డిఫెన్స్ రంగంలోకి అనిల్ అంబానీ గ్రూప్
మూడు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసిన రిలయన్స్ ఇన్‌ఫ్రా
న్యూఢిల్లీ: రక్షణ, విమానయాన విడిభాగాల తయారీ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు అనిల్ అంబానీ సారథ్యంలోని అడాగ్ గ్రూప్ గురువారం ప్రకటించింది. భారీగా వృద్ధి అవకాశాలున్న ఈ రంగం మార్కెట్ పరిమాణం వచ్చే పదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు ఎగబాకుతుందని అంచనా. దీనికోసం గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇన్‌ఫ్రాక్చర్ నేతృత్వంలో మూడు అనుబంధ సంస్థ(సబ్సిడరీ)లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.
‘కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం.. దేశంలో సమగ్ర రక్షణ పరికరాల పరిశ్రమ రూపుదిద్దుకోవడానికి అత్యం త సానుకూల పరిస్థితులను కల్పిస్తోంది. తయారీ రంగానికి జోష్‌నిచ్చేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో అడాగ్ గణనీయమైన పాత్రను పోషిస్తుంది. భారత భద్రత దళాలకు అత్యుత్తమ సేవలను అందించడంతో పాటు రక్షణ పరికరాల దిగుమతులను భారీగా తగ్గించడం, ఈ రంగంలో సుశిక్షితులైన నిపుణులను తయారు చేయడం మా లక్ష్యం’ అని అనిల్ అంబానీ వ్యాఖ్యానించారు.