సాక్షి, ముంబై: ముంబై మెట్రో చార్జీల వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ముంబై ప్రాంతీయ అభివృద్థి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ‘ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్’ (ఎంఎంఓపీఎల్) కనీస చార్జీగా రూ.10, గరిష్టంగా రూ.40 వసూలు చేయాలని నిర్ణయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెమ్మార్డీయే బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాని ఈ పిటిషన్‌ను గత నెల 24న బాంబే హై కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో మెట్రో చార్జీలు పెంచేందుకు రిలయన్స్ ఇన్‌ఫ్రాకు మార్గం సుగమమైంది.
ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు, రైలు చార్జీల పెంపు, తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులు సతమతమవుతున్నారు. దీనికి తోడు ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి మెట్రో కొత్త చార్జీలు అమలులోకి వస్తున్నాయి. ఈ లోగానే హైకోర్టు న్యాయమూర్తుల బెంచి ఎదుట మరోసారి అప్పీల్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెమ్మార్డీయే కమిషనర్ యు.పి.ఎస్.మదన్ చెప్పారు. మెట్రో రైలు ప్రారంభానికి ముందే చార్జీలపై రాష్ట్ర ప్రభుత్వం, రిలయన్స్ ఇన్‌ఫ్రా మధ్య వాగ్వాదం జరిగింది.
కనీస చార్జీలు రూ.తొమ్మిది, గరిష్ట చార్జీలు రూ.13 నిర్ణయించాలని అప్పట్లో ప్రభుత్వం సూచించింది. కాని ఈ ప్రాజెక్టు పనులు జాప్యం జరగడంతో వ్యయం పెరిగిపోయి ప్రభుత్వం సూచించిన మేరకు తక్కువ చార్జీల వసూలు వీలుకాదని రిలయన్స్ తేల్చి చెప్పింది. అందుకు ముఖ్యమంత్రి చవాన్ నిరాకరించడమే గాకుండా ప్రారంభోత్సవం కూడా చేయనని మొండికేశారు. దీంతో ఒక మెట్టు దిగివచ్చిన రిలయన్స్ ఇన్‌ఫ్రా ప్రారంభోత్సవం వాయిదా పడకుండా జాగ్రత్త పడింది.
అందుకు ఒక నెల రోజుల వరకు కేవలం రూ.10ల నామమాత్ర చార్జీలకే వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్‌ల మధ్య ఎక్కడైనా ప్రయాణించేందుకు అనుమతి కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆ ప్రకారం ఈ నెల ఏడో తేదీన గడువు ముగియనుంది. ఎనిమిదో తేదీ నుంచి చార్జీలు మండిపోతాయి. అంతకు ముందే కోర్టును తిరిగి ఆశ్రయించాలని ప్రభుత్వం, ఎమ్మెమ్మార్డీయే నిర్ణయం తీసుకున్నాయి.
మెట్రో చార్జీలపై మళ్లీ కోర్టుకు..
Published Thu, Jul 3 2014 11:20 PM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM
Advertisement
Advertisement