ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ఊతం
న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీలు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంకోసం కేంద్రం తాజా బడ్జెట్‌లో ‘స్టాండప్ ఇండియా’ పథకం కింద రూ.500 కోట్లను కేటాయించింది. దీనితోపాటు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు వృత్తిపరమైన సాయం అందించడానికి వివిధ పారిశ్రామిక సంఘాల సహకారంతో కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖలో జాతీయ హబ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2016-17 బడ్జెట్‌లో ప్రకటించారు. పరిశ్రమలు, వాణిజ్యరంగంలో ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తలు మంచి ఫలితాలు కనబరుస్తున్నారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలు, మహిళలు వ్యాపార, పారిశ్రామికరంగాల్లో రాణించడానికోసం రూ.500 కోట్లు కేటాయించడం ఆనందంగా ఉందని జైట్లీ అన్నారు. ప్రతీ బ్యాంకు బ్రాంచిల్లో ఒక్కో కేటగిరీలో కనీసం రెండు ప్రాజెక్టుల చొప్పున ఆర్థిక సాయం అందేలా చూస్తామని చెప్పారు. దీనిద్వారా దాదాపు 2.5 లక్షలమందికి లబ్ధికలుగుతుందని మంత్రి తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవాలను జరుపుకొంటున్న నేపథ్యంలో ఈ సంవత్సరం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల సాధికారతకు ఊతం లభించాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు.
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాలకు రూ.100 కోట్లు
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి, గురు గోవింద్‌సింగ్ 350వ జయంతి ఉత్సవాల నిర్వహణకోసం రూ. 100కోట్ల చొప్పున కేంద్రం బడ్జెట్ కేటాయింపులు చేసింది. కాగా, 2017లో 70వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో ఇన్నేళ్లలో సాధించిన విజయాలను ఆ వేడుకలసందర్భంగా మననం చేసుకోవడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆర్థికమంత్రి జైట్లీ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా పేర్కొన్నారు.
మైనారిటీల కోసం ‘ఉస్తాద్’
మైనారిటీల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధికోసం ‘ఉస్తాద్’ పేరిట పథకాన్ని అమలు చేస్తారు. ఈ పథకంద్వారా బహుళ రంగాల్లో మైనారిటీల అభివృద్ధికోసం చర్యలు చేపడతారు.