
సాక్షి, న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూపు మరోసారి భారీ డిఫమేషన్ సూట్‌ను దాఖలు చేసింది. రాఫెల్ డీల్ పై అవాస్తవాలను, అబద్ధాలను ప్రసారం చేశారని ఆరోపిస్తూ ఇటీవల ఎన్‌డీటీవీ పై 20వేల కోట్ల రూపాయల దావా వేసిన అనిల్ రిలయన్స్ గ్రూపు ఇపుడు మరో మీడియా సంస్థను టార్గెట్ చేసింది.
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ది సిటిజెన్ వ్యవస్థాపకుడు-సంపాదకుడు సీమా ముస్తఫాకు వ్యతిరేకంగా 7వేల కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. రాఫెల్ ఒప్పందంలో తమ కవరేజ్ నేపథ్యంలో తమపై ఈ దావా నమోదైనట్టు సిటిజెన్ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై తమకు మద్దతు, సంఘీభావాన్ని ప్రకటించాల్సిందిగా అభ్యర్థిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
అంబానీ అరోపణలను తిరస్కరించిరన సిటిజన్ తాము వాస్తవాలకు కట్టుబడి నిజాలను నిర్భీతిగా ప్రజలకు అందించేందుకు, నిజాయితీ, జవాబుదారీతనం, సమగ్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలను తాము ఖండిస్తున్నామని తెలిపింది. అలాగే రాజకీయ లేదా కార్పొరేట్ నిధులు లేని స్వతంత్ర మీడియా జర్నలిజం భవిష్యత్తు కీలకమైనదని విశ్వసిస్తున్నామని పేర్కొంది.