సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల నష్టాలు ఏటేటా పెరిగిపోతున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్)లు 2019–20లో మరో రూ.6,061 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇందులో టీఎస్‌ఎస్పీడీసీఎల్ నష్టాల వాటా రూ.4,940.24 కోట్లు కాగా, టీఎస్‌ఎన్పీడీసీఎల్ నష్టాల వాటా రూ.1,116.29 కోట్లు. దీంతో 2019– 20 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వీటి నికర నష్టాలు ఏకంగా రూ.42,292 కోట్లకు ఎగబాకాయి. ఇందులో టీఎస్‌ఎస్పీడీసీఎల్ నికర నష్టాలు రూ.29,303 కోట్లు కాగా, టీఎస్‌ఎన్పీడీసీఎల్ నికర నష్టాలు రూ.12,983 కోట్లు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తమ వార్షిక నివేదికల్లో ఈ వివరాలను రెండు డిస్కంలు వెల్లడించాయి. 2017–18 ముగిసే నాటికి రూ.28,209.26 కోట్లకు పెరిగిన డిస్కంల నికర నష్టాలు, 2018–19 ముగిసే నాటికి రూ.36,231.47 కోట్లకు చేరాయి. 2020 మార్చి 31 ముగిసే నాటికి రూ.రూ.42,292 కోట్లకు ఎగబాకినట్లు డిస్కంలు స్పష్టం చేస్తున్నాయి. విద్యుత్ సరఫరా వ్యయంతో పోలిస్తే బిల్లు ల వసూళ్లు, ప్రభుత్వ విద్యుత్ సబ్సిడీల ద్వారా వస్తున్న ఆదాయం తక్కువగా ఉంటుండటంతో డిస్కంలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా విద్యుత్ చార్జీలను పెంచకపోవడం కూడా డిస్కంల నష్టాలకు కారణంగా చెబుతున్నారు.
ఖర్చులు ఎక్కువ.. ఆదాయం తక్కువ..
► టీఎస్‌ఎస్పీడీసీఎల్ 2019–20లో 45,247 మిలియన్ యూనిట్ల (ఎంయూ)ల విద్యుత్ కొనుగోళ్లకు రూ.24,907 కోట్లు, జీతాల చెల్లింపులకు రూ.2,314 కోట్లు, ఆపరేషన్ ఇతర ఖర్చులు రూ.261 కోట్లు, రుణాలపై వడ్డీలు రూ.1,489 కోట్లు, ఆస్తుల తరుగుదల రూ.986 కోట్లు, అసాధారణ ఖర్చులు రూ.148 కోట్లు కలిపి మొత్తం రూ.30,108 కోట్లు ఖర్చు చేసింది. విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.24,600 కోట్లు, ఇతరాత్ర ఆదాయం రూ.46 కోట్లు కలిపి మొత్తం రూ.24,647 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. దీంతో సంస్థకు 2019–20లో రూ.4,940 కోట్ల నష్టాలు వచ్చాయి.
► టీఎస్‌ఎన్పీడీసీఎల్ 2019–20లో 20,504 ఎంయూల విద్యుత్ కొనుగోళ్లకు రూ.11,326 కోట్లు, ఉద్యోగులకు జీతాల చెల్లింపులకు రూ.1,429 కోట్లు, రుణాలకు వడ్డీల చెల్లింపులకు రూ.626 కోట్లు, ఆస్తుల తరుగుదల రూ.444 కోట్లు, ఇతర ఖర్చులు రూ.305 కోట్లు కలిపి మొత్తం రూ.14,132 కోట్ల వ్యయం చేయగా, 18,650 ఎంయూల విద్యుత్ అమ్మకాల ద్వారా మొత్తం రూ.24,647.65 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. దీంతో సంస్థ 2019–20లో స్థూలంగా రూ.1,116 కోట్లను నష్టపోయింది.
Telangana : నష్టాల బాటలో డిస్కంలు
Published Thu, Jul 29 2021 1:36 AM | Last Updated on Thu, Jul 29 2021 1:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment