పేదలకు పెద్దపీట.. ఆ ఉద్యోగులకు ఊరట
న్యూఢిల్లీ: ఎన్నో అంచనాలు, ఆశల మధ్య కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ చిట్టాను సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఊహించినట్టే బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చేదిశగా జైట్లీ బడ్జెట్ ప్రసంగం సాగింది. గ్రామీణ ప్రాంతాలకు సహకారం అందించడం, వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడం, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయడం వంటి పేదల అనుకూల చర్యలను జైట్లీ బడ్జెట్ లో ప్రకటించారు. అదేవిధంగా మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చే పలు చర్యలను ఆయన ప్రతిపాదించారు.
ఓవైపు జైట్లీ బడ్జెట్ ప్రవేశపెడుతుండగానే మరోవైపు స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఓ దశలో 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాలను కొంతమేరకు పూడ్చుకొనే దిశగా సాగింది. జీడీపీ లోటును వచ్చే ఏడాదికి 3.5శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకు అనుగుణంగా రోడ్డుమ్యాప్ తయారుచేసుకొని ముందుకువెళుతామని జైట్లీ తెలిపారు. మూడోసారి బడ్జెట్ చిట్టాను ప్రవేశపెట్టిన జైట్లీ సామాజిక పథకాలకు పెద్ద ఎత్తున కేటాయింపులు జరిపారు. అయితే, ఈ కేటాయింపులకు అనుగుణంగా ప్రభుత్వం నిధులు ఎలా సమకూరుస్తుందనేది ప్రధాన సమస్య.
ప్రజలు ముఖ్యంగా పేదలు, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం కేటాయించిన నిధులను తెలివిగా సమర్థంగా వినియోగిస్తామని జైట్లీ తెలిపారు. 'నైన్ పిల్లర్స్' (9 మూలస్తంభాల) ఆధారంగా దేశ ఆర్థిక వ్యవస్థ అజెండాను సమూలంగా మారుస్తామని, ఈ తొమ్మిది మూల స్తంభాల్లో మొదటిది వ్యవసాయం, రైతుల సంక్షేమమేనని జైట్లీ చెప్పారు. ఈ అజెండాలో భాగంగా వ్యవసాయం, సామాజిక సంస్కరణలు, మౌలిక వసతుల కల్పన, బ్యాంకింగ్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడంపై విధానపరమైన ఫోకస్ పెడతామని చెప్పారు.
'రైతులకు మనం తిరిగి ఇవ్వాల్సిన అవసరముంది. ఆహార భద్రతను దాటి వారి ఆదాయ భద్రత గురించి మనం ఆలోచించాల్సిన అవసరముంది. 2022నాటికి రైతుల ఆదాయాన్ని మేం రెట్టింపు చేస్తాం' అని జైట్లీ ప్రకటించారు. రైతుల సంక్షేమం కోసం ఆయన బడ్జెట్ లో రూ. 35,984 కోట్లు ప్రకటించారు.
యూపీఏ ప్రతిష్టాత్మక పథకమైన ఉపాధి హామీకి ఈ ఏడాది బడ్జెట్ లో రెట్టింపు నిధులు ప్రతిపాదించడం గమనార్హం. గ్రామీణ అభ్యుదయంలో కీలకమైన ఈ పథకానికి రూ. 38,500 కోట్లు ప్రకటించారు. ఈ మొత్తం నిధులను ఈ ఏడాదికాలంలో ఖర్చు చేస్తే.. ఈ పథకంపై అత్యధికంగా ఖర్చు చేసిన మొత్తం ఇదే కానుందని ఆయన తెలిపారు.
మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఊరట
రూ. ఐదు లక్షల కన్న తక్కువ ఆదాయం ఉన్నవారికి టాక్స్ డిడక్షన్ పరిమితిని రూ. 2వేల నుంచి రూ. 5వేలకు పెంచుతున్నట్టు జైట్లీ ప్రకటించారు. అలాగే సొంతిల్లు లేక అద్దె కడుతున్నా.. తాము పనిచేసే కంపెనీ నుంచి అద్దె అలవెన్సు పొందని ఉద్యోగులకు కూడా టాక్స్ చెల్లింపులో ఊరట కల్పించారు. సొంత ఇళ్లు లేకుండా అద్దె కడుతున్నవారికి ప్రస్తుతం సెక్షన్ 80 జిజి కింద హెచ్ఆర్‌ఏలో ఏడాదికి రూ. 24 వేల వరకు పన్ను మినహాయింపు ఇస్తుండగా, దాన్ని మాత్రం రూ. 60 వేలకు పెంచారు.