పన్నుల ఆదాయానికి భారీగా గండి | Huge break to the Tax revenues | Sakshi
Sakshi News home page

పన్నుల ఆదాయానికి భారీగా గండి

Published Thu, Mar 31 2016 3:53 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

పన్నుల ఆదాయానికి భారీగా గండి - Sakshi

పన్నుల ఆదాయానికి భారీగా గండి

ఖజానాకు రూ.393కోట్లు నష్టం చేకూరిందన్న కాగ్
 
 సాక్షి, హైదరాబాద్: పలు శాఖల అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయానికి భారీగా గండిపడిందని కాగ్ వెల్లడించింది. అసలు పన్నులే విధించకపోవడం, తక్కువగా విధించడం, ఆదాయానికి గండి కొట్టడం ఫలితంగా ప్రభుత్వం ఖజానాకు చేరాల్సిన రూ.393.43కోట్లను కోల్పోయిందని పేర్కొంది. 2014-15లో వాణిజ్య పన్నులు, ఆబ్కారీ, రిజిస్ట్రేషన్, స్టాంపులు, భూమి శిస్తు, రవాణా శాఖలకు చెందిన 216 యూనిట్ల (కార్యాలయాల) రికార్డులను కాగ్ పరిశీలించింది. మొత్తంగా 1,299 కేసుల్లో పన్నులు, సుంకాలు విధించకపోవడం, తక్కువగా విధించడం వంటివి వెల్లడయ్యాయని కాగ్ పేర్కొంది.

వ్యాట్ ఆడిట్ మాన్యువల్‌లో పేర్కొన్న తనిఖీ నిబంధనలను పాటించకపోవడంతో రూ.45.92 కోట్ల రెవెన్యూ నష్టం జరిగిందని వెల్లడించింది. ఇక 2,644 రవాణా వాహనాల యజమానుల నుంచి రూ.4.23 కోట్ల త్రైమాసిక పన్ను సహా రూ.8.45 కోట్ల జరిమానాను రవాణాశాఖ రాబట్టలేదని కాగ్ పేర్కొంది. అలాగే ఆబ్కారీ శాఖ పరిధిలో కల్లు అద్దెలు తక్కువగా విధించడం, బార్లు, రెస్టారెంట్లపై అదనపు లెసైన్సు ఫీజు విధించకపోవడంతో రూ.50 లక్షల వరకు నష్టం వచ్చినట్లు తెలిపింది.

 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అక్రమాలు
 ఐదు జిల్లా రిజిస్ట్రార్లు, 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించి 134 దస్తావేజుల్లో ఆస్తులను తక్కువ విలువ కట్టిన ఫలితంగా రూ.2.50కోట్ల స్టాంపు డ్యూటీ, బదిలీ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు నష్టపోయినట్లు కాగ్ పేర్కొంది. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్, 10 రిజిస్ట్రార్ల కార్యాలయాల్లో 28 దస్తావేజులు తప్పుగా వర్గీకరించారని ఆడిట్ తే ల్చింది. దీనివల్ల రూ.1.84 కోట్ల స్టాంపు డ్యూటీ, బదిలీ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు కోల్పోయినట్లు తెలిపింది. 20 భూసేకరణ అధికారుల కార్యాలయాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా అనేక జాతీయ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకుల్లో రూ.294.78 కోట్ల మేర డిపాజిట్లు చేశారని... వాటిపై వచ్చిన రూ.2.93కోట్ల వడ్డీని భూసేకరణకు కాకుండా ఇతరత్రా వాడుకున్నారని తేల్చింది. 19 కేసుల్లో 462.41 ఎకరాల భూమిని సేకరించేప్పుడు ధర నిర్ణయంలో నిబంధనలను పట్టించుకోలేదని, దాంతో రూ.12.18 కోట్ల ప్రతిఫలం అధికంగా చెల్లించారని స్పష్టం చేసింది.
 
రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా లోపభూయిష్టమని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆక్షేపించింది. నిధుల కేటాయింపులకు, ఖర్చుకు అసలు పొంతనే ఉండడం లేదని ఎండగట్టింది. కాగ్ నివేదికను ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. శాసనసభకు వెల్లడించకుండా ప్రభుత్వం భారీ మొత్తాన్ని ఖర్చు చేయడాన్ని తప్పుబట్టింది.  పన్ను ఆదాయ అంచనాల్లో నేలవిడిచి సాము చేయడాన్ని ఆక్షేపించింది. పాఠశాల, ఉన్నత విద్య, మధ్యాహ్న భోజన పథకాల నిర్వహణలో నిర్లిప్తతను కాగ్ ప్రశ్నించింది. జెన్‌కో విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు వినియోగం, నిర్వహణలో లోపాలను, పన్ను వసూళ్లలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది. పశుసంవర్థక శాఖలో పథకాలు నిలిపివేత, రవాణా, అబ్కారీ శాఖల ఫీజు వసూళ్లలో అక్రమాలపై మండిపడింది.
 
 ప్రణాళిక లోపాలతో ప్రజాధనం వృథా
 పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ప్రణాళిక అవసరమన్న కాగ్
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ సంస్థల ఆర్థికస్థితిని ఒక సమగ్ర రూపానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం మంచి ప్రణాళికను తయారు చేయాల్సి ఉందని కాగ్ పేర్కొంది. సామాజిక తనిఖీల్లో గుర్తించిన నిధుల మళ్లింపును తిరిగి రాబట్టుకోవడం లేదని, శాఖాధికారులు తనిఖీలు చేయడం లేదని, స్టాక్ రిజిష్టరు, క్యాష్‌బుక్‌లను కూడా సరిగ్గా నిర్వహించడం లేదని ఆక్షేపించింది. ఇలాంటి కారణాలతో మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో రూ.15.18 లక్షల నిధులు దుర్వినియోగమయ్యాయని తెలిపింది.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని 18 గ్రామాలకు నీరందించే సమగ్ర రక్షిత మంచినీటి పథకం ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయ వనరులను అన్వేషించకపోవడం, జలమండలిని ఒప్పించకపోవడంతో రూ.18.29 కోట్లు వృథా అయ్యాయని ఎండగట్టింది. చెత్తసేకరణ దశలో వేరుచేసి శాస్త్రీయ విధానంలో నిర్మూలించేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలేవీ రాష్ట్ర మున్సిపల్ విభాగం రూపొందించలేదని కాగ్ ఎండగట్టింది. ప్రజల్లో అవగాహన కల్పించడం కానీ... తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించే విధానం కానీ ఎక్కడా అమలు కావడం లేదని తెలిపింది. చాలా చోట్ల చెత్త సేకరణ రుసుమును కూడా వసూలు చేయడం లేదని, రెండు పట్టణాల్లో పరిశీలన చేస్తే రూ.1.22 కోట్ల ఆదాయం కోల్పోయినట్లుగా తేలిందని పేర్కొంది.
 
 ‘సామాజిక’ బాధ్యత మరిచారు
 పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో తాగునీరు సహా సామాజిక మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిం చాల్సి ఉందని కాగ్ అభిప్రాయపడింది. మరుగుదొడ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ), సామాజిక వినియోగ కేంద్రాల(సీయూసీ) ఏర్పాటులో లోటుపాట్లున్నాయని పేర్కొంది. వాటిని సంస్కరించి ఆశించిన ప్రయోజనాల దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించింది. ఆ మురికివాడల్లో 2015 జూలై నాటికి ఉన్న 8.15 లక్షల ఇళ్లకుగాను 83 వేల (10%) ఇళ్లవారు బహిరంగ మల విసర్జన కొన సాగిస్తున్నారని పేర్కొంది.

మొత్తంగా 2,714 మురికివాడలకుగాను 778 (29%) చోట్ల పీహెచ్‌సీలు లేవని పేర్కొంది. పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని 209 మురికివాడల్లో నమూనా తనిఖీ చేయగా... 79 (38%) చోట్ల పీహెచ్‌సీలు లేవని తెలిపింది. శిశువిద్య, వయోజన విద్య, సాంప్రదాయేతర విద్య, మనోవికాస కార్యకలాపాల కోసం ఏర్పాటు చేసే సీయూసీ సైతం 2,714 మురికివాడలకుగానూ 739 చోట్ల ఉన్నాయని... అనువైన స్థలాలు లేవంటూ చాలా చోట్ల వీటి నిర్మాణం చేపట్టలేదని పేర్కొంది. ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అక్కడి నుంచి తరలించే చర్యలు చేపట్టాలని సూచించింది.

 బీబీనగర్ నిమ్స్‌ను గాలికొదిలేశారు
 బీబీనగర్ నిమ్స్ ను మధ్యలోనే నిలిపివేయడంతో ఇప్పటికే ఖర్చు చేసిన రూ. 80.39 కోట్లు వృథా అయ్యాయని కాగ్ తన నివేదికలో ఆక్షేపించింది. 2008 ఏప్రిల్‌లో మొదలుపెట్టిన భవనాల నిర్మాణం ప్రభుత్వ నిర్లక్ష్యంగా కారణంగా ఆగిపోయిందని పేర్కొంది. 2012, 2013, 2014 సంవత్సరాల్లో నిధుల విడుదల కోసం నిమ్స్ ప్రభుత్వాన్ని అభ్యర్థించినా 2015 అక్టోబర్ వరకూ నిధులు విడుదల చేయలేదని స్పష్టం చేసింది.

 హైదరాబాద్ నిమ్స్‌లో ప్రమాణాల లేమి
 హైదరాబాద్ నిమ్స్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.125.91 కోట్లతో నిర్మించిన భవనాలు అధికారుల లోపభూయిష్టమైన ప్రణాళిక కారణంగా ఎనిమిదేళ్లుగా నిరుపయోగంగా ఉండిపోయాయని కాగ్ వేలెత్తి చూపింది. ఆరోగ్యశ్రీ పథకంలో నిర్ణయించిన ప్రమాణాలను పాటించకపోవడంతో రూ.11.72 కోట్లను ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి నిమ్స్ తిరిగి రాబట్టుకోలేక పోయిందని.. ఇది నిమ్స్ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిందని స్పష్టం చేసింది. 2011-15 మధ్య రోగుల కేసు షీట్లు సమర్పించకపోవడం, బయోమెట్రిక్, శస్త్రచికిత్స సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలు సరిగా ఉండకపోవడం తదితర సాంకేతిక సమస్యలే దీనికి కారణమని పేర్కొంది. ఇక హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి వైద్యశాలకు 2013 మార్చిలో రూ.90లక్షల వ్యయంతో సరఫరా చేసిన వైద్య పరికరం నిరుపయోగంగా ఉందని పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement