తయారీ సంస్థలకు తోడ్పాటు
పారిశ్రామిక కార్యకలాపాలను ప్రోత్సహించటం, ఉపాధి కల్పనకు ఊతమిచ్చేందుకు బడ్జెట్‌లో కొత్త తయారీ యూనిట్లకు తక్కువ కార్పొరేట్ ట్యాక్స్ విధించేలా ప్రతిపాదనలు చేశారు. వీటి ప్రకారం ఈ ఏడాది మార్చి 1 తర్వాత ఏర్పాటయ్యే కొత్త తయారీ యూనిట్లకు కార్పొరేట్ ట్యాక్స్ 25 శాతమే (సర్‌చార్జి, సెస్సులు అదనం) ఉంటుంది. దీన్ని పొందాలంటే ఆయా సంస్థలు.. లాభాలు, పెట్టుబడుల ఆధారిత డిడక్షన్లు మొదలైనవి క్లెయిమ్ చేసుకోకూడదు. మరోవైపు, రూ. 5 కోట్ల టర్నోవరు ఉండే చిన్న యూనిట్లకు దీన్ని 30 శాతం నుంచి 29 శాతానికి (సర్‌చార్జి, సెస్సు అదనం) తగ్గించినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రస్తుతం 30 శాతం ఉన్న కార్పొరేట్ ట్యాక్స్‌ను నాలుగేళ్లలో దశలవారీగా 25 శాతానికి తగ్గించే దిశగా చర్యలు ప్రతిపాదించినట్లు చెప్పారు. కొత్త సెజ్ యూనిట్లు.. సెక్షన్ 10ఏఏ ప్రయోజనాలు పొందాలంటే 2020 మార్చి 31 నాటికల్లా కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంటుంది.