హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పాలకవర్గంలోనూ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న మేయర్ బీఆర్‌ఎస్ పార్టీ కాగా, ఆ పార్టీకి దాదాపు 60 మంది కార్పొరేటర్లున్నారు. ఇటీవలి కాలంలో అన్ని పార్టీల్లోనూ జంపింగ్‌లు సాధారణమయ్యాయి. ఇతర పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరిన వారితో పాటు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారూ ఉన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిచింది 56 సీట్లు కాగా, ఇతర పార్టీల నుంచి రాక పోకల నేపథ్యంలో దాదాపు 60 మంది కార్పొరేటర్లున్నారు.
ఇప్పటి వరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ స్థానే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో బీఆర్‌ఎస్ నుంచి ఎంతమంది కాంగ్రెస్ వైపు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయితేనే తమ డివిజన్లలోఎక్కువ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించుకోవడంతో పాటు ఆయా కార్పొరేషన్ల నామినేటెడ్ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా అవకాశాలు.. భవిష్యత్తులో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లకు అవకాశం ఉంటుందనే తలంపుతో పలువురు అధికార పార్టీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే.. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడే దాన్ని కాదని కొందరు కాంగ్రెస్‌లో చేరా రు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇలాంటి వారి సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
కేటీఆర్ సమావేశంలో రహస్యమేమిటో?
గతంలో అధికార పార్టీ అయినందున బీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ కార్పొరేటర్లు బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతారా లేక తమ పూర్వాశ్రమంలోకి వెళ్తారా లేక అధికార కాంగ్రెస్‌లో చేరతారా అన్నది చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన ఇద్దరు కార్పొరేటర్లు సైతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టినట్లు తెలిసింది. దీంతో పలు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. సమావేశానికి హాజరైన వారు సైతం అందరూ బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతారా ? అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది.
ప్రతిపక్ష పార్టీలో ఉంటే తమకు సరిగా పనులు జరగవేమోననే తలంపుతోనూ కొందరు కార్పొరేటర్లున్నట్లు తెలుస్తోంది. బహుశా.. కార్పొరేటర్ల ఊగిసలాటను గుర్తించే కాబోలు కేటీఆర్ వారితో నిర్వహించిన సమావేశంలో భవిష్యత్‌లో జరగబోయే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వల్ల దాదాపు పదిమంది వరకు కార్పొరేటర్లకు ఎమ్మెల్యేలయ్యేందుకు అవకాశాలుంటాయని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఆయా సందర్భాల్లో చేసిన కామెంట్లు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండటం కూడా పలు ఊహాగానాలకు తావిస్తోంది. ఒకవేళ ఎమ్మెల్యేలు పార్టీ మారితే తమకు అనుకూలురైన కార్పొరేటర్లను కూడా తీసుకు వెళ్లవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
జీహెచ్‌ఎంసీలో విచిత్ర పరిస్థితులు..
రాబోయే రోజుల్లో జీహెచ్‌ఎంసీలో విచిత్ర పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనరల్‌బాడీ సమావేశాలకు, స్టాండింగ్ కమిటీ సమావేశాలకు అధ్యక్షత వహించేది మేయర్. బీఆర్‌ఎస్‌కు చెందిన మేయర్‌ది ఇప్పటి వరకు అధికార పార్టీ కాగా, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ. ప్రశ్నలు సంధించాల్సింది అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యులు. రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వమున్నప్పుడే సమావేశాల్ని సవ్యంగా నిర్వహించలేకపోయిన మేయర్.. ఇకముందు ఎలా నిర్వహిస్తారోననే ఆసక్తి రాజకీయ వర్గాల్లో ఏర్పడింది. ప్రతిసారీ గందరగోళాలు, రసాభాసలతో నడిచిన సమావేశాలు రాబోయే రోజుల్లో మరింత గందరగోళం కాగలవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించిన కాంగ్రెస్ సభ్యులు సైతం ఇకముందు తమ సమస్యల్ని ఎలా ప్రస్తావిస్తారో చూడాల్సిందే. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న ఎంఐఎం.. అనుకూలంగానే ఉంటుందా.. వ్యతిరేకత ప్రదర్శిస్తుందా అన్నది స్పష్టం అయ్యేందుకు కొంత సమయం పట్టనుంది. భవిష్యత్‌లో ఒకవేళ ఎంఐఎం కాంగ్రెస్‌తో జత కలిస్తే ..మేయర్ సీటుకు సైతం ఎసరు రాగలదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇలాంటి పరిణామాల్ని ఊహించి సైతం పార్టీల మార్పిడి జరగవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment