
రహదారులకు రూ.97వేల కోట్లు
న్యూఢిల్లీ: రోడ్లు, జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్ర బడ్జెట్ లో రూ.55 వేల కోట్లు కేటాయించారు. ఎన్‌హెచ్ఏఐ మరో 15 వేల కోట్లను బాండ్ల ద్వారా సేకరిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. 2016-17 కేంద్ర ఆర్థిక బడ్జెట్ ను సోమవారం లోక్ సభలో ఆయన ప్రవేశపెట్టారు. రహదారుల రంగంలో మొత్తం రూ. 97వేల కోట్లు వ్యయీకరించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రాల్లో 55 వేల కిలోమీటర్ల రహదారులను హైవేలుగా మారుస్తామని తెలిపారు. రూ. 50-100 కోట్లతో 160 విమానాశ్రయాలను ఆధునీకరిస్తామని చెప్పారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
రోడ్ల మీద ప్రయాణికుల ట్రాఫిక్ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా మోటారు వాహనాల చట్టంలో కొన్ని సవరణలు చేస్తాం. బస్సులను కావల్సిన రూట్లలో నడుపుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును మెరుగుపరిచేందుకు దీన్ని అమలు చేస్తాం. దీనిని రాష్ట్రాలు కూడా తమకు అనుగుణంగా అమలు చేసుకోవచ్చు.