ప్చ్ | With the tilted end of the central budget | Sakshi
Sakshi News home page

ప్చ్

Published Tue, Mar 1 2016 12:05 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

ప్చ్ - Sakshi

ప్చ్

మధ్య తరగతి వర్గానికి భారం
కేంద్ర బడ్జెట్‌తో ఒరిగింది అంతంతే
పెదవి విరిచిన వేతన జీవి

 
సిటీబ్యూరో: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ గ్రేటర్ సిటీజనులకు నిరాశను మిగిల్చింది. ఆదాయ పన్ను శ్లాబు రేటు పెరుగుతుందనుకున్న వేతన జీవుల ఆశలు అడియాశల య్యాయి. ప్లాస్మా టీవీ వంటివి కొనుగోలు చేయాలనుకున్న  మధ్యతరగతి వాసి కలలు బడ్జెట్ బాదుడుతో కొండెక్కాయి.  హైటెక్ నగరిలో స్మార్ట్‌ఫోన్‌తో సత్వర వై-ఫై సేవలు పొందాలనుకున్న వారికి ధరల పెరుగుదలతో వాటి కొనుగోలు వాయిదా వేసుకునే పరిస్థితి తలెత్తింది. మండు వేసవిలో  ఏసీ గాలులతో సేదదీరదామనుకున్న నగర వాసికి తాజా బడ్జెట్ పట్టపగలే చుక్కలు చూపింది. చిన్నారులకు బ్రాండెడ్ ఆటవస్తువులు, ఇంటిల్లిపాదికీ బ్రాండెడ్ దుస్తులు కొనిపించాలనుకున్న తల్లిదండ్రులూ ఒకటికి రెండుసార్లు పర్సు చూసుకోవాల్సిన పరిస్థితి. కెమెరాలు, కంప్యూటర్లు కొనుగోలు చేయాలనుకున్న యువతరానికి ఉసూరుమనిపించింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు కొనుగోలు చేయాలనుకున్న మధ్య తరగతి వర్గానికి తాజా పెరుగుదల శాపంగా పరిణమిస్తోంది. కొద్దోగొప్పో పొదుపు చేసి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకున్న గృహిణుల ఆశలపై తాజా బడ్జెట్ నీళ్లు చల్లింది. మాల్స్‌లో నచ్చిన, మెచ్చిన వస్తువుల కొనుగోలు పైనా అదనపు సుంకం మోపడం మింగుడు పడని అంశం.

ఇంటిల్లీపాదీ కలిసి నెలకోసారి రెస్టారెంట్‌లో భోజనం చేద్దామనుకున్న మధ్య తరగతిపై సర్వీసు ట్యాక్స్ రూపేణా గుదిబండ మోపడం గమనార్హం. సినిమా, పర్యాటక రంగాలనూ వదలలేదు. వినోదంపైనా 0.50 మేర కృషి కళ్యాణ్ సెస్ విధింపుతో మధ్య తరగతి షాక్‌నిచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు. క్రెడిట్ కార్డులతో కొనుగోలు, బీమా, నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్, హోటళ్లు, ఆర్కిటెక్చర్, కొత్త ఆస్తుల కొనుగోలుపై సేవా పన్ను రూపేణా బాదుడుకు తెర తీయడంతో గ్రేటర్ సిటీజనులు నిట్టూరుస్తున్నారు. నగరం నలుచెరగులా విస్తరిస్తున్న సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమల ఊతానికి కేటాయింపులు లేకపోవడం తో పారిశ్రామిక వర్గాలు సైతం నిరాశ చెందాయి. నిరుపేదలకు రూ.లక్ష ఆరోగ్య బీమా కల్పిస్తామనడం గ్రేటర్ పరిధిలోని 1,470 మురికివాడల్లో ఉన్న లక్షలాది మంది అల్పాదాయ, పేద వర్గాలకు ఊరటకలిగిస్తున్న అంశం.
 
బ్రాండెడ్‌పై బండ..

గ్రేటర్ పరిధిలోని మాల్స్, ఇతర వస్త్ర దుకాణాలలో నెలకు రూ.300 కోట్ల వరకు దుస్తుల వ్యాపారం సాగుతున్నట్లు అంచనా. వీటిలో మధ్య తరగతి వర్గం, వేతనజీవులు, ఎగువ మధ్య తరగతి వర్గం వివాహాది శుభకార్యాల సందర్భంగా బ్రాండెడ్ దుస్తుల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. బడ్జెట్‌లో ఈ దుస్తులపై సుంకం పెంపుతో బ్రాండెడ్ షర్టు, ప్యాంటుపై రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు వస్త్ర వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే గిరాకీ లేక వెలవెలబోతున్న షోరూమ్‌లకు తాజా పెంపు శరాఘాతమేనని      అంటున్నారు.
 
నిరాశే...
ఆదాయ పన్ను శ్లాబు రేటు రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెరుగుతుందనుకున్న సగటు వేతన జీవికి బడ్జెట్ నిరాశే మిగిల్చింది. శ్లాబు రేటును పెంచకపోవడంతో వీరంతా పెదవి విరుస్తున్నారు. రూ.ఐదు లక్షల లోపు ఆదాయం కలిగి.. ఈ రిటర్న్స్ దాఖలు చేస్తున్న వారు ప్రస్తుతం రూ.2 వేలు రాయితీ పొందుతున్నారు. ఇక నుంచి ఈ రాయితీని రూ.5 వేలకు పెంచడం గుడ్డిలో మెల్ల. దీంతో గ్రేటర్ పరిధిలో సుమారు ఐదు లక్షల మందికి స్వల్ప ఊరట లభించనుంది.
 
ఆరోగ్యమస్తు
గ్రేటర్ పరిధిలో సుమారు 1,470 లక్షల మురికివాడలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 5 లక్షల వరకు అల్పాదాయ, మధ్యాదాయ, కార్మిక వర్గాలు నివాసం ఉంటున్నాయి. తాజా బడ్జెట్‌లో వీరందరికీ కుటుంబం యూనిట్‌గా రూ.లక్ష ఆరోగ్య బీమా ప్రకటించడం ఉపశమ నం కలిగిస్తోంది. వయోవృద్ధులకు బీమాలో అదనంగా రూ.30 వేలు ఇవ్వనుండడం ఊరటనిస్తోంది.
 
బ్రాండెడ్‌పై బండ..
గ్రేటర్ పరిధిలోని మాల్స్, ఇతర వస్త్ర దుకాణాలలో నెలకు రూ.300 కోట్ల వరకు దుస్తుల వ్యాపారం సాగుతున్నట్లు అంచనా. వీటిలో మధ్య తరగతి వర్గం, వేతనజీవులు, ఎగువ మధ్య తరగతి వర్గం వివాహాది శుభకార్యాల సందర్భంగా బ్రాండెడ్ దుస్తుల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. బడ్జెట్‌లో ఈ దుస్తులపై సుంకం పెంపుతో బ్రాండెడ్ షర్టు, ప్యాంటుపై రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు వస్త్ర వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే గిరాకీ లేక వెలవెలబోతున్న షోరూమ్‌లకు తాజా పెంపు శరాఘాతమేనని      అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement