
ఉరకలేస్తున్న ‘బడ్జెట్’ బుల్..!
♦ సానుకూలంగా అంతర్జాతీయ సంకేతాలు
♦ 364 పాయింట్ల లాభంతో 24,607 పాయింట్లకు సెన్సెక్స్
♦ నిఫ్టీ 107 పాయింట్లు అప్... 7,476 వద్ద ముగింపు
♦ మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,600 పాయింట్లు జూమ్
అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ద్రవ్య స్థిరీకరణకు తగిన చర్యలను ప్రతిపాదిస్తూ వచ్చిన అరుణ్ జైట్లీ బడ్జెట్ దేశీ స్టాక్ మార్కెట్‌కు జోష్‌నిచ్చింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు నిలకడగా వుండటం, కమోడిటీ ధరలు పుంజుకుంటుండడం, చైనా మందగమనాన్ని ఎదుర్కొనడానికి ఆ దేశ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుండటం కూడా కలసివచ్చింది. గత 3 ట్రేడింగ్ సెషన్లలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 7 శాతం వృద్ధితో 1,605 పాయింట్లు లాభపడింది. బడ్జెట్ తర్వాత ఏడేళ్లలో సెన్సెక్స్ ఈ స్థాయిలో లాభపడడం ఇదే తొలిసారి.
బడ్జెట్ జోరు వరుసగా మూడో రోజూ కొనసాగింది. కొనుగోళ్ల జోరుకు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు తోడవడంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7,400 పాయింట్లపైకి ఎగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 364 పాయింట్లు (1.50 శాతం)లాభపడి 24,607 పాయింట్ల వద్ద, నిఫ్టీ 107 పాయింట్ల లాభంతో 7,476 పాయింట్ల వద్ద ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీ ధరలు పెరగడంతో లోహ షేర్లు ర్యాలీ జరిపాయి.
మూడు రోజుల్లో 1,605 పాయింట్లు లాభం..
సేవల రంగం మూడు నెలల కనిష్టానికి పడిపోయిందని ఒక ప్రైవేట్ సర్వే వెల్లడించడం, కొత్త ఆర్డర్లు అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఎప్పుడైనా కీలక రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు, భారత్ ఈ ఆర్థిక సంవత్సరంలో 7.3% వృద్ధిని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతం వృద్ధిని సాధించగలదన్న అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) వెల్లడించడం, అమెరికా ఉద్యోగ గణాంకాలు ఉత్సాహకరంగా ఉండడం, గత కొన్ని రోజులుగా అమ్మకాలు జరుపుతున్న విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరుపుతుండడం, ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జీఎస్‌టీ వంటి కీలక బిల్లులు ఆమోదం పొందగలవన్న అంచనాలు.. సానుకూల ప్రభావం చూపాయి. రూపాయి వరుసగా ఐదో రోజూ బలపడడం సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. సెన్సెక్స్ 3 రోజుల్లో 1,605 పాయింట్లు లాభపడింది. 2013 సెప్టెంబర్ తర్వాత సెన్సెక్స్ మూడు రోజుల్లో ఈ స్థాయి లాభాలు ఆర్జించడం ఇదే మొదటిసారి.
టాటా స్టీల్, టాటా మోటార్స్ జోరు: టాటా స్టీల్ 7 శాతం వృద్ధితో రూ.286 వద్ద, ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా లాభపడ్డ షేర్ ఇదే. అమెరికాలో టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు 25 శాతం వృద్ధి చెందడంతో ఈ షేర్ 6 శాతం లాభంతో రూ.336 వద్ద ముగిసింది. జిందాల్ స్టీల్, వేదాంత, హిందాల్కో, ఎన్‌ఎండీసీ, సెయిల్, ఎన్‌ఎండీసీ 4-11 శాతం రేంజ్‌లో పెరిగాయి. 30 సెన్సెక్స్ షేర్లలో నాలుగు మినహా మిగిలిన 26 షేర్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ వృద్ధిపై ఆందోళనలు తగ్గుముఖం పట్టి స్టాక్ మార్కెట్లు స్థిరత్వాన్ని పొందడం, క్రమశిక్షణాయుతమైన బడ్జెట్‌ను జైట్లీ ప్రవేశపెట్టడం, ఇతర వర్థమాన దేశాలతో పోల్చితే భారత్ పటిష్టంగా ఉండడం వంటి కారణాల వల్ల విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జోరుగా ఉన్నాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు.
జోరుగా విదేశీ కొనుగోళ్లు: మన స్టాక్ మార్కెట్‌కు కీలకమైన విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఈ మూడు రోజుల్లో అనూహ్యంగా పెరిగాయి. బడ్జెట్ ముందు వరకూ ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు సాగిస్తూ వచ్చిన విదేశీ ఇన్వెస్టర్ల బడ్జెట్ తర్వాతి నుంచి జోరుగా కొనుగోళ్లు సాగిస్తున్నారు. ఈ నెల 1, 2 తేదీల్లో రూ.4,725 కోట్ల నికర కొనుగోళ్లు జరిపిన విదేశీ ఇన్వెస్టర్లు. గురువారం రోజు రూ.912 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు (నికరంగా) చేశారు.
బడ్జెట్ తర్వాత ర్యాలీ ఎందుకంటే...?
గ్రామీణాభివృద్ధికి, వ్యవసాయ రంగానికి అధిక కేటాయింపులు జరపడం వల్ల వినియోగం అధారిత వృద్ధి జోరుగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ద్రవ్య లోటును 3.5 శాతంలోపే తగ్గించడం కూడా ఇన్వెస్టర్ల మన్నన పొందిందని వారంటున్నారు. ఈ ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోవడానికి తన వంతు తోడ్పాటుగా ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలూ మార్కెట్ ర్యాలీకి కారణమయ్యాయి. రేట్ల కోత ఆశలతో బ్యాంక్ షేర్లు దూసుకెళ్లాయి. గత 5 ట్రేడింగ్ సెషన్లలో డాలర్‌తో రూపాయి మారకం 1.36 పైసలు (2%) లాభపడడం కూడా కలసివచ్చింది. గతమూడు ట్రేడింగ్ సెషన్లలో ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.32 లక్షల కోట్లు పెరిగి రూ.91.15 లక్షలకు కోట్లకు చేరింది.