
రెండు కొత్త సెస్సులు
♦ కార్లపై ఇన్‌ఫ్రా .. సర్వీసులపై కృషి కల్యాణ్ సెస్సు
♦ 15 శాతానికి పెరగనున్న సేవా పన్ను
♦ టన్ను బొగ్గుపై సెస్సు రూ.200 నుంచి రూ.400కు పెంపు
న్యూఢిల్లీ: బడ్జెట్‌లో కేంద్రం కొత్తగా మరో రెండు సెస్సులను ప్రతిపాదించింది. వ్యవసాయ రంగ వృద్ధికి వనరులు సమీకరించే దిశగా.. పన్నులు వర్తించే అన్ని సర్వీసులపైనా కృషి కల్యాణ్ సెస్సు, కార్లపై ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్సు విధించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. వీటి ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 8,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. మొత్తం మీద అయిదు ప్రధాన సెస్సుల ద్వారా ఆదాయం 2016-17లో మరో రూ. 23,116 కోట్లు పెరిగి .. రూ. 54,450 కోట్ల పైచిలుకు రాగలదని అంచనా.
జూన్ 1 నుంచి మొబైల్ బిల్లులు, హోటళ్లలో భోజనాలు మొదలుకుని విమాన ప్రయాణాల దాకా పన్నులు వర్తించే అన్ని రకాల సర్వీసులపైనా కృషి కల్యాణ్ సెస్సు (కేకేసీ)ని విధించనున్నారు. దీని ద్వారా రూ. 5,000 కోట్లు రాగలవని అంచనా. ఈ నిధులను వ్యవసాయ రంగ వృద్ధికి వినియోగించనున్నారు. కేకేసీ విధింపుతో సర్వీస్ ట్యాక్స్ రేటు అర శాతం మేర పెరిగి 15 శాతం కానుంది. ఇక, కార్లపై ఇన్‌ఫ్రా సెస్సుతో రూ. 3,000 కోట్లు రావొచ్చని అంచనా. మరోవైపు ఏటా రూ. 50 కోట్లకు మించి ఆదాయాన్ని రాని 13 సెస్సులను జైట్లీ తొలగించారు.
♦ పెట్రోలు, ఎల్‌పీజీ, సీఎన్‌జీ ఇంధనం వినియోగించే చిన్న కార్లపై 1 శాతం, నిర్దిష్ట సామర్థ్యం గల డీజిల్ కార్లపై 2.5 శాతం, ఎస్‌యూవీలు.. పెద్ద కార్లు.. అధిక ఇంజిన్ సామర్ధ్యం గల వాహనాలపై 4 శాతం మేర ఇన్‌ఫ్రా సెస్సు ఉంటుంది.
♦ త్రిచక్ర వాహనాలు, ఎలక్ట్రికల్ వాహనాలు, హైబ్రీడ్ వాహనాలు, ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ఉపయోగించే హైడ్రోజెన్ వాహనాలకు దీన్నుంచి మినహాయింపు లభిస్తుంది. అలాగే, ప్రత్యేకంగా ట్యాక్సీలు, అంబులెన్సులు, వికలాంగుల కోసం ఉపయోగించే కార్లకు సైతం ఇన్‌ఫ్రా సెస్సు నుంచి మినహాయింపు ఉంటుంది.
♦ బొగ్గు, లిగ్నైట్ మొదలైన వాటిపై విధిస్తున్న సెస్సు పేరు మార్చి... టన్నుకు రూ. 200గా ఉన్నదాన్ని రూ. 400కు పెంచారు. దీని పేరును స్వచ్ఛ ఇంధన సెస్సు నుంచి స్వచ్ఛ పర్యావరణ సెస్సుగా మార్చారు. దీని ద్వారా 2016-17లో రూ. 26,148 కోట్లు రాగలవు. అటు ఆయిల్ ఇండస్ట్రీస్ అభివృ ద్ధి సెస్సును విలువ ఆధారిత రేటుగా మార్చి .. మెట్రిక్ టన్నుకు రూ. 4,500 కాకుండా 20 శాతం రేటు చొప్పున విధిస్తారు. దీని వల్ల ప్రభుత్వానికి కొంత ఆదాయం తగ్గనుంది. ఈ ఆర్థిక సంవత్సరం రూ. 14,962 కోట్లు రానుండగా, వచ్చేసారి ఇది రూ. 10,303 కోట్లకే పరిమితం కాగలదని అంచనా.