- విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ
మోత్కూరు: తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి స్వగ్రామమైన పొడిచేడుకు శ్రీకాంతాచారి గ్రామంగా నామకరణం చేసేందుకు కృషి చేస్తానని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. శ్రీకాంతాచారి ఐదవ వర్ధంతి సభ బుధవారం ఆయన నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచేడులో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీకాంతాచారి ప్రాణత్యాగం, కీర్తి దేశానికే గర్వకారణమన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, బంగారు తెలంగాణ ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అంతకు ముందు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.