సాక్షి, అమరావతి: వచ్చే ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని రుణ భారం నుంచి విముక్తి చేసేలా ప్రణాళికలు తయారు చేయాలని విద్యుత్ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. విద్యుత్ కొనుగోలు భారాన్ని పూర్తిగా అదుపులోకి తేవాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఏపీ జెన్‌కో సామర్థ్యాన్ని పెంచాలన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితిపై బుధవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. గత ఐదేళ్లుగా అత్యధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు చేయడం, అందినకాడికి అప్పులు చేయడం వల్ల విద్యుత్ సంస్థలు సమస్యల్లో పడ్డాయని అధికారులు తెలిపారు. దాదాపు రూ.70 వేల కోట్ల అప్పులున్నాయని, దీనికి ఏటా వడ్డీనే రూ.7 వేల కోట్లు కట్టాల్సి వస్తోందని తెలిపారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి ముందుంచారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతికూల పరిస్థితులను ఎలా అధిగమించాలనే దానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అత్యధిక ధరలతో ఒప్పందాలొద్దు
విద్యుత్ వ్యవస్థలను అప్పుల్లోకి నెడుతున్న విద్యుత్ కొనుగోలు భారాన్ని గణనీయంగా తగ్గించాలని సీఎం సూచించారు. గత ప్రభుత్వం అత్యధిక రేట్లతో పీపీఏలు చేసుకున్న విధానాలకు స్వస్తి చెప్పాలన్నారు. ఎక్కువ రేటున్న విద్యుత్ కొనుగోళ్లను ఆపేయాలన్నారు. ప్రత్యామ్నాయంగా తక్కువ ధరకే లభించే ఉత్పత్తి కేంద్రాలు, బహిరంగ మార్కెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. చౌకగా లభించే పక్షంలో స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలుపైనా దృష్టి పెట్టాలని సూచించారు. తక్కువ ధరకే విద్యుత్ ఇస్తామని ఎవరు ముందుకొచ్చినా వారితో ఒప్పందాలు చేసుకోవాలని తెలిపారు. దీనివల్ల డిస్కమ్‌లపై భారం తగ్గుతుందన్నారు. చౌకగా విద్యుత్ ఇవ్వాలనుకునే పవన, సౌర విద్యుత్‌ను ప్రోత్సహించాలన్నారు.
రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితిపై బుధవారం ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
జెన్‌కోను లాభాల బాట పట్టించాలి
ఏపీ జెన్‌కోను లాభాల బాట పట్టించాలని, ఇందుకు అనుగుణంగా సమగ్ర మార్పులు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రైవేట్ థర్మల్ ప్లాంట్లకు నాణ్యమైన బొగ్గు వస్తున్నప్పుడు ఏపీ జెన్‌కోకు సమస్యలెందు కొస్తున్నాయని ప్రశ్నించారు. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. నాణ్యమైన బొగ్గు తేవడమే కాకుండా పూర్తి లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)తో జెన్‌కో థర్మల్ ప్లాంట్ నడిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బొగ్గు నాణ్యతను పరిశీలించేందుకు థర్డ్ పార్టీతో ఎప్పటికప్పుడు ధ్రువీకరించేలా చూడాలన్నారు.
జెన్‌కో పూర్తి స్థాయిలో ఉత్పత్తిలోకి వస్తే నష్టాలు తగ్గుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల విషయంలో మరింత ఒత్తిడి పెంచుతామన్నారు. రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు చర్చలు జరిపేలా చేస్తామన్నారు. మనకు రావాల్సిన బకాయిల కింద సింగరేణి బొగ్గు తీసుకోవడమో, ఏపీ పవర్ సెక్టార్ అప్పుల్లో ఇవ్వాల్సిన బకాయిల కింద తెలంగాణకు బదలాయించడమో చేయడం సరైన పరిష్కార మార్గాలుగా సీఎం సూచించారు. నష్టాల్లోకి తీసుకెళ్తున్న పాత ప్లాంట్లపై నివేదిక ఇవ్వాలన్నారు.
యూనిట్ గరిష్టంగా రూ.2.80పైసలకే లభించేలా ప్రణాళిక
ఉచిత విద్యుత్ కోసం ప్రతిపాదించిన 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌పై సీఎం సమగ్రంగా చర్చించారు. 50 వేల ఎకరాలు గుర్తించామని అధికారులు వివరించారు. ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గడువు పెట్టారు. విద్యుత్ గరిష్టంగా యూనిట్ రూ 2.80కే లభించేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. మార్కెట్లో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. ప్రాజెక్టు వ్యయం అనవసరంగా పెరగకుండా చూడాలని కోరారు. అప్పర్ సీలేరులో జెన్‌కో తలపెట్టిన పంప్డ్ జల విద్యుత్ ప్రాజెక్టు బాధ్యతనూ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చే విషయమై చర్చించారు. వచ్చే ఐదేళ్లకు విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేసి, ఈ ప్రాజెక్టు నుంచి విద్యుత్ పొందేలా చూడాలన్నారు. నిర్మాణ దశలో ఉన్న 800 మెగావాట్ల సామర్థ్యం గల కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం థర్మల్ ప్లాంట్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ రంగంలో అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా కచ్చితమైన పారదర్శకత తీసుకురావాలని, ఉద్యోగులకు కూడా అవసరమైన మేర అంతర్జాతీయ నైపుణ్య శిక్షణ కోసం కసరత్తు చేయాలని అధికారులకు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, సలహాదారు కృష్ణ, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. (ఇండియన్ జ్యుడీషియల్ సర్వీస్)
అప్పుల భారం తగ్గించాలి
విద్యుత్ సంస్థలకున్న అప్పులకు చెల్లిస్తున్న అత్యధిక వడ్డీని తగ్గించే ప్రక్రియపై సీఎం సమగ్రంగా చర్చించారు. అత్యధికంగా 12 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తున్న అప్పులపై పునరాలోచన అవసరమన్నారు. 8 శాతం వడ్డీకే అప్పులిచ్చే సంస్థల నుంచి రుణాలు తీసుకుని, అత్యధిక వడ్డీ భారం ఉన్న రుణాలు తీర్చాలని, దీనివల్ల ఏటా కొన్ని వేల కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉందని తెలిపారు. అవసరమైతే అప్పులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందన్నారు. సంస్థలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీని ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని తెలిపారు. ఇక మీదట అనవసరమైన అప్పులకు వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment