purchase of electricity
-
Fact Check: ఎక్స్చేంజీల్లో చెప్పిన ధరకే విద్యుత్ కొనుగోలు
సాక్షి, అమరావతి: జాతీయ ఎనర్జీ ఎక్స్చేంజీల్లో విద్యుత్ ధరలను ఎవరూ నియంత్రించలేరు. కేవలం గరిష్ట సీలింగ్ ధరను మాత్రమే నిర్ణయించగలరు. ఆ అధికారం కూడా కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ)కే ఉంది. ఇంత చిన్న విషయంపైన కూడా అవగాహన లేకనో లేదా ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వంపైన, సీఎం వైఎస్ జగన్ పైనా బురద జల్లాలనే అత్యుత్సాహమో ఈనాడు బుధవారం ఓ తప్పుడు కథనాన్ని అచ్చేసింది. ‘మనం చేస్తే ఖర్చు.. మరొకరైతే దోపిడీ’ అంటూ అవాస్తవాలను అల్లింది. ప్రజల అవసరాలకు రాష్ట్రంలో ఉన్న విద్యుత్ సరిపోనప్పుడు బహిరంగ మార్కెట్లో కొనైనా ఇబ్బంది లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడమే తప్పన్నట్టుగా ఆ కథనంలో అక్కసు వెళ్లగక్కింది. విద్యుత్‌ను బయట నుంచి మూడు రెట్లు అధిక ధరకు కొంటున్నారని, ఆ భారం ప్రజలపైనే వేస్తారని లేనిపోని అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించింది. దీనిపై ఇంధన శాఖ వెల్లడించిన వాస్తవాలు ఇలా ఉన్నాయి. ► దేశంలో విద్యుత్ ఎక్స్చేంజిలు కొత్తగా ఏమీ రాలేదు. 2008–09 ఆర్థిక సంవత్సరం నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి వివిధ రకాల మార్కెట్ సెగ్మెంట్ల ద్వారా స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లు జరుగుతున్నాయి. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు స్వల్పకాలిక విద్యుత్ అవసరాల కోసం ఎప్పటి నుండో ఈ ఎక్స్చేంజిలపై ఆధారపడ్డాయి. ► మార్కెట్ ధరలు ఆ రోజుకి, ఆ టైం బ్లాక్ (ఒక రోజులో 96 టైం బ్లాక్ లు ఉంటాయి. ఒక్కోటీ 15 నిమిషాల సమయం)లో మార్కెట్లో అందుబాటులో ఉన్న విద్యుత్, డిమాండ్ బిడ్లు ఆధారంగా ఉంటాయి. ► ఇందులో బయటి నుంచి ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉండదు. ఈ ఎక్స్చేంజిలు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాల ప్రకారం, మండలి నిబంధనలు, నియమావళికి లోబడి పనిచేస్తాయి. ► నెల వారీగా కొనే ద్వైపాక్షిక విద్యుత్ ఒప్పందాలైతే డీఈఈపీ, ఈ–బిడ్డింగ్ పోర్టల్ ద్వారా నిర్దేశిస్తారు. ఈ పోర్టల్ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది. కేంద్ర విద్యుత్ శాఖ ఎక్స్చేంజిల్లో కొనే విద్యుత్‌కు గరిష్ట ధర (సీలింగ్ ప్రైస్) యూనిట్ రూ.10గా కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి నిర్ధారించింది. ► పీక్ లోడ్ సమయం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా వివిధ కేటగిరీల లోడ్‌ను బట్టి, అందుబాటులో ఉండే ఉత్పత్తి వనరులపై ఆధారపడి ఉంటుంది. అంతే కానీ ఈ ధరలను ఎవరూ నియంత్రించలేరు. ► పీక్ అవర్స్‌లో విద్యుత్ కొనుగోలు కూడా ఇంధన, విద్యుత్ కొనుగోలు వ్యయ సర్దుబాటు చార్జీల రూపంలో వసూలు చేసుకోవడానికి డిస్కంలకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతి ఇచ్చింది. దాని ప్రకారమే చార్జీలు వసూలు చేస్తున్నారు. ► మార్కెట్ ధరలు మూడు రెట్లు పెరగలేదు. గతంలో సీలింగ్ ధర యూనిట్‌కు రూ. 20 ఉండేది. అప్పుడు కూడా అత్యవసరాన్ని బట్టి డిస్కంలు యూనిట్‌కు రూ. 17 వరకు వెచ్చించి కొన్నాయి. ఈ ఏడాది అనూహ్యంగా పెరిగిన డిమాండ్ వల్ల, జల విద్యుత్ లేకపోవడం వల్ల మార్కెట్లో ధరలు పీక్ సమయంలో దాదాపు సీలింగ్ ప్రైస్ యూనిట్ రూ .10, రోజువారీ ధర రూ.6 నుంచి రూ.9 వరకు సీఈఆర్సీ నిర్ణయించింది. అంతేగానీ ధరలు మూడు రెట్లు పెరగలేదు. ► మార్కెట్ కొనుగోళ్లలో ఏ విధమైన ప్రమేయాలూ ఉండవు. ధరలు మార్కెట్ అంశాల ఆధారంగానే నిర్ధారణ చేస్తారు. ► దేశంలోనే అతి పెద్ద విద్యుత్ ఎక్స్చేంజి ఐఈఎక్స్ గణాంకాల ప్రకారం.. సంవత్సరం అంతా సాయంత్రం పీక్ లోడ్ సరాసరి ధరలు (అన్ని నెలలు, సీజన్లు కలుపుకుని) గత 8 సంవత్సరాలుగా ఈ విధంగా ఉన్నాయి. -
ఏపీలో విద్యుత్ కొనుగోలుకు సమస్య లేనట్టే..
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ డిస్కమ్‌లు.. జనరేటర్లకు రూ.412 కోట్లు బకాయి ఉన్నట్టు చూపించిన ప్రాప్తి పోర్టల్ తన పొరపాటును సవరించింది. ఈ బకాయిలను ఇప్పటికే డిస్కమ్‌లు చెల్లించేశాయి. ఈ విషయాన్ని ప్రాప్తి పోర్టల్ దృష్టికి ఏపీ అధికారులు తీసుకెళ్లారు. దీంతో ఏపీలో విద్యుత్ కొనుగోలుకు సమస్య ఇక లేనట్టే.. ఎల్పీఎస్-2002 నిబంధనలను ఏపీ డిస్కమ్‌లు ఖచ్చితంగా పాటిస్తున్నాయి. ఆగష్టు 5న జనరేటర్లకు రూ.1407 కోట్లు డిస్కమ్‌లు చెల్లించాయి. ప్రస్తుతం నిబంధనల ప్రకారం డిస్కమ్‌లకు ఎలాంటి బకాయిలు లేవు. ఏపీ అధికారుల సమాచారాన్ని ప్రాప్తి పోర్టల్ అప్డేట్ చేసింది. చదవండి: చంద్రబాబు పాపం.. డిస్కంలకు శాపం విద్యుత్ మార్కెట్లకు స్వల్పకాలిక యాక్సెస్‌పై పరిమితి తొలగించినట్లు ఇంధన శాఖ కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. నిన్న అర్థరాత్రి నుండి యథాతథంగా విద్యుత్ ఎక్స్ఛేంజీలపై ట్రేడింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా 18న 211 మిలియన్ యూనిట్ల డిమాండ్‌ని డిస్కమ్‌లు రీచ్ అయినట్లు తెలిపారు. రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నామని విజయానంద్ పేర్కొన్నారు. -
ఖరీదైనా.. కొంటున్నాం
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా రోజూ దాదాపు రూ.40 కోట్లు వెచ్చించి బహిరంగ మార్కెట్లో కరెంట్ కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్లు ఇంధన శాఖపై సమీక్ష సందర్భంగా ఉన్నతాధికారులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి నివేదించారు. గత రెండు నెలల్లో సుమారు రూ.2,150 కోట్లు వ్యయం చేసి గృహ, వ్యవసాయ విద్యుత్ అవసరాలకు పూర్తి స్థాయిలో సరఫరా చేస్తున్నట్లు వివరించారు. మార్చిలో 1,268.69 మిలియన్ యూనిట్లను కొనుగోలు చేయగా ఏప్రిల్‌లో 1,047.78 ఎంయూలను కొనుగోలు చేసినట్లు చెప్పారు. బొగ్గు కొనుగోలు విషయంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని, భవిష్యత్తులో మళ్లీ ఇబ్బందులు రాకుండా కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్–సరఫరా, పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, భవిష్యత్‌లో చేపట్టనున్న వాటిపై బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. సమీక్షలో ముఖ్యాంశాలివీ.. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశ వ్యాప్తంగా బొగ్గు సంక్షోభం దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు సంక్షోభం కారణంగా విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు. బొగ్గు సరఫరాలో అంతరాయంతో పలు రాష్ట్రాల్లో కొరత ఏర్పడిందన్నారు. సరిపడా రైల్వే ర్యాక్స్, వెసల్స్(నౌకలు) అందుబాటులో లేకపోవడం, విదేశాల్లో బొగ్గు ధరలు భారీగా పెరగడం తదితర కారణాలన్నీ విద్యుత్ కొరతకు దారితీశాయని వివరించారు. మరోవైపు విద్యుత్ వినియోగం గతంలో కంటే అనూహ్యంగా పెరిగిందన్నారు. మూడేళ్లుగా సమృద్ధిగా కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు, బావుల్లో నీళ్లు పుష్కలంగా అందుబాటులోకి రావడంతో వ్యవసాయ రంగం నుంచి డిమాండ్ స్థిరంగా ఉందని చెప్పారు. కోవిడ్ పరిస్థితుల తర్వాత పారిశ్రామిక ఉత్పత్తి రంగం పుంజుకోవడంతో డిమాండ్ పెరిగిందన్నారు. వేసవి ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో ఉండటంతో ఏప్రిల్ 8న విద్యుత్ డిమాండ్ 12,293 మిలియన్ యూనిట్లకు చేరిందని, ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమని వెల్లడించారు. డిమాండ్ అంచనాలతో కార్యాచరణ గత మార్చిలో విద్యుత్తు కొనుగోలుకు రూ.1123.74 కోట్లు, ఏప్రిల్‌లో రూ.1022.42 కోట్లు వెచ్చించినట్లు సమీక్షలో అధికారులు తెలిపారు. బొగ్గు విషయంలో రానున్న రెండేళ్లు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని కేంద్రం నుంచి సంకేతాలు అందాయని, ప్లాంట్లకు కావాల్సిన బొగ్గులో కనీసం 10 శాతం విదేశాల నుంచి తెచ్చుకోవాలని సూచిస్తున్న విషయాన్ని అధికారులు ప్రస్తావించారు. దీనిపై సీఎం స్పందిస్తూ కొద్ది రోజుల్లో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ తగ్గి ఆ మేరకు అందుబాటులోకి వచ్చి కొరత తీరినప్పటికీ వచ్చే ఏడాది మళ్లీ ఇవే పరిస్థితులు తలెత్తకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలని సూచించారు. భవిష్యత్తు డిమాండ్‌ను అంచనా వేసి ఆ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. సెకీ, ధర్మల్ విద్యుత్ సెకీతో ఒప్పందం వల్ల సుమారు 45 మిలియన్ యూనిట్ల విద్యుత్ రాష్ట్రానికి మూడేళ్లలో మొత్తం మూడు దశల్లో అందుబాటులో వస్తుందని సీఎం జగన్ తెలిపారు. 2023 చివరి నాటికి మొదటి దశలో సుమారు 18 మిలియన్ యూనిట్లు, ఆ తరువాత రెండో దశలో 18 మిలియన్ యూనిట్లు, మూడో దశలో సుమారు 9 మిలియన్ యూనిట్లు చొప్పున అందుబాటులోకి రానుందని వెల్లడించారు. దీంతోపాటు కృష్ణపట్నం, వీటీపీఎస్‌లో కొత్తగా 800 మెగావాట్ల చొప్పున ధర్మల్ విద్యుత్ యూనిట్లు త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. 85 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) అంచనా ప్రకారం మరో 30 మిలియన్ యూనిట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. తద్వారా రాష్ట్రంలో పీక్ అవర్స్‌లో సైతం మిగులు విద్యుత్తు ఉండే పరిస్థితులు ఏర్పడనున్నాయని చెప్పారు. పరిశ్రమలకు నిరంతర విద్యుత్తుపై కార్యాచరణ.. పారిశ్రామిక రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. తద్వారా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల పరిస్థితులు పడకుండా నివారించాలన్నారు. డిమాండ్‌కు తగినట్లుగా విద్యుత్తు సరఫరా చేసేందుకు పారిశ్రామిక రంగ ప్రముఖులు, నిపుణులతో కలసి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. వచ్చే వేసవిలో సమస్యలు ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు జెన్కో ఆధ్వర్యంలోని ప్లాంట్లను అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ పూర్తి సామర్థ్యంతో నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. 85 శాతం పీఎల్ఎఫ్ సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు చేపట్టడం వల్ల నాణ్యమైన విద్యుత్తు చౌక ధరకే అందుబాటులోకి వస్తుందన్నారు. విద్యుదుత్పత్తి ఖర్చులు తగ్గించడంపై కూడా దృష్టి సారించాలన్నారు. ఖర్చులను నియంత్రించగలిగినా ఆదాయం సమకూరినట్లేనని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయం.. పంప్డ్ స్టోరేజీ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు పంప్డ్ స్టోరేజీ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టుల ద్వారా భవిష్యత్తు విద్యుత్ అవసరాలకు భరోసా కలుగుతుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. విద్యుదుత్పత్తి రంగంలో ప్రపంచవ్యాప్తంగా పలు మార్పులు వస్తున్నాయని, పర్యావరణ అనుకూల విధానాలతో విద్యుత్ ఉత్పత్తి జరగాలన్నారు. బొగ్గు ఆధారిత ప్లాంట్ల నుంచి ఇతర మార్గాల వైపు ప్రపంచం మళ్లుతున్న తరుణంలో ప్రత్యామ్నాయ విధానాలు అవసరమన్నారు. పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులు విద్యుత్ రంగంలో ఉత్తమ ప్రత్యామ్నాయాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో 29 చోట్ల ఈ ప్రాజెక్టులకు అవకాశాలున్న నేపథ్యంలో వీటిపై దృష్టి సారించి భూ సేకరణ నుంచి అన్ని రకాలుగా సిద్ధం కావాలని ఆదేశించారు. ప్రతిపాదిత ప్రాజెక్టులు పూర్తైతే 33,240 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వస్తుందని సీఎం తెలిపారు. పీక్ అవర్స్‌లో అధిక ధరలతో విద్యుత్తు కొనుగోలు చేయాల్సి రావడం లాంటి ఇబ్బందులు పంప్డ్ స్టోరేజీ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టుల వల్ల తొలగిపోతాయని చెప్పారు. ఒకసారి ప్రాజెక్టు స్థాపించిన తర్వాత గరిష్టంగా 90 ఏళ్లపాటు ఈ కరెంట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. శరవేగంగా సీలేరు ప్రాజెక్టు సీలేరులో కొత్తగా చేపట్టిన 1,350 మెగావాట్ల ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తి చేయడంపై దృష్టి సారించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. డీపీఆర్ ఇప్పటికే సిద్ధమైందని, త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు అధికారులు తెలిపారు. కృష్ణపట్నం నుంచి 800 మెగావాట్ల విద్యుత్తు జూలై–ఆగస్టు కల్లా వినియోగదారులకు అందనుందని పేర్కొనగా విజయవాడ థర్మల్ కేంద్రంలో కూడా 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. పోలవరం పవర్ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే టన్నెళ్ల తవ్వకం పూర్తైందని, దీనివల్ల పెద్ద ఎత్తున మిగులు విద్యుత్తును సాధించగలుగుతామని అధికారులు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో పైలెట్ ప్రాజెక్టు విజయవంతం శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఉచిత విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు అమర్చడం విజయవంతమైనట్లు అధికారులు తెలిపారు. 2020–21లో జిల్లాలో 26,083 వ్యవసాయ కనెక్షన్లు ఉండగా 2021– 22 నాటికి 28,393కి పెరిగినట్లు చెప్పారు. రాష్ట్రమంతటా ఈ విధానం అమలును వేగవంతం చేసి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా ఉచిత విద్యుత్ డబ్బులను రైతుల ఖాతాల్లోకే జమ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఉచిత విద్యుత్ వినియోగానికి సంబంధించి రైతులే నేరుగా డిస్కమ్‌లకు చెల్లించడం వల్ల సేవల్లో ఎక్కడ ఇబ్బంది తలెత్తినా వెంటనే పంపిణీ సంస్థలను, సిబ్బందిని ప్రశ్నించగలుగుతారని చెప్పారు. విద్యుత్తు శాఖ కూడా రైతుల అభ్యంతరాలు, సమస్యల పరిష్కారంపై నిరంతరం ధ్యాస పెట్టగలుగుతుందని, తద్వారా జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా నాణ్యమైన కరెంటు సరఫరాతోపాటు రైతులకు మంచి సేవలు అందుతాయన్నారు. చెప్పిన దానికంటే మిన్నగా వైఎస్సార్ జలకళ వైఎస్సార్ జలకళ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని సీఎం సూచించారు. మేనిఫెస్టోలో కేవలం బోరు మాత్రమే వేస్తామని చెప్పినప్పటికీ మోటారు ఉచితంగా ఇవ్వడంతో పాటు రూ.2 లక్షల విలువైన విద్యుద్దీకరణ పనులను కూడా ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. రైతులకు దీనివల్ల మరింత మేలు జరుగుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. సమీక్షలో ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఇంధనశాఖ కార్యదర్శి(ఎఫ్ఏసీ), ఏపీజెన్కో ఎండీ బి.శ్రీధర్, ఎన్ఆర్ఈడీసీఏపీ ఎండీ ఎన్వి రమణారెడ్డి, డిస్కమ్‌ల సీఎండీలు తదితరులు పాల్గొన్నారు. -
Telangana: పరిశ్రమలకు షాక్! .. కంపల్సరీ కొనాల్సిందే..!
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు డిస్కంలకే పరిమితమైన పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు నిబంధన ఇక ఓపెన్ యాక్సెస్, కాప్టివ్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ కొనేవాళ్లకూ వర్తించనుంది. డిస్కంలతో పాటు ఓపెన్ యాక్సెస్, కాప్టివ్ వినియోగదారులూ ఏటా తప్పనిసరిగా నిర్దేశిత పరిమాణంలో రెన్యువబుల్ విద్యుత్ కొనుగోలు చేయాల్సి రాబోతోంది. ఇందుకు సంబంధించి తప్పనిసరిగా పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు (రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్/ఈఆర్పీపీఓ) ముసాయిదా నిబంధనలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తాజాగా ప్రకటించింది. 2020–23 నుంచి 2026–27 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. డిస్కంలు, ఓపెన్ యాక్సెస్ వినియోగదారులు.. వాళ్లు కొనే మొత్తం విద్యుత్‌లో 8.5 శాతం పునరుత్పాదక ఇంధనాన్ని 2022–23లో కొనాలి. ఆ తర్వాత క్రమంగా ఏటా ఒక శాతం పెంచుకుంటూ 2026–27 నాటికి 13 శాతానికి పునరుత్పాక ఇంధన సరఫరాను పెంచాల్సి ఉంటుంది. పరిశ్రమలకు షాక్! పెద్ద మొత్తంలో విద్యుత్ వాడే భారీ పరిశ్రమలు ఓపెన్ యాక్సెస్‌లో తక్కువకే దొరికే విద్యుత్ కొంటుంటాయి. సిమెంట్, పేపర్ వంటి కొన్ని భారీ పరిశ్రమలు కాప్టివ్ థర్మల్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని స్వయంగా విద్యుదుత్పత్తి చేసుకుంటుంటాయి. ఓపెన్ యాక్సెస్ విధానం ద్వారా రాష్ట్రంలోని 700కు పైగా పారిశ్రామిక వినియోగదారులు విద్యుత్ కొంటున్నారు. ఈఆర్సీ తాజా ముసాయిదాతో వీళ్లకు విద్యుత్ కొనుగోలు భారంగా మారే అవకాశం ఉంది. వచ్చే ఐదేళ్లకు నిబంధనలు ప్రస్తుతం అమల్లో ఉన్న పునరుత్పాదక విద్యుత్ నిబంధనల గడువు 2021–22తో ముగియనుండటంతో రానున్న ఐదేళ్లకు కొత్త ముసాయిదా నిబంధలను ఈఆర్సీ ప్రకటించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం 2021–22లో రాష్ట్ర డిస్కంలు 8 శాతం పునరుత్పాదక విద్యుత్‌ను కొనాలి. ఇందులో 7.1 శాతం సౌర విద్యుత్, 0.9 శాతం సౌరేతర పునరుత్పాదక విద్యుత్ ఉండేలా చూసుకోవాలి. గతంలో డిస్కంలకే వర్తించిన ఈ నిబంధనలు తాజాగా ఓపెన్ యాక్సెస్, కాప్టివ్ వినియోగదారులకూ వర్తించనున్నాయి. డిస్కంలు, ఓపెన్ యాక్సెస్, కాప్టివ్ వినియోగదారులు కొనే మొత్తంలో విద్యుత్‌లో పునరుత్పాక విద్యుత్ శాతం ఎంత ఉండాలో ఈ కింది పట్టికలో చూడవచ్చు. లక్ష్యం చేరకుంటే జరిమానాలు పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్ల సమాచారాన్ని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) నుంచి ఈఆర్సీ సేకరించనుంది. నిర్దేశించిన లక్ష్యం మేరకు పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయకపోతే డిస్కంలు, ఓపెన్ యాక్సెస్, కాప్టివ్ ప్లాంట్ల విద్యుత్ వినియోగదారులపై ఈఆర్సీ జరిమానా విధించనుంది. జరిమానాలు ఎంత విధించాలో బహిరంగ విచారణలో నిర్ణయం తీసుకోనుంది. జరిమానాలకు తోడు లక్ష్యం కంటే తక్కువ కొన్న పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించిన వ్యయాన్ని ప్రత్యేక ఫండ్‌గా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లక్ష్యం కంటే తక్కువ కొన్న వినియోగదారులు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) జారీ చేసే రెన్యువబుల్ ఎనర్జీ సర్టిఫికెట్‌ను కొని లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఏంటీ పునరుత్పాదక విద్యుత్ శక్తి? సౌర, పవన, జల, బయోమాస్ విద్యుత్‌ను పునరుత్పాదక విద్యుత్ అంటారు. బొగ్గు, ఆయిల్, సహజ వాయువులు వంటి శిలాజ ఇంధనాల నుంచి ఉత్పత్తి చేసే సాంప్రదాయ విద్యుత్‌తో కాలుష్యం పెరిగి పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోంది. ఈ నేపథ్యంలో క్రమంగా ఈ రకం విద్యుత్ వినియోగాన్ని తగ్గించి పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచాలన్న ఉద్దేశంతో జరిమానాలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, కేంద్రంతో పాటు పొరుగు రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో తక్కువగా లక్ష్యాలను నిర్దేశించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. -
విద్యుత్ కొనుగోలు లెక్కలు సిద్ధం
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థలు 2017 నుంచి 2020 వరకు విద్యుత్ కొనుగోలుకు చేసిన ఖర్చుల లెక్కలను సమర్పించేందుకు అనుమతి ఇ వ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)ని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) కోరాయి. 2017–18 సంవత్సరంలో చేసిన ఖర్చును 2018–19 సంవత్సరానికి, 2018–19లో చేసిన ఖర్చును 2019–20కి అన్వయించమని విజ్ఞప్తి చేశాయి. యూనిట్‌కు రూ.3.68 నుంచి రూ.4.62 వరకు వెచ్చించినట్లు ఈపీడీసీఎల్, రూ.3.68 నుంచి రూ.4.63 వెచ్చించినట్లు ఎస్పీడీసీఎల్ వెల్లడించాయి. వీటి ఆధారంగా పూర్తిస్థాయిలో ‘పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేజ్’ గణాంకాలను సమర్పిస్తామని తెలిపాయి. డిస్కంలు చెప్పిన ధరలపై అభ్యంతరాలుంటే తమకు తెలియజేయాలని ఏపీఈఆర్సీ వివిధ వర్గాల విద్యుత్ వినియోగదారులను కోరింది. డిస్కంల ప్రతిపాదనలపై ఫిబ్రవరి 2వ తేదీన వర్చువల్‌గా విచారించనున్నట్లు తెలిపింది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు డిస్కంలకు అవకాశం! ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఏపీఎస్ ఎల్డీసీ) ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రెగ్యులేషన్–2006కి సంబంధించి కొన్ని మార్పులను ప్రతిపాదించింది. విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా బహిరంగ మార్కెట్లో చౌక విద్యుత్ కొనుగోలుకు అవకాశం కల్పించేలా వీటిని రూపొందించారు. రాష్ట్రం విడిపోయినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నిబంధనలతోనే ఏపీఈఆర్సీ నడుస్తోంది. నియామకాలు, కార్యకలాపాలకు సంబంధించి రాష్ట్రానికి ప్రత్యేకంగా నిబంధనలు తయారు చేయాల్సి ఉంది. కేంద్ర విద్యుత్ చట్టం–2003 ప్రకారం నిబంధనలు తయారు చేస్తున్నట్లు ఏపీఈఆర్సీ గతంలోనే తెలిపింది. తాజాగా డిస్కంలకు సంబంధించి రెగ్యులేషన్స్‌లోని 7వ నిబంధనను సవరించాలని ఏపీఎస్‌ఎల్‌డీసీ కోరింది. దీనివల్ల డిస్కంలు పరస్పరం తమ సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటు విద్యుత్ కొనుగోలులో జరిగే ఆలస్యాన్ని అరికట్టవచ్చు. దీనికి సంబంధించిన ప్రతిదీ లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు తెలపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సవరణపై జనవరి 12వ తేదీలోగా ప్రజలు తమ అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలపాలని ఏపీఈఆర్సీ కోరింది. అనంతరం కొత్త రెగ్యులేషన్స్‌ను ప్రకటించనుంది. -
‘సెకీ’ విద్యుత్ లాభమే
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) ఏర్పాటుచేసే 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకోవడం లాభదాయకమేనని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ స్పష్టం చేశారు. ‘సెకీ నుంచి విద్యుత్ కొంటే నష్టమే’ శీర్షికతో ఈనాడు ప్రచురించిన కథనంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రాజెక్టు ఏర్పాటుకు ఇచ్చే నిధులు మౌలిక సదుపాయాలు కల్పించే నిమిత్తం పార్క్ డెవలపర్‌కు చెల్లించేవేనని, బిడ్డింగ్ ధరలో ఈ అంశం కూడా ఉంటుందన్నారు. అలాగే.. జీఎస్టీ పన్నును విద్యుత్ ఉత్పత్తి ధరలో భాగంగా పరిగణించకూడదన్నారు. ‘సెకీ’ నుంచి విద్యుత్ తీసుకోవడంవల్ల ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న భూమి కూడా భవిష్యత్తులో ఇతర ప్రాజెక్టులు చేపట్టడానికి పనికొస్తుందని ఆయన పేర్కొన్నారు. యూనిట్ రూ.2.49 పైసలకు తీసుకుంటే 3% అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార నష్టాలు 7.5 పైసలు మాత్రమే వస్తుందని.. 27 పైసలు కాదని శ్రీకాంత్ తెలిపారు. అంతేకాక.. రాష్ట్రంలో సౌర ప్రాజెక్టులు చేపట్టినప్పుడు వాటికి కావలసిన విద్యుత్ లైన్లు, అంతర్గతంగా విద్యుత్ ప్రసార వ్యవస్థ బలోపేతానికి అయ్యే ఖర్చు.. బయటి రాష్ట్రం నుంచి నేరుగా సౌర విద్యుత్ తీసుకున్నప్పుడు అంతర్గత వ్యవస్థకు అయ్యే ఖర్చుల మధ్య కూడా తేడా ఉంటుందని వివరించారు. ప్రాథమికంగా ఇప్పుడున్న అంతర్రాష్ట్ర, అంతర్గత రాష్ట్ర విద్యుత్ ప్రసార వ్యవస్థల సామర్థ్యాన్ని బేరీజు వేసుకుంటే.. బయటి రాష్ట్రాల నుంచి సౌర విద్యుత్ తీసుకున్నప్పుడే ఖర్చు తక్కువవుతుందని శ్రీకాంత్ స్పష్టంచేశారు. యూనిట్‌కు రూ.1.87 పైసల ఆదా ప్రస్తుతం రూ.4.36 పైసల చొప్పున ఒక యూనిట్ విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నామని.. అయితే, ‘సెకీ’ నుండి దీర్ఘకాలిక ఒప్పందం ద్వారా అదే ఒక యూనిట్ విద్యుత్‌ను 2.49 పైసలకు కొనుగోలు చేయడంవల్ల యూనిట్‌కు రూ.1.87 పైసల వరకు ఆదా అవుతుందని శ్రీకాంత్ తెలిపారు. ఈ లెక్కన ఏటా దాదాపు రూ 3,060 కోట్లు ఆదా అవుతుందని ఆయన వివరించారు. ఉచిత వ్యవసాయ విద్యుత్ కోసమే.. ఇక సీఎం వైఎస్ జగన్ సత్సంకల్పంతో రానున్న 25 ఏళ్లకు రాష్ట్రంలోని రైతుల ఉచిత వ్యవసాయ విద్యుత్ అవసరాల కోసమే ‘సెకీ’ నుంచి విద్యుత్ తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఒక సుస్థిరమైన, ప్రత్యేక ఫీడర్లు కల్గిన, అదనపు లోడ్ గుర్తించే సామర్థ్యమున్న మీటర్లతో ఒక స్వతంత్ర విద్యుత్ వ్యవస్థను తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ఈ తక్కువ ధర సౌర విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అమలులో వున్న సౌర పీపీఏల సగటు యూనిట్ ధర దాదాపు రూ.4.50 ఉందన్నారు. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌కి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్ ధర యూనిట్ రూ.2.79 పైసల (ట్రేడింగ్–మార్జిన్ కలిపి) కన్నా ‘సెకీ’ ప్రతిపాదించిన యూనిట్ రూ.2.49పై. (ట్రేడింగ్–మార్జిన్ కలిపి) ధర తక్కువని శ్రీకాంత్ స్పష్టంచేశారు. కాబట్టి.. అనవసరంగా లేనిపోని అభూత కల్పనలతో అవాస్తవాలను ప్రచారం చేయవద్దని ఆయన హితవు పలికారు. -
Telangana : నష్టాల బాటలో డిస్కంలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల నష్టాలు ఏటేటా పెరిగిపోతున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)లు 2019–20లో మరో రూ.6,061 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇందులో టీఎస్ఎస్పీడీసీఎల్ నష్టాల వాటా రూ.4,940.24 కోట్లు కాగా, టీఎస్ఎన్పీడీసీఎల్ నష్టాల వాటా రూ.1,116.29 కోట్లు. దీంతో 2019– 20 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వీటి నికర నష్టాలు ఏకంగా రూ.42,292 కోట్లకు ఎగబాకాయి. ఇందులో టీఎస్ఎస్పీడీసీఎల్ నికర నష్టాలు రూ.29,303 కోట్లు కాగా, టీఎస్ఎన్పీడీసీఎల్ నికర నష్టాలు రూ.12,983 కోట్లు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తమ వార్షిక నివేదికల్లో ఈ వివరాలను రెండు డిస్కంలు వెల్లడించాయి. 2017–18 ముగిసే నాటికి రూ.28,209.26 కోట్లకు పెరిగిన డిస్కంల నికర నష్టాలు, 2018–19 ముగిసే నాటికి రూ.36,231.47 కోట్లకు చేరాయి. 2020 మార్చి 31 ముగిసే నాటికి రూ.రూ.42,292 కోట్లకు ఎగబాకినట్లు డిస్కంలు స్పష్టం చేస్తున్నాయి. విద్యుత్ సరఫరా వ్యయంతో పోలిస్తే బిల్లు ల వసూళ్లు, ప్రభుత్వ విద్యుత్ సబ్సిడీల ద్వారా వస్తున్న ఆదాయం తక్కువగా ఉంటుండటంతో డిస్కంలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా విద్యుత్ చార్జీలను పెంచకపోవడం కూడా డిస్కంల నష్టాలకు కారణంగా చెబుతున్నారు. ఖర్చులు ఎక్కువ.. ఆదాయం తక్కువ.. ► టీఎస్ఎస్పీడీసీఎల్ 2019–20లో 45,247 మిలియన్ యూనిట్ల (ఎంయూ)ల విద్యుత్ కొనుగోళ్లకు రూ.24,907 కోట్లు, జీతాల చెల్లింపులకు రూ.2,314 కోట్లు, ఆపరేషన్ ఇతర ఖర్చులు రూ.261 కోట్లు, రుణాలపై వడ్డీలు రూ.1,489 కోట్లు, ఆస్తుల తరుగుదల రూ.986 కోట్లు, అసాధారణ ఖర్చులు రూ.148 కోట్లు కలిపి మొత్తం రూ.30,108 కోట్లు ఖర్చు చేసింది. విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.24,600 కోట్లు, ఇతరాత్ర ఆదాయం రూ.46 కోట్లు కలిపి మొత్తం రూ.24,647 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. దీంతో సంస్థకు 2019–20లో రూ.4,940 కోట్ల నష్టాలు వచ్చాయి. ► టీఎస్ఎన్పీడీసీఎల్ 2019–20లో 20,504 ఎంయూల విద్యుత్ కొనుగోళ్లకు రూ.11,326 కోట్లు, ఉద్యోగులకు జీతాల చెల్లింపులకు రూ.1,429 కోట్లు, రుణాలకు వడ్డీల చెల్లింపులకు రూ.626 కోట్లు, ఆస్తుల తరుగుదల రూ.444 కోట్లు, ఇతర ఖర్చులు రూ.305 కోట్లు కలిపి మొత్తం రూ.14,132 కోట్ల వ్యయం చేయగా, 18,650 ఎంయూల విద్యుత్ అమ్మకాల ద్వారా మొత్తం రూ.24,647.65 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. దీంతో సంస్థ 2019–20లో స్థూలంగా రూ.1,116 కోట్లను నష్టపోయింది. -
‘పవర్’ ఫుల్ ఏపీ ..‘రియల్ టైమ్’ హీరో
సాక్షి, అమరావతి: చౌక విద్యుత్ కొనుగోళ్లలో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశంసించింది. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ దృష్టికి కూడా కేంద్ర ఇంధన శాఖ తీసుకెళ్లింది. వినియోగదారుడిపై విద్యుత్ చార్జీల భారం పడకుండా చూడటమే చౌక విద్యుత్ కొనుగోలు ప్రధానోద్దేశం. ఈ విషయంలో తమిళనాడు, తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలే ముందు ఉన్నాయని కూడా కేంద్రం గుర్తించింది. వాస్తవానికి విద్యుత్ నిర్వహణ వ్యయంలో కీలకమైన విద్యుత్ కొనుగోళ్లను దారికి తేవాలని కేంద్రం సూచించిన నేపథ్యంలో.. అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల భారాన్ని నియంత్రించడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఫలితంగా గడచిన ఏడాది కాలంలో ఈ తరహా సంస్కరణలతో రూ.1,023 కోట్లమేర ప్రజాధనాన్ని ఆదా చేసింది. రియల్ టైమ్ మార్కెట్ సద్వినియోగం విద్యుత్ సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రియల్ టైమ్ మార్కెట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ తీసుకోవాలంటే ఏ రాష్ట్రమైనా ముందుగా జాతీయ గ్రిడ్‌కు తెలపడం ఆనవాయితీ. గతంలో 24 గంటల ముందే ఈ విషయాన్ని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (పీజీసీఐఎల్)కు చెప్పాలి. ముందే విద్యుత్ డిమాండ్ చెప్పినా... వాస్తవ వినియోగంలో హెచ్చుతగ్గులుంటున్నాయి. అంచనాకు మించి విద్యుత్ కొనడమో, అంతకన్నా తక్కువే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటమో జరుగుతోంది. ఇదే సమయంలో అన్ని రాష్ట్రాలూ షెడ్యూల్ ఇవ్వడం వల్ల మార్కెట్లో విద్యుత్ డిమాండ్ పెరిగి, ఎక్కువ ధర పలుకుతోంది. రియల్ టైమ్ మార్కెట్ అందుబాటులోకొచ్చిన తర్వాత కేవలం 15 నిమిషాల ముందే బహిరంగ మార్కెట్లో విద్యుత్ లభ్యత తెలుసుకోవచ్చు. అప్పటికప్పుడే కావాల్సిన విద్యుత్ తీసుకోవచ్చు. అవసరం లేకుంటే నిమిషాల్లోనే విద్యుత్ తీసుకోవడం ఆపేయవచ్చు. దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్రం ముందు వరుసలో ఉంది. యూనిట్ కేవలం రూ.3.12కే కొనుగోలు రియల్ టైం మార్కెట్‌ను వినియోగించుకుని విద్యుత్ ధరలను తగ్గించడంలో దక్షిణాది రాష్ట్రాలలో ఏపీనే ముందుంది. రాష్ట్రంలో వార్షిక విద్యుత్ వినియోగం దాదాపు 60 వేల మిలియన్ యూనిట్లు (ఎంయూలు)గా అంచనా వేశారు. గత జూన్ నుంచి డిసెంబర్ వరకు 6,500 (16%) ఎంయూలు యూనిట్ సగటున రూ.3.12కు కొనుగోలు చేశారు. వాస్తవానికి ఏపీఈఆర్సీ మార్కెట్లో విద్యుత్‌ను యూనిట్‌కు రూ.4.67 వెచ్చించి కొనేందుకు కూడా అనుమతించింది. అయితే రూ.3.12కే కొనుగోలు చేయడం ద్వారా ప్రతి యూనిట్‌పైనా రూ.1.55 ఆదా చేయగలిగారు. ఈ విధంగా రూ.1,023.80 కోట్ల ప్రజాధనం ఆదా అయిందని కేంద్ర విద్యుత్ శాఖ గుర్తించింది. తెలంగాణ సంస్థలు గరిష్టంగా 10 శాతం రియల్ టైమ్ మార్కెట్‌తో రూ. 300 కోట్లు మాత్రమే మిగిలిస్తే, తమిళనాడు 12 శాతం రియల్ టైమ్ మార్కెట్‌తో మూడో స్థానంలో ఉందని వెల్లడించింది. టీడీపీ హయాంలో రూ. 5.90 వరకు చెల్లింపు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులను లెక్కకు మించి ప్రోత్సహించారు. సౌర విద్యుత్‌కు ఏకంగా యూనిట్ రూ. 5.25 నుంచి రూ. 5.90 వరకు చెల్లించారు. పవన విద్యుత్ ధరలు తగ్గుతున్నా యూనిట్‌కు రూ.4.84 చొప్పున 25 ఏళ్లు చెల్లించేలా 41 దీర్ఘకాలిక పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు. ఫలితంగా విద్యుత్ సంస్థలు రూ.70,250 కోట్ల అప్పుల్లోకి వెళ్లాయి. డిస్కమ్‌లు రూ.19,920 కోట్ల మేర అప్పుల పాలయ్యాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాదిరిగా 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఏనాడూ ఇంత చౌకగా విద్యుత్ కొనలేదు. పక్కా ప్రణాళికతో విద్యుత్ సంస్థలు రియల్ టైమ్ మార్కెట్లో దూసుకుపోయేందుకు ఏపీ విద్యుత్ సంస్థలు ముందు నుంచే పక్కా ప్రణాళికతో వెళ్తున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒప్పందాలున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వాస్తవ విద్యుత్ లభ్యతను అంచనా వేస్తున్నాయి. ఉత్పత్తి కేంద్రాలు అంచనాలు పంపేందుకు కొన్ని గంటల వ్యవధి పట్టే పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. ఇంటర్నెట్ ద్వారా ఉత్పత్తి కేంద్రాల నుంచి తక్షణ లభ్యత తెలుసుకునే విధానం తీసుకొచ్చారు. ఇదే క్రమంలో మార్కెట్లో ఎక్కడ చౌకగా విద్యుత్ లభిస్తుందో తెలుసుకుంటున్నారు. మార్కెట్లో చౌకగా విద్యుత్ లభిస్తుంటే, రాష్ట్రంలో ఖరీదైన విద్యుత్ ఉత్పత్తిని తగ్గిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఐటీ రంగ నిపుణులను వాడుకుంటున్నారు. మార్కెట్‌ను అంచనా వేసే సామర్థ్యం గల వారితో ఓ విభాగాన్ని ఏర్పాటు చేశారు. 24 గంటలూ దీనిపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రత్యేక వ్యూహరచనతో ముందుకెళ్తున్నారు. -
ఉచిత విద్యుత్ కోసం మెగా సౌర విద్యుత్ ప్లాంట్
సాక్షి, అమరావతి: రాబోయే 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పం మేరకే 10 వేల మెగావాట్ల భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు జ్యుడిషియల్ ప్రివ్యూ పూర్తి చేసుకుని, టెండర్ల దశకు చేరిందని తెలిపారు. మెగా సోలార్ ప్రాజెక్టు పురోగతిని గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ చైర్మన్ సాయిప్రసాద్, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మంత్రికి వివరించారు. దీనిపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేసినట్టు ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ విద్యుత్‌పై చేసే సబ్సిడీ 2015–16లో రూ.3,156 కోట్లు ఉంటే, 2020–21 నాటికి ఇది రూ.8,354 కోట్లకు చేరిందని ఇంధన శాఖ పేర్కొంది. ప్రస్తుతం డిస్కమ్‌లు విద్యుత్ కొనుగోలుకు యూనిట్‌కు రూ.4.68 చెల్లిస్తున్నాయని, అదే సమయంలో సౌర విద్యుత్ ధర రూ.2.43 నుంచి రూ.3.02 వరకు ఉందని తెలిపింది. రాష్ట్రంలో మెగా సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే రానున్న 30 ఏళ్ల కాలంలో రాష్ట్రం రూ.48,800 కోట్లకు పైగా ఆదా చేయవచ్చునని ఏపీజీఈసీఎల్ అధికారులు అంచనా వేసినట్టు పేర్కొన్నారు. సౌర విద్యుత్ ప్రాజెక్టు యూనిట్లను అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. సాంకేతిక ప్రమాణాల ఆధారంగా సౌర విద్యుత్ యూనిట్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు. -
‘పవర్’ఫుల్ సెక్టార్
సాక్షి, అమరావతి: వచ్చే ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని రుణ భారం నుంచి విముక్తి చేసేలా ప్రణాళికలు తయారు చేయాలని విద్యుత్ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. విద్యుత్ కొనుగోలు భారాన్ని పూర్తిగా అదుపులోకి తేవాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఏపీ జెన్కో సామర్థ్యాన్ని పెంచాలన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితిపై బుధవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. గత ఐదేళ్లుగా అత్యధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు చేయడం, అందినకాడికి అప్పులు చేయడం వల్ల విద్యుత్ సంస్థలు సమస్యల్లో పడ్డాయని అధికారులు తెలిపారు. దాదాపు రూ.70 వేల కోట్ల అప్పులున్నాయని, దీనికి ఏటా వడ్డీనే రూ.7 వేల కోట్లు కట్టాల్సి వస్తోందని తెలిపారు. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి ముందుంచారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతికూల పరిస్థితులను ఎలా అధిగమించాలనే దానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అత్యధిక ధరలతో ఒప్పందాలొద్దు విద్యుత్ వ్యవస్థలను అప్పుల్లోకి నెడుతున్న విద్యుత్ కొనుగోలు భారాన్ని గణనీయంగా తగ్గించాలని సీఎం సూచించారు. గత ప్రభుత్వం అత్యధిక రేట్లతో పీపీఏలు చేసుకున్న విధానాలకు స్వస్తి చెప్పాలన్నారు. ఎక్కువ రేటున్న విద్యుత్ కొనుగోళ్లను ఆపేయాలన్నారు. ప్రత్యామ్నాయంగా తక్కువ ధరకే లభించే ఉత్పత్తి కేంద్రాలు, బహిరంగ మార్కెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. చౌకగా లభించే పక్షంలో స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలుపైనా దృష్టి పెట్టాలని సూచించారు. తక్కువ ధరకే విద్యుత్ ఇస్తామని ఎవరు ముందుకొచ్చినా వారితో ఒప్పందాలు చేసుకోవాలని తెలిపారు. దీనివల్ల డిస్కమ్‌లపై భారం తగ్గుతుందన్నారు. చౌకగా విద్యుత్ ఇవ్వాలనుకునే పవన, సౌర విద్యుత్‌ను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితిపై బుధవారం ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జెన్కోను లాభాల బాట పట్టించాలి ఏపీ జెన్కోను లాభాల బాట పట్టించాలని, ఇందుకు అనుగుణంగా సమగ్ర మార్పులు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రైవేట్ థర్మల్ ప్లాంట్లకు నాణ్యమైన బొగ్గు వస్తున్నప్పుడు ఏపీ జెన్కోకు సమస్యలెందు కొస్తున్నాయని ప్రశ్నించారు. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. నాణ్యమైన బొగ్గు తేవడమే కాకుండా పూర్తి లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తో జెన్కో థర్మల్ ప్లాంట్ నడిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బొగ్గు నాణ్యతను పరిశీలించేందుకు థర్డ్ పార్టీతో ఎప్పటికప్పుడు ధ్రువీకరించేలా చూడాలన్నారు. జెన్కో పూర్తి స్థాయిలో ఉత్పత్తిలోకి వస్తే నష్టాలు తగ్గుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల విషయంలో మరింత ఒత్తిడి పెంచుతామన్నారు. రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు చర్చలు జరిపేలా చేస్తామన్నారు. మనకు రావాల్సిన బకాయిల కింద సింగరేణి బొగ్గు తీసుకోవడమో, ఏపీ పవర్ సెక్టార్ అప్పుల్లో ఇవ్వాల్సిన బకాయిల కింద తెలంగాణకు బదలాయించడమో చేయడం సరైన పరిష్కార మార్గాలుగా సీఎం సూచించారు. నష్టాల్లోకి తీసుకెళ్తున్న పాత ప్లాంట్లపై నివేదిక ఇవ్వాలన్నారు. యూనిట్ గరిష్టంగా రూ.2.80పైసలకే లభించేలా ప్రణాళిక ఉచిత విద్యుత్ కోసం ప్రతిపాదించిన 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌పై సీఎం సమగ్రంగా చర్చించారు. 50 వేల ఎకరాలు గుర్తించామని అధికారులు వివరించారు. ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గడువు పెట్టారు. విద్యుత్ గరిష్టంగా యూనిట్ రూ 2.80కే లభించేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. మార్కెట్లో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. ప్రాజెక్టు వ్యయం అనవసరంగా పెరగకుండా చూడాలని కోరారు. అప్పర్ సీలేరులో జెన్కో తలపెట్టిన పంప్డ్ జల విద్యుత్ ప్రాజెక్టు బాధ్యతనూ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చే విషయమై చర్చించారు. వచ్చే ఐదేళ్లకు విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేసి, ఈ ప్రాజెక్టు నుంచి విద్యుత్ పొందేలా చూడాలన్నారు. నిర్మాణ దశలో ఉన్న 800 మెగావాట్ల సామర్థ్యం గల కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం థర్మల్ ప్లాంట్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ రంగంలో అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా కచ్చితమైన పారదర్శకత తీసుకురావాలని, ఉద్యోగులకు కూడా అవసరమైన మేర అంతర్జాతీయ నైపుణ్య శిక్షణ కోసం కసరత్తు చేయాలని అధికారులకు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, సలహాదారు కృష్ణ, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. (ఇండియన్ జ్యుడీషియల్ సర్వీస్) అప్పుల భారం తగ్గించాలి విద్యుత్ సంస్థలకున్న అప్పులకు చెల్లిస్తున్న అత్యధిక వడ్డీని తగ్గించే ప్రక్రియపై సీఎం సమగ్రంగా చర్చించారు. అత్యధికంగా 12 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తున్న అప్పులపై పునరాలోచన అవసరమన్నారు. 8 శాతం వడ్డీకే అప్పులిచ్చే సంస్థల నుంచి రుణాలు తీసుకుని, అత్యధిక వడ్డీ భారం ఉన్న రుణాలు తీర్చాలని, దీనివల్ల ఏటా కొన్ని వేల కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉందని తెలిపారు. అవసరమైతే అప్పులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందన్నారు. సంస్థలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీని ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని తెలిపారు. ఇక మీదట అనవసరమైన అప్పులకు వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. -
ఎన్టీపీసీ కరెంట్‌కు చంద్రబాబు అవినీతి షాక్ : బాలినేని
సాక్షి, అమరావతి : కుడిగి ఎన్టీపీసీ కరెంట్‌కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవినీతి షాక్ తగిలిందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. చంద్రబాబు కమీషన్ల కారణంగా వందల కోట్ల రూపాయల ప్రజా ధనానికి నష్టం వాటిల్లిందని మండిపడ్డారు. ప్రైవేటు సంస్థలకు అధిక ధరలు చెల్లించి విద్యుత్ కొనుగోలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. చంద్రబాబు సొంత మనుషులు నెలకొల్పిన కొన్ని సోలార్, విండ్ పవర్ ప్లాంట్లకు లబ్ధి చేకూర్చేందుకు.. కేంద్ర ప్రభుత్వ సంస్థ కుడిగి ఎన్టీపీసీ నుంచి తక్కువ ధరకు కరెంట్ వస్తున్న ఉద్దేశపూర్వకంగా కొనుగోళ్లు తగ్గించేశారని వెల్లడించారు. కానీ ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా వందల కోట్ల రూపాయల ఫిక్స్ చార్జీలు చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు. చంద్రబాబు దుర్మార్గపు చర్యలు వల్ల కడిగి నుంచి రూ. 4.80కే కరెంట్ లభిస్తున్నా.. రూ.11.84 కొనుగోలుకు అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను గణంకాలతో ఆయన సహా ఆయన వివరించారు. -
విద్యుత్‌పై చర్చకు సిద్ధం
సాక్షి, మహబూబాబాద్/ వరంగల్ రూరల్: విద్యుత్ కొనుగోలుపై చర్చకు తాము సిద్ధమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయమై తన వాదన తప్పని తేలితే ముక్కు నేలకు రాస్తానని, లేకుంటే హైదరాబాద్‌లోని అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ సగం ముక్కు కోస్తానని చెప్పారు. ‘‘మానుకోట సాక్షిగా సవాలు విసురుతున్నా.. దమ్ముంటే కేసీఆర్, ఆయన అనుచరులెవరైనా చర్చకు రావాలని సవాల్ విసిరారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్‌లో, వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ కమీషన్లకు కక్కుర్తిపడి అదనంగా విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని, వాస్తవాలు బయటపెట్టడానికి తాను చర్చకు సిద్ధమన్నారు. 2004లోనే ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని చెప్పారు. లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అప్పటి ప్ర«ధాని మన్మోహన్సింగ్ అనుమతులు ఇచ్చారని.. దాని వల్లే ఉత్పత్తి ఎక్కువైందని, వినియోగం తగ్గిందన్నారు. 24 గంటల విద్యుత్ అవసరం లేకున్నా.. కేవలం కమీషన్ల కోసమే సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వ్యతిరేకి లగడపాటి రాజగోపాల్‌తో, ఆంధ్రా కాంట్రాక్టర్లతో చేతులు కలిపి కమీషన్లు దండుకుంటున్న దరిద్రుడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ఓడిపోతే విద్యుత్ సక్రమంగా రాదని.. చంద్రబాబు పెత్తనం ఉంటుందని.. ప్రతి విషయానికీ ఢిల్లీ వెళ్లాల్సి వస్తుందని కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించి భయపెడుతున్నారని చెప్పారు. కేసీఆర్ నల్ల త్రాచుపాములాంటోడని విమర్శించారు. పుట్టలో నుంచి వచ్చిన పాము మళ్లీ పుట్టలోకే పోతుందని (ఫాంహౌజ్) ఆ విషపు నాగును ప్రజలు పడగపై కొట్టి చంపాలన్నారు. మూడో కన్ను తెరుస్తావా? ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణలో అడుగుపెడితో మూడో కన్ను తెరుస్తానని కేసీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఫాంహౌజ్‌లో కూర్చొని 14 పెగ్గులు తాగితే ఉన్న కళ్లు కూడా మూసుకుపోతాయని.. అలాంటి వ్యక్తి మూడో కన్ను గురించి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. -
ఏపీఈఆర్సీ ఆదేశాలు అమలయ్యేలా చూడండి
కేంద్రానికి తెలంగాణ లేఖ సాక్షి, హైదరాబాద్: విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు అమల్లో ఉన్నట్టేనన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆదేశాలు అమలయ్యేలా చూడాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖకు తెలంగాణ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి మంగళవారం లేఖ రాశారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర విభ జన అనంతరం ఆరు నెలలపాటు ఏపీఈఆర్సీనే రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉంటుందని పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఏపీఈఆర్సీ ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఏపీ మాత్రం ఏపీఈఆర్సీని గుర్తించబోమని, ఆ ఆదేశాలు తాము పాటించమని పేర్కొంటోందని ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహార శైలి విభజన చట్టానికి భిన్నంగా ఉందని వివరించారు. అందువల్ల ఏపీఈఆర్సీ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణకు 53.89 శాతం విద్యుత్తు వచ్చేలా చూడాలని కోరారు. తెలంగాణలో విద్యుత్తు కోతల అంశాన్ని ఈ లేఖ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.