పన్నుల్లో ఊరట తక్కువే! | less tax rates in Union Finance Minister Arun Jaitley | Sakshi
Sakshi News home page

పన్నుల్లో ఊరట తక్కువే!

Published Tue, Mar 1 2016 4:03 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

పన్నుల్లో ఊరట తక్కువే! - Sakshi

పన్నుల్లో ఊరట తక్కువే!

ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పూ లేదు. ఇది మధ్య తరగతిని నిరాశపరిచేదే. కాకపోతే కాస్త తక్కువ ఆదాయం ఉన్నవారిపై మాత్రం జైట్లీ కొంత కనికరం చూపించారు. బాగా ఎక్కువ ఆదాయం ఉన్నవారిని ఇంకాస్త మొత్తారు. తొలిసారి రుణంతో ఇంటిని కొనుక్కునేవారికి మరిన్ని వడ్డీ ప్రయోజనాలిచ్చారు. టీడీఎస్‌తో చిన్న పన్ను చెల్లింపుదారులు ఇబ్బంది పడుతున్నారని, త్వరలోనే సరళమైన విధానాన్ని తెస్తామని చెప్పారు జైట్లీ.
 

  •  80 జీజీ కింద హెచ్‌ఆర్‌ఏ పరిమితి రూ.60,000కు పెంపు
  •  5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి 5,000 ట్యాక్స్ రిబేట్
  •  తొలిసారి ఇల్లు కొంటే వడ్డీపై అదనంగా 50,000 మినహాయింపు
  •  ఎన్‌పీఎస్ నుంచి విత్‌డ్రా చేసుకునే 40 %  మొత్తానికి పన్నుండదు
  •  కోటిరూపాయల ఆదాయం దాటితే సర్ చార్జీ ఇక 15 శాతం

 
 తక్కువ ఆదాయం... తక్కువ ఊరట
  రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి ఇప్పటిదాకా పన్నులో రూ.2,000 రిబేటు ఇస్తున్నారు. దీన్నిపుడు రూ.5,000కు పెంచారు. దీంతో రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.3,000 అదనపు ప్రయోజనం లభించనుంది. 2013లో అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం సెక్షన్ 87ఏ కింద ఈ రిబేటును ప్రవేశపెట్టారు. అంటే నెలకు రూ.41 వేలు ఆదాయంలోపు ఉన్నవారికే ఈ ప్రయోజనం. అది దాటితే ఎలాంటి రిబేటూ ఉండదు. అదీ లెక్క.
 
 హెచ్‌ఆర్‌ఏ అలవెన్స్ లేనివారికి..
     కంపెనీలన్నీ హెచ్‌ఆర్‌ఏ ఇవ్వవు. కొందరు అద్దె ఇంట్లో ఉన్నా వారికి హెచ్‌ఆర్‌ఏ ప్రయోజనం లభించదు. అలాంటివారు ఇప్పటి వరకూ  సెక్షన్ 80 జీజీ కింద రూ.24,000 మొత్తాన్ని హెచ్‌ఆర్‌ఏ కింద తగ్గించి చూపించుకునే అవకాశం ఉండేది. ఇపుడు ఆ మొత్తాన్ని రూ.60 వేలకు పెంచారు. అంటే హెచ్‌ఆర్‌ఏ లేని ప్రతి ఒక్కరికీ అదనంగా రూ.36,000 మినహాయింపు లభిస్తుంది. వ్యక్తిగత ట్యాక్స్ శ్లాబుల్నిబట్టి గరిష్ఠంగా 10,800 వరకు పన్ను ప్రయోజనం లభిస్తుంది. ఇలా పెంచటం ఊరటే అయినా... ఏడాదికి రూ.60 వేలంటే నెలకు రూ.5వేల కింద లెక్క. ప్రస్తుత ధరల ప్రకారం రూ.5వేల అద్దెకు మంచి ఇల్లు ఎక్కడైనా వస్తోందా? మరి ఇది నిజంగా ఊరటేనా?
 
 తొలిసారి ఇంటిని కొంటే
     ఒకవంక రియల్ ఎస్టేట్ దెబ్బతినటంతో దేశీయంగా డిమాండ్ పెంచటానికి, నిర్మాణ రంగానికి ఊతమివ్వటానికి జైట్లీ మరో నిర్ణయం తీసుకున్నారు. రుణం తీసుకుని ఇల్లు కట్టుకునేవారికి వడ్డీ విషయంలో అదనపు ప్రయోజనం కల్పించారు. తొలిసారి ఇంటిని కొనుగోలు చేస్తున్న వారికి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 24 కింద లభించే రూ.2 లక్షలకు అదనంగా రూ.50,000 ప్రయోజనాన్ని కల్పిస్తూ ఈ బడ్జెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. కానీ దీని కోసం కొన్ని షరతులు విధించారు. ఇంటి ధర రూ. 50 లక్షలు దాటకుండా... తీసుకునే రుణం రూ.35 లక్షలు దాటకుండా ఉంటేనే ఈ ప్రయోజనం వర్తిస్తుంది.
 
 ఎక్కువ ఆదాయం.. ఎక్కువ వడ్డన
     ఏడాదికి కోటి రూపాయలు దాటి సంపాదించేవారిపై వడ్డన మరికాస్త పెంచారు. అలాంటివారు ఇప్పటిదాకా పన్ను చెల్లించటంతో పాటు... సూపర్ రిచ్ సర్‌ఛార్జీ పేరిట 12 శాతాన్ని చెల్లించేవారు. ఇపుడు ఈ సర్‌ఛార్జిని 15 శాతానికి పెంచారు. 2013లో అప్పటి ఆర్థిక మంత్రి తొలిసారిగా ఈ సూపర్ రిచ్ సర్‌చార్జిని 10 శాతంగా ప్రవేశపెట్టారు. గత బడ్జెట్‌లో జైట్లీ వెల్త్ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేసి సూపర్ రిచ్ సర్ చార్జీని 12 శాతానికి పెంచారు. ఇప్పుడు ఇది 15 శాతం అయ్యింది.
 
 ఎన్‌పీఎస్ విత్‌డ్రా.. ట్యాక్స్ ఫ్రీ
 నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ను (ఎన్‌పీఎస్) మరింత ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నం చేశారు. ఇతర పింఛన్ పథకాల మాదిరిగానే ఎన్‌పీఎస్ నుంచి చేసే విత్ డ్రాయల్స్‌పై కూడా పన్ను భారాన్ని తీసేశారు. 60 ఏళ్లు దాటాక ఎన్‌పీఎస్ కార్పస్ నుంచి మామూలుగా 60 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేయొచ్చు మిగిలిన 40 శాతాన్ని యాన్యుటీ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. తద్వారా పింఛన్ వస్తుంది. అయితే విత్‌డ్రా చేసుకునే మొత్తంపై ఇప్పటిదాకా పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇకపై మాత్రం విత్‌డ్రా చేసుకునే మొత్తం 40 శాతందాకా ఉంటే ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. 60 శాతమైతే మాత్రం... మిగిలిన 20 శాతంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఎన్‌పీఎస్ మాదిరిగా 1-4-2016 నుంచి ఈపీఎఫ్‌లో కూడా మార్పులు జరుగుతాయి. విత్‌డ్రాయల్స్‌పై 40 శాతం వరకు మాత్రమే పన్ను మినహాయింపులుంటాయి. అలాగే సింగిల్ ప్రీమియం పెన్షన్ పాలసీపై సర్వీస్ ట్యాక్స్‌ను 3.5 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
 
 ఉద్యోగమిస్తే ఈపీఎఫ్ సాయం..
 
     కొత్త ఉద్యోగాలు కల్పించడానికి, పరిశ్రమలన్నీ ఈపీఎఫ్ పరిధిలోకి రావటానికి కేంద్రం కొత్త ప్రోత్సాహకాలు కల్పించింది. కొత్త ఉద్యోగి కనక ఈపీఎఫ్‌లో చేరితే... మూడేళ్లపాటు యాజమాన్యం చెల్లించాల్సిన వాటాను (జీతంలో 8.33 శాతం) కేంద్రమే ఈపీఎఫ్‌కి జమ చేస్తుంది. అయితే ఉద్యోగి జీతం రూ.15,000 దాటి ఉండకూడదు. దీని వల్ల జీతంలో కనీసం 8.33 శాతం ఈపీఎఫ్‌కి జమచేయాలన్న నిబంధన నుంచి కంపెనీలకు మూడేళ్లు ఊరట లభిస్తుంది. ఉద్యోగికీ లాభం ఉంటుంది.  ఇందుకోసం బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించడం జరిగింది.
 
 చౌక ఇళ్లకు ప్రోత్సాహకాలు
     గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకునేలా అందుబాటు ధరల్లో నిర్మించే ఇళ్లకు ఈ బడ్జెట్‌లో ప్రోత్సాహకాలిచ్చారు. చౌక ఇళ్లను నిర్మించే సంస్థలకు వచ్చే లాభాల్లో 100 శాతం డిడక్షన్‌కు వీలు కల్పించారు. మెట్రో నగరాల్లో 30 చదరపు అడుగుల్లో, మిగిలిన పట్టణాల్లో 60 చదరపు అడుగుల్లో నిర్మించే ఫ్లాట్స్‌కి ఈ ప్రయోజనం లభిస్తుంది.
 
 బీమా ఏజెంట్లకు టీడీఎస్ ఊరట
     ముందస్తు పన్ను మినహాయింపు (టీడీఎస్) నుంచి ఊరట దొరికింది. ముఖ్యంగా బీమా ఏజెంట్ల కమీషన్‌పై విధించే టీడీఎస్‌ను 10 నుంచి 5 శాతానికి తగ్గించారు. ఇంతకాలం కమీషన్ రూపంలో వచ్చే ఆదాయం రూ.20,000 దాటితేనే టీడీఎస్ వర్తించేది. దీన్నిప్పుడు రూ.15,000కు తగ్గించారు. బీమా పాలసీకి చేసే చెల్లింపులపై విధించే టీడీఎస్‌ను 2 శాతం నుంచి 1 శాతానికి తగ్గించారు. నేషనల్ సేవింగ్ స్కీం (ఎన్‌ఎస్‌ఎస్) కమీషన్లపై టీడీఎస్‌ను 20 నుంచి 10 శాతానికి, బ్రోకింగ్ కమీషన్లపై టీడీఎస్‌ను 10 నుంచి 5 శాతానికి తగ్గించారు.
 
 ఎస్‌ఎంఈలు, వృత్తి నిపుణులకు ఊరట
     చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వృత్తి నిపుణులకు పెద్ద ఊరటే ఇచ్చారు. రెండు కోట్ల లోపు టర్నోవర్ కలిగిన వారు... తమ టర్నోవర్‌లో 8%  లాభం వస్తుందని అంచనా వేసుకుని... దానిపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అలాంటివారు ఎటువంటి అకౌంటింగ్ బుక్స్ రాయాల్సిన పని కూడా లేదు. గతంలో ఈ పరిమితి కోటి రూపాయలుగా ఉండేది. దీనివల్ల సుమారు 30లక్షల మంది చిరు వ్యాపారులకు ఊరట లభించనుంది. అలాగే డాక్టర్లు, ఇంజినీర్లు వంటి వృత్తి నిపుణులు తమ ఆదాయం కనక రూ.50 లక్షల లోపు ఉంటే... ఆదాయంలో 50 శాతాన్ని లాభంగా అంచనా వేసుకుని, దానిపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. వీరు కూడా అకౌంట్ బుక్స్ రాయాల్సిన పని ఉండదు.
 
 ఇప్పుడు పన్ను శ్లాబులు ఎలా ఉన్నాయంటే...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement