సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు డిస్కంలకే పరిమితమైన పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు నిబంధన ఇక ఓపెన్ యాక్సెస్, కాప్టివ్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ కొనేవాళ్లకూ వర్తించనుంది. డిస్కంలతో పాటు ఓపెన్ యాక్సెస్, కాప్టివ్ వినియోగదారులూ ఏటా తప్పనిసరిగా నిర్దేశిత పరిమాణంలో రెన్యువబుల్ విద్యుత్ కొనుగోలు చేయాల్సి రాబోతోంది. ఇందుకు సంబంధించి తప్పనిసరిగా పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు (రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్/ఈఆర్పీపీఓ) ముసాయిదా నిబంధనలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తాజాగా ప్రకటించింది. 2020–23 నుంచి 2026–27 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. డిస్కంలు, ఓపెన్ యాక్సెస్ వినియోగదారులు.. వాళ్లు కొనే మొత్తం విద్యుత్‌లో 8.5 శాతం పునరుత్పాదక ఇంధనాన్ని 2022–23లో కొనాలి. ఆ తర్వాత క్రమంగా ఏటా ఒక శాతం పెంచుకుంటూ 2026–27 నాటికి 13 శాతానికి పునరుత్పాక ఇంధన సరఫరాను పెంచాల్సి ఉంటుంది.
పరిశ్రమలకు షాక్!
పెద్ద మొత్తంలో విద్యుత్ వాడే భారీ పరిశ్రమలు ఓపెన్ యాక్సెస్‌లో తక్కువకే దొరికే విద్యుత్ కొంటుంటాయి. సిమెంట్, పేపర్ వంటి కొన్ని భారీ పరిశ్రమలు కాప్టివ్ థర్మల్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని స్వయంగా విద్యుదుత్పత్తి చేసుకుంటుంటాయి. ఓపెన్ యాక్సెస్ విధానం ద్వారా రాష్ట్రంలోని 700కు పైగా పారిశ్రామిక వినియోగదారులు విద్యుత్ కొంటున్నారు. ఈఆర్సీ తాజా ముసాయిదాతో వీళ్లకు విద్యుత్ కొనుగోలు భారంగా మారే అవకాశం ఉంది.
వచ్చే ఐదేళ్లకు నిబంధనలు
ప్రస్తుతం అమల్లో ఉన్న పునరుత్పాదక విద్యుత్ నిబంధనల గడువు 2021–22తో ముగియనుండటంతో రానున్న ఐదేళ్లకు కొత్త ముసాయిదా నిబంధలను ఈఆర్సీ ప్రకటించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం 2021–22లో రాష్ట్ర డిస్కంలు 8 శాతం పునరుత్పాదక విద్యుత్‌ను కొనాలి. ఇందులో 7.1 శాతం సౌర విద్యుత్, 0.9 శాతం సౌరేతర పునరుత్పాదక విద్యుత్ ఉండేలా చూసుకోవాలి. గతంలో డిస్కంలకే వర్తించిన ఈ నిబంధనలు తాజాగా ఓపెన్ యాక్సెస్, కాప్టివ్ వినియోగదారులకూ వర్తించనున్నాయి. డిస్కంలు, ఓపెన్ యాక్సెస్, కాప్టివ్ వినియోగదారులు కొనే మొత్తంలో విద్యుత్‌లో పునరుత్పాక విద్యుత్ శాతం ఎంత ఉండాలో ఈ కింది పట్టికలో చూడవచ్చు.
లక్ష్యం చేరకుంటే జరిమానాలు
పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్ల సమాచారాన్ని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఎల్డీసీ) నుంచి ఈఆర్సీ సేకరించనుంది. నిర్దేశించిన లక్ష్యం మేరకు పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయకపోతే డిస్కంలు, ఓపెన్ యాక్సెస్, కాప్టివ్ ప్లాంట్ల విద్యుత్ వినియోగదారులపై ఈఆర్సీ జరిమానా విధించనుంది. జరిమానాలు ఎంత విధించాలో బహిరంగ విచారణలో నిర్ణయం తీసుకోనుంది. జరిమానాలకు తోడు లక్ష్యం కంటే తక్కువ కొన్న పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించిన వ్యయాన్ని ప్రత్యేక ఫండ్‌గా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లక్ష్యం కంటే తక్కువ కొన్న వినియోగదారులు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) జారీ చేసే రెన్యువబుల్ ఎనర్జీ సర్టిఫికెట్‌ను కొని లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
ఏంటీ పునరుత్పాదక విద్యుత్ శక్తి?
సౌర, పవన, జల, బయోమాస్ విద్యుత్‌ను పునరుత్పాదక విద్యుత్ అంటారు. బొగ్గు, ఆయిల్, సహజ వాయువులు వంటి శిలాజ ఇంధనాల నుంచి ఉత్పత్తి చేసే సాంప్రదాయ విద్యుత్‌తో కాలుష్యం పెరిగి పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోంది. ఈ నేపథ్యంలో క్రమంగా ఈ రకం విద్యుత్ వినియోగాన్ని తగ్గించి పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచాలన్న ఉద్దేశంతో జరిమానాలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, కేంద్రంతో పాటు పొరుగు రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో తక్కువగా లక్ష్యాలను నిర్దేశించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment