదని సంకేతాలిచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నియోజకవర్గం నుంచి క్రితం సారి పోటీ చేసిన తలసాని సాయికిరణ్‌కు కానీ, లేదా ఆయన తండ్రి శ్రీనివాస్‌యాదవ్‌కుగానీ టికెట్ ఇస్తారని పార్టీ వర్గాలు తొలుత భావించాయి. ప్రస్తుత సమాచారం మేరకు పద్మారావునే బరిలో దింపేందుకు బీఆర్‌ఎస్ యోచించినట్లు తెలిసింది. మంగళవారం ఢిల్లీలో ఉన్న మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులను పద్మారావు, ఆయన కుమారుడు కలిసిన సందర్భంగా పద్మారావును పోటీకి సిద్ధంగా ఉండాలని చెబుతూ, అందుకు కారణాలు వివరించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment