హీరో రజనీకాంత్, డైరెక్టర్ కేఎస్ రవికుమార్‌లది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ముత్తు’(1995) చిత్రం సూపర్ హిట్ కాగా, ‘నరసింహా’(1999) మూవీ బ్లాక్‌బస్టర్ అయింది. అయితే వీరికాంబోలో వచ్చిన ‘లింగ’(2014) చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. కాగా ఈ సినిమా ఎడిటింగ్ విషయంలో రజనీకాంత్ జోక్యం చేసుకున్నారంటూ కేఎస్ రవికుమార్ తాజాగా ఆరోపించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ–‘‘లింగ’ సినిమా ఎడిటింగ్ విషయంలో రజనీకాంత్ జోక్యం చేసుకున్నారు. ద్వితీయార్ధం మొత్తం మార్చేశారు.
కంప్యూటర్ గ్రాఫిక్స్‌కి నాకు సమయం ఇవ్వలేదు. అనుష్కతో ఉండే ఒక పాటని, పతాక సన్నివేశంలో వచ్చే ఓ ట్విస్ట్‌ను పూర్తిగా తొలగించారు. కృత్రిమంగా ఉండే బెలూన్ జంపింగ్ సీన్ ని యాడ్ చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా మొత్తాన్ని గందరగోళం చేశారు’’ అని పేర్కొన్నారు. రజనీకాంత్‌పై కేఎస్ రవికుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
అయితే ‘లింగ’ సినిమా గురించి 2016లో కేఎస్ రవికుమార్ మాట్లాడిన మాటలను కొందరు గుర్తు చేస్తున్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా మా సినిమా(లింగ) రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అది మామూలు విషయం కాదు. బాక్సాఫీస్ వసూళ్ల పరంగా మా సినిమా సూపర్‌హిట్’’ అంటూ గతంలో మాట్లాడిన ఆయన.. ఇప్పుడేమో ‘లింగ’ పరాజయానికి రజనీకాంత్ కారణమని చెబుతున్నారంటూ విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment