నిరాశే..
► గిరిజన యూనివర్సిటీకి రూ.కోటి మాత్రమే
► జాడలేని ఐఐఎం సంస్థ
► రోడ్ల విస్తరణకు అవకాశం
► ఉక్కు కర్మాగారానికి ఉత్తచేయి
► మెరుపుల్లేని అరుణ్ జైట్లీ బడ్జెట్
సాక్షి, హన్మకొండ : జిల్లాలో నెలకొల్పబోతున్న గిరిజన యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయల నిధులు కేటాయించింది. సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో గిరిజన యూనివర్సిటీకి కోటి రూపాయలు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. విభజన చట్టం హామీల అమలులో భాగంగా గిరిజన వర్సిటీ , ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సంస్థ (ఐఐఎం) తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పాల్సి ఉంది. వరంగల్ జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. ఇప్పటికే గిరిజన వర్సిటీ వరంగల్‌లో నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా, ఐఐఎం విషయంలో సానుకూలంగా ఉంది. ముఖ్యంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి గిరిజన యూనివర్సిటీ పనులు ప్రారంభించాలనే పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నామమాత్రంగా కోటి రూపాయల నిధులు మాత్రమే కేటాయించింది. దీంతో వర్సిటీ స్థాపన పనుల్లో వేగం మందగించే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పాల్సిన ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సంస్థ విషయంలో బడ్జెట్‌లో ఎటువంటి ప్రస్తావనా లేదు.
ఉక్కు పరిశ్రమకు ఉత్తచేయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా ముడి ఇనుము ఖనిజం పుష్కలంగా ఉన్న గూడూరు, మహబూబాబాద్, ఖమ్మం జిల్లా బయ్యారం మండలాల పరిధిలో ఉక్కు పరిశ్రమను నిర్మించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సెయిల్‌కు ఆదేశాలు జారీ చేసింది. తదనంతరం సెయిల్ ప్రతినిధులు పలుమార్లు గూడూరు, బయ్యారం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. దాంతో ఈ బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు నిర్మాణానికి సంబంధించి కీలక ప్రకటన వెలువడుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. కేంద్రప్రభుత్వం ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఎటువంటి ప్రకటనా చేయలేదు. వరంగల్‌లో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్స్ పార్క్ విషయంలో సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్ర ఆర్థిక మంత్రి పూర్తిగా విస్మరించారు. టెక్స్‌టైల్స్ పార్కుకు సంబంధించి కూడా ఎటువంటి ప్రకటనా లేదు.
రహదారులకు పెద్దపీట
జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వే సింది. ప్రస్తుతం రేణిగుంట - సిరోంచ, హైదరాబాద్ - భూ పాలపట్నం జాతీయ రహదారులు జిల్లా మీదుగా వెళ్తున్నా యి. కేంద్ర ప్రభుత్వం రహదారుల విస్తరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ రెండు రహదారుల విస్తరణకు నిధుల స మస్య ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత బడ్జెట్ సందర్భంగా రోడ్డు విస్తరణకు సంబంధించిన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు పన్ను రహిత బాండ్లు జారీ చేస్తామని కేంద్రం ప్రకటించడం వల్ల యాదగిరిగుట్ట-వరంగల్ హైవే విస్తరణ పనులు ప్రారంభయ్యాయి.
సార్టప్‌లకు ఊతం
కొత్తగా స్థాపించబోయే (స్టార్టప్) కంపెనీలకు తోడ్పాటునందిస్తామంటూ కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. ఐటీ పరిశ్రమను వరంగల్‌లో నిలదొక్కుకునేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ఆరంభించింది. ఇప్పటికే ఐటీ ఇంక్యూబేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. మరోవైపు సెయింట్ కంపెనీ సైతం ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణ పనులు ప్రారంభించింది. ఇక్కడ నెలకొల్పబోయే ఐటీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అందించే పన్ను రాయితీలు ఉపకరిస్తాయి. దీనివల్ల మరిన్ని ఐటీ కంపెనీలు వరంగల్ వైపు దృష్టి సారించేందుకు అవకాశం ఉంది.
పర్యాటక రంగం పుంజుకునేనా..
కేంద్రమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వాహనాల కొనుగోలు ప్రక్రియపై ఉన్న ఆంక్షలను సరళీకృతం చేశారు. దీంతో వా హనాల కొనుగోలు పెరిగే అవకాశం ఉంది. దీని ఫలితంగా చిన్న వాహనాలు పెరిగి ట్రావెనింగ్ ఏజెన్సీలు విస్తరించనున్నారుు. తద్వారా పర్యాటక రంగం పుంజుకుని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యే ఆస్కారం ఉంది. కేబుల్‌టీవీ క్రమబద్ధీకరణలో భాగంగా అనలాగ్ సిస్టమ్‌ను డిజిటలైజ్ చేస్తున్నారు. 2016 మార్చి 31లోగా మున్సిపాలిటీలలో ఉన్న కేబుల్ టీవీ వినియోగదారులు తప్పనిసరిగా సెట్‌బాక్సులు అమర్చుకోవాల్సి ఉంది. ఈ బడ్జెట్‌లో సెట్‌బాక్సులపై పన్నులు తగ్గించారు. దీనివల్ల మున్సిపాలిటీలలో ఉన్న కేబుల్‌టీవీ వినియోగదారులకు లాభం చేకూరనుంది.
బడ్జెట్‌పై ఎవరేమన్నారంటే..
మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వటం ముదావహం. 2018 నాటికి ప్రతి గ్రామానికి విద్యుత్, 2029నాటికి ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని ప్రతిపాదించటం హర్షణీయం. రైతులకు బీమా ద్వారా వారి ఆర్థిక భద్రతకు వీలు కలిగినట్లయింది. సాగునీరుకు రూ.86,500 కోట్లు, ఉపాధి రంగానికి రూ. 38,500 కోట్లు కేటాయించడంతో ఆయూ రంగాలు అభివృద్ధి చెందుతారుు. వ్యవసాయ రంగానికి 35,984 కోట్లు, యువతకు ఉపాధి అవకాశాల కోసం నైపుణ్యాలను పెంపొందించేందుకు రూ. 9 వేల కోట్లు కేటాయించడమంటే ఆ వర్గాలకు పెద్దపీట వేసినట్టే. - సురేశ్‌లాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కేయూ ఎకనామిక్స్ విభాగం
అత్యంత నిరాశాజనకం..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత నిరాశజనక ంగా ఉంది. ఆర్ధిక మందగమనంలో 3.1 శాతం ఉన్నప్పటికీ భారత్ 7.6 శాతం జీడీపీ ఉందని ఐఎంఎఫ్ ఆశాజ్యోతిగా కితాబిచ్చింది. భారత్ మంచి స్థితిలోఉన్నప్పుడు ఉద్యోగులకు ,పెన్షనర్లకు మధ్యతరగతి వారికి ఆదాయ పన్ను స్లాబులలో మార్పు సూచించకపోవటం గమనార్హం. రైతులకు గిట్టుబాటు ధర ప్రస్తావనే లేదు. పాపింగ్ మాల్స్ వారం రోజులు తెరిచి వుండేలా అనుమతి ఇవ్వడంతో చిరు వ్యాపారులపై ప్రభావం పడతుంది. పన్ను ఎగవేత దారులపై కొరడా ఝుళిపించే శక్తి ఈ ప్రభుత్వాలకు లేదు. కార్పొరేట్ శక్తులకే కొమ్ముకాచే ప్రభుత్వం ఇది. - టి.సీతారాం, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లాప్రధాన కార్యదర్శి
వేతన జీవులకు మొండిచేయి...
ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్‌లో వేతన జీవులకు నిరాశే మిగిలింది. వ్యక్తిగత పన్ను స్లాబు రేట్లు సవరించకపోవటంతో కేంద్ర ప్రభుత్వం వేతన జీవులపై మి గులను కూడా లాగేసుకుంది. కార్పొరేట్ శక్తులకు రాయితీల పేరుతో వేలకోట్లు ఇస్తున్న ప్రభుత్వం సగటు వేతన జీవిపై కనికరం చూపలేదు. స్టాక్, బీమా ,పెన్షన్ రంగాల్లోలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆహ్వానించటం ద్వారా పింఛన్ సౌకర్యం ప్రమాదంలో పడుతుంది. - బద్దం వెంకటరెడ్డి, టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
తాత్కాలిక ప్రయోజనాలకే పరిమితం
తాత్కాలిక ప్రయోజనాలకే బ డ్జెట్‌ను పరిమితం చేశారు. ప్రజల సామాజిక ప్రయోజనాలను కాపాడుతూ దేశాన్ని ముందుకు నడిపేలా రూపొందిస్తే బాగుండేది. ప్రస్తుతం దేశం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ తరుణంలో వ్యవసాయ రంగానికి పెద్ద మొత్తంలో నిధులు కేటారుుంచాలి. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేలా మార్కెటింగ్ వ్యవస్థ పటిష్టానికి నిధులు ఇవ్వకపోవడం దురదృష్టకర-త్రిపురనేని గోపిచంద్, చార్టెర్డ్ అకౌంటెంట్
మార్పులకు అనుగుణంగా ఉంది
ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా బడ్జెట్ తయారుచేశారు. వ్యవసాయ, పారిశ్రమిక రంగాలతో పాటు యువతకు ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయం. అరుుతే సామాన్య ప్రజలు అశించిన ఆదాయపు పన్ను రేటు తగ్గించకపోవడం, పన్ను చెల్లింపు పరిమితిలో మాత్రమే రిబేట్ ఇవ్వడం నిరాశ కలిగించింది. - రాజేంద్ర కుమార్, ఐసీఏఐ వరంగల్ బ్రాంచ్ చైర్మన్
నిర్మాణ రంగాలను ప్రోత్సహించారు
గృహనిర్మాణ సంస్థలకు 100శాతం పన్ను మినహాయింపు ఇవ్వ డంతో నిర్మాణ రంగాన్ని ఉత్తేజ పరిచారు. రోడ్లకు, హైవేలకు రూ.55వేల కోట్లు కేటాయించడం హర్షణీయం. మొత్తంగా ఈ బ డ్జెట్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. సాగునీటి ప్రాజె క్టులకు రూ.85 వేల కోట్లు కేటాయించడంతో రైతులకు లబ్ధి చేకూరుతుంది. - తిప్పర్తి రాఘవరెడ్డి, చార్టెర్డ్ అకౌంటెంట్
రూ.5వేల మినహాయింపు సరిపోదు
బడ్జట్‌లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను పూర్తిగా విస్మరించింది. కేవలం ఆదాయ పన్ను మినహాయింపు 2 వేల నుంచి 5 వేలకు పెంచారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది 90 శాతం మంది ఉద్యోగలకు వర్తించదు. ఎందుకంటే నాలుగో తరగతి ఉద్యోగులు కూడా ప్రస్తుతం ఆదాయ పన్ను పరిధిలోకి వస్తున్నారు. - కాందారి బిక్షపతి, వీఆర్వోల సంఘం రాష్ట్ర సహ అధ్యక్షుడు
మా అభ్యర్థనలు పట్టించుకోలేదు.
జిల్లాలో ఇటీవల జరిగిన అఖిల భారత మహిళా ఉద్యోగులజాతీయ సదస్సులో మహిళలకు ఆదాయ పన్ను పరిమితి కనీసం 4 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశాం. ప్రభుత్వానికి వినతులు ఇచ్చాం. అయినా మా అభ్యర్థన పట్టించుకోలేదు. ఉద్యోగులను బడ్జట్ తీవ్ర నిరాశకు గురిచేసింది. - ఇ.వి.కిరణ్మరుు, గెజిటెడ్ అధికారుల సంఘం ప్రచార కార్యదర్శి
దేశాన్ని ప్రపంచ స్థాయిలో ఆవిష్కరింపజేసేలా ఉంది
గ్రామీణ భారతాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ రానున్న కాలంలో ప్రపంచంలోనే దేశాన్ని అద్బుతంగా తీర్చిదిద్దేలా కేంద్ర బడ్జెట్ ఉంది. బ్యాంకులు, పీఆర్, రైతు రుణాలకు భారీగా నిధులు కేటారుుంచారు. ఎల్‌పీజీ కనెక్షన్‌లు, ఆరో గ్య భీమా, 3 సంవత్సరాలలో 100 శాతం గ్రామాల విద్యుద్దీకరణ, రేషన్ షాప్‌ల ఆన్‌లైన్ రంగాలకు సముచిత స్థానం కల్పించారు. నిరుపయోగ విమానాశ్రయాల అభివృద్ధికి రూ.150 కోట్లు కేటాయించడంతో మామునూరు విమానశ్రాయం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. - పీ.వీవి.నారాయణ రావు, చార్టెర్డ్ అకౌంటెంట్
బడ్జెట్ నిరుత్సాహపరిచింది.
ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ఉద్యోగులను కేంద్ర బడ్జట్ పూర్తిగా నిరుత్సాహపరిచింది. బడ్జట్‌లో ఉద్యోగుల గురించి ఏ మాత్రం ఆలోచించిలేదు. దొడ్డిదారిన పన్నులు ఎగ్గొట్టే వారిని వదిలి ప్రతి పైసకు పన్ను చెల్లించే ఉద్యోగుల ద్వారా ఆదాయం పెంచుకోవాలని చూడడం దుర్మార్గం. - జగన్మోహన్‌రావు, టీజీవోస్ అధ్యక్షుడు
ఆదాయపన్ను పరిమితి పెంచాల్సింది
ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయ పన్ను పరిమితి కనీసం 5 లక్షలకు పెంచాలనే డిమాండ్ ఉంది అయితే ఈ విషయంలో కొంతయినా పెంచితే బాగుండేది. రాష్ట్రంలో 43 శాతం పీఆర్సీ ఇవ్వడంతో దాదాపు ప్రతి ఉద్యోగి ఆదాయ పన్ను పరిధిలోకి వస్తున్నారు. ఈ సమయంలో కేంద్రం ఉద్యోగుల పరంగా ఆలోచించక పోవడం బాధాకరం. - కుమారస్వామి, ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు
రాష్ట్రం ఇస్తుంటే... కేంద్రం తీసుకుంటోంది
ఉద్యోగులు పోరాడి 43 శాతం పీఆర్సీ సాధించుకున్నారు. ప్రభుత్వం డీఏ విడుదల చేసింది, తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చింది. ఇలా ఉద్యోగుల పక్షపాతిగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటే... కేంద్రం మాత్రం ఉద్యోగుల నుంచి సాధ్యమైనంత వరకు పన్నులు వసూలు చేసుకునే ఆలోచనతో ఉన్నట్లు బడ్జట్‌లో స్పష్టమవుతోంది. బడ్జట్‌పై ఉద్యోగులెవ్వరూ సంతృప్తిగా లేరు. - ఫణికుమార్. ట్రెస్సా కేంద్ర సంఘం కార్యదర్శి