‘పవర్‌’ ఫుల్‌ ఏపీ ..‘రియల్‌ టైమ్‌’ హీరో  | AP is first in cheap electricity purchases | Sakshi
Sakshi News home page

‘పవర్‌’ ఫుల్‌ ఏపీ ..‘రియల్‌ టైమ్‌’ హీరో 

Published Wed, Feb 10 2021 5:42 AM | Last Updated on Wed, Feb 10 2021 5:42 AM

AP is first in cheap electricity purchases - Sakshi

సాక్షి, అమరావతి: చౌక విద్యుత్‌ కొనుగోళ్లలో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశంసించింది. ఈ విషయాన్ని నీతి ఆయోగ్‌ దృష్టికి కూడా కేంద్ర ఇంధన శాఖ తీసుకెళ్లింది. వినియోగదారుడిపై విద్యుత్‌ చార్జీల భారం పడకుండా చూడటమే చౌక విద్యుత్‌ కొనుగోలు ప్రధానోద్దేశం. ఈ విషయంలో తమిళనాడు, తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సంస్థలే ముందు ఉన్నాయని కూడా కేంద్రం గుర్తించింది. వాస్తవానికి విద్యుత్‌ నిర్వహణ వ్యయంలో కీలకమైన విద్యుత్‌ కొనుగోళ్లను దారికి తేవాలని కేంద్రం సూచించిన నేపథ్యంలో.. అధికారంలోకి రాగానే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోళ్ల భారాన్ని నియంత్రించడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఫలితంగా గడచిన ఏడాది కాలంలో ఈ తరహా సంస్కరణలతో రూ.1,023 కోట్లమేర ప్రజాధనాన్ని ఆదా చేసింది.  

రియల్‌ టైమ్‌ మార్కెట్‌ సద్వినియోగం 
విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రియల్‌ టైమ్‌ మార్కెట్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ తీసుకోవాలంటే ఏ రాష్ట్రమైనా ముందుగా జాతీయ గ్రిడ్‌కు తెలపడం ఆనవాయితీ. గతంలో 24 గంటల ముందే ఈ విషయాన్ని పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ (పీజీసీఐఎల్‌)కు చెప్పాలి. ముందే విద్యుత్‌ డిమాండ్‌ చెప్పినా... వాస్తవ వినియోగంలో హెచ్చుతగ్గులుంటున్నాయి. అంచనాకు మించి విద్యుత్‌ కొనడమో, అంతకన్నా తక్కువే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటమో జరుగుతోంది. ఇదే సమయంలో అన్ని రాష్ట్రాలూ షెడ్యూల్‌ ఇవ్వడం వల్ల మార్కెట్లో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగి, ఎక్కువ ధర పలుకుతోంది. రియల్‌ టైమ్‌ మార్కెట్‌ అందుబాటులోకొచ్చిన తర్వాత  కేవలం 15 నిమిషాల ముందే బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ లభ్యత తెలుసుకోవచ్చు. అప్పటికప్పుడే కావాల్సిన విద్యుత్‌ తీసుకోవచ్చు. అవసరం లేకుంటే నిమిషాల్లోనే విద్యుత్‌ తీసుకోవడం ఆపేయవచ్చు. దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్రం ముందు వరుసలో ఉంది.  

యూనిట్‌ కేవలం రూ.3.12కే కొనుగోలు 
రియల్‌ టైం మార్కెట్‌ను వినియోగించుకుని విద్యుత్‌ ధరలను తగ్గించడంలో దక్షిణాది రాష్ట్రాలలో ఏపీనే ముందుంది. రాష్ట్రంలో వార్షిక విద్యుత్‌ వినియోగం దాదాపు 60 వేల మిలియన్‌ యూనిట్లు (ఎంయూలు)గా అంచనా వేశారు. గత జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు 6,500 (16%) ఎంయూలు యూనిట్‌ సగటున రూ.3.12కు కొనుగోలు చేశారు. వాస్తవానికి ఏపీఈఆర్‌సీ మార్కెట్లో విద్యుత్‌ను యూనిట్‌కు రూ.4.67 వెచ్చించి కొనేందుకు కూడా అనుమతించింది. అయితే రూ.3.12కే కొనుగోలు చేయడం ద్వారా ప్రతి యూనిట్‌పైనా రూ.1.55 ఆదా చేయగలిగారు. ఈ విధంగా రూ.1,023.80 కోట్ల ప్రజాధనం ఆదా అయిందని కేంద్ర విద్యుత్‌ శాఖ గుర్తించింది. తెలంగాణ సంస్థలు గరిష్టంగా 10 శాతం రియల్‌ టైమ్‌ మార్కెట్‌తో రూ. 300 కోట్లు మాత్రమే మిగిలిస్తే, తమిళనాడు 12 శాతం రియల్‌ టైమ్‌ మార్కెట్‌తో మూడో స్థానంలో ఉందని వెల్లడించింది.  

టీడీపీ హయాంలో రూ. 5.90 వరకు చెల్లింపు 
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రైవేటు విద్యుత్‌ ఉత్పత్తిదారులను లెక్కకు మించి ప్రోత్సహించారు. సౌర విద్యుత్‌కు ఏకంగా యూనిట్‌ రూ. 5.25 నుంచి రూ. 5.90 వరకు చెల్లించారు. పవన విద్యుత్‌ ధరలు తగ్గుతున్నా యూనిట్‌కు రూ.4.84 చొప్పున 25 ఏళ్లు చెల్లించేలా 41 దీర్ఘకాలిక పవన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు. ఫలితంగా విద్యుత్‌ సంస్థలు రూ.70,250 కోట్ల అప్పుల్లోకి వెళ్లాయి. డిస్కమ్‌లు రూ.19,920 కోట్ల మేర అప్పుల పాలయ్యాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాదిరిగా 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఏనాడూ ఇంత చౌకగా విద్యుత్‌ కొనలేదు.  

పక్కా ప్రణాళికతో విద్యుత్‌ సంస్థలు 
రియల్‌ టైమ్‌ మార్కెట్‌లో దూసుకుపోయేందుకు ఏపీ విద్యుత్‌ సంస్థలు ముందు నుంచే పక్కా ప్రణాళికతో వెళ్తున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒప్పందాలున్న విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నుంచి వాస్తవ విద్యుత్‌ లభ్యతను అంచనా వేస్తున్నాయి. ఉత్పత్తి కేంద్రాలు అంచనాలు పంపేందుకు కొన్ని గంటల వ్యవధి పట్టే పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. ఇంటర్నెట్‌ ద్వారా ఉత్పత్తి కేంద్రాల నుంచి తక్షణ లభ్యత తెలుసుకునే విధానం తీసుకొచ్చారు. ఇదే క్రమంలో మార్కెట్లో ఎక్కడ చౌకగా విద్యుత్‌ లభిస్తుందో తెలుసుకుంటున్నారు. మార్కెట్లో చౌకగా విద్యుత్‌ లభిస్తుంటే, రాష్ట్రంలో ఖరీదైన విద్యుత్‌ ఉత్పత్తిని తగ్గిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఐటీ రంగ నిపుణులను వాడుకుంటున్నారు. మార్కెట్‌ను అంచనా వేసే సామర్థ్యం గల వారితో ఓ విభాగాన్ని ఏర్పాటు చేశారు. 24 గంటలూ దీనిపై  దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రత్యేక వ్యూహరచనతో ముందుకెళ్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement