కలలు.. కల్లలు
ఆశల బడ్జెట్ మహానగర వాసులకు నిరాశే మిగిల్చింది. మధ్యతరగతి కలలు కల్లలు చేసింది. ప్మాస్మాటీవీలు, విమానప్రయాణం, స్మార్ట్‌ఫోన్లు, ఏసీల కొనుగోలు, ఆభరణాలు కొనుగోలు వంటి కోరికలను అందని ద్రాక్షగా మార్చేసింది. తాజా కేంద్ర బడ్జెట్‌తో మహానగరంలో అత్యధికంగా ఉన్న మధ్యతరగతి వేతనజీవులు, మధ్యాదాయ వర్గాలకు చేదు కబురే మిగిల్చింది. పలు అంశాల్లో సుంకం పెంపు అంశం ఆయా వర్గాలను ఉస్సూరు మనిపించింది. ఆయా అంశాలపై ఫోకస్... - సాక్షి, సిటీబ్యూరో
ఆరోగ్యకర బడ్జెట్
కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ప్రజారోగ్యానికి, భద్రతకు ప్రాధాన్యతనివ్వడం ద్వారా ఆరోగ్యకర బడ్జెట్‌ను రూపొందించింది. స్కిల్ డెవలప్‌మెంట్‌కు భారీ నిధులు కేటాయించడం ద్వారా యువతకు తద్వారా నిరుద్యోగ సమస్య తగ్గించే ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణ విషయానికొస్తే ఐఐటీ, ట్రైబల్ యూనివర్సిటీ, మెట్రాలజీ, సీడీఏ వంటి సంస్థలకు భారీ నిధులు కేటాయించడం హర్షనీయం.
- ఎంపీ మల్లారెడ్డి
స్మగ్లింగ్‌ను ప్రోత్సహించేలా ఉంది
‘దిగుమతి సుంకాన్ని 10 నుంచి 11శాతానికి పెంచుతూ కేంద్రం తీసుకొన్న నిర్ణయం స్మగ్లింగ్‌ను ప్రోత్సహించేలా ఉంది. కేజీ బంగారం ధర రూ.30లక్షలు ఉందనుకొంటే... ప్రస్తుతం పెంచిన దిగుమతి సుంకం వల్ల కేజీ ధర రూ.33లక్షలకు ఎగబాకుతుంది. గ్రాము రూ.30ల చొప్పున 10 గ్రాములకు రూ.300, అలాగే 100 గ్రాములకు రూ.3వేలు ధర పెరుగుతుంది. ద్రవ్యలోటు నియంత్రించాలన్న సాకుతో గోల్డ్ బాండ్స్ రిలీజ్ చేయడం కేంద్రమే బంగారం వ్యాపారం చేస్తోంది.10-15% మేర వ్యాపారం తగ్గే అవకాశం ఉంది.’- డాక్టర్ జె.రామారావు, సీఎంఆర్ మేనేజింగ్ డెరైక్టర్
నిధుల్లో కోత
బడ్జెట్‌లో కేంద్ర పథకాల నిధుల్లో కోత పెట్టారు. కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంపును సాకుగా చూపిస్తూ రాష్ట్రాల్లో అమలు చేసే కేంద్ర పథకాలకు నిధులు తగ్గించారు. ఫలితంగా సుమారు 28 పథకాల నిధుల కేటాయింపులు 18 నుంచి 20 శాతం వరకు తగ్గ ముఖం పట్టింది. మెట్రో సిటీ లకు పెరుగుతున్న మౌలిక అవసరాలకు సరిపడ నిధులు కేటాయింపు జరుగలేదు. మరో 30 శాతం నిధులు పెంచితే కానీ స్మార్ట్ సిటీ లక్ష్యం సాధ్యం కాదు. జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లో పెరిగిన జాబ్స్ కార్డు, కనీస వేతనాలకు సరిపడ నిధుల కేటాయింపు జరుగలేదు.
- మద్దిరాల సుధాకర్ డేవిడ్, కో-ఆర్డినేటర్, సెంటర్ ఫర్ రూరల్ స్టడీ అండ్ డెవలప్‌మెంట్ /బడ్జెట్ సెంటర్,
పెట్టుబడిదారులకు అనుగుణంగా బడ్జెట్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పెట్టుబడుదారులకు, పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ వేసింది. కొత్తసీసాలో పాత సారా అన్న చందంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను తయారు చేశారు. అట్టడుగు వర్గా లకు ఈ బడ్జెట్ ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చదు. వలసల నివారణ ప్రస్తావన బడ్జెట్‌లో లేదు.
- ట్రై ఫెడ్ మాజీ చైర్మన్ ఎం. సూర్యానాయక్
ట్యాక్సీ వాహనాలకు పెంపు నుంచి మినహాయింపు ఉండాలి
స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు, రూ.10 లక్షలకు పైగా ఖరీదు చేసే కార్లపైన రూ.30 నుంచి రూ.40 వేల వరకు ధర పెరిగే అవకాశం ఉంది. ఈ వాహనాలను వినియోగించే సంపన్నులపైన అది పెద్ద భారం కాబోదు. ఆ మొత్తాన్ని చెల్లించేందుకు వాళ్లు వెనుకాడబోరు. ధరల పెంపు ప్రభావం పెద్దగా ఉండదు. కానీ ట్యాక్సీ వాహనాలపైన మాత్రం ఇది భారమే. కొంతమంది నిరుద్యోగులు, సామాన్యులు సొంతంగా వాహనాలు కొనుగోలు చేసి ట్యాక్సీలుగా నడుపుతారు. అలాంటి వాళ్లకు ఇది భారమే. వ్యక్తిగత వినియోగం కోసం కొనుగోలు చేసే వాహనాలపైన ధరలు పెంచి, రవాణా రంగంలో వినియోగించే టాక్సీని మినహాయిస్తే మంచిది. ట్యాక్సీ వాహనాల నుంచి ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. కాబట్టి వీటికి మినహాయింపును ఇవ్వాలి.
- రోహిత్‌కొఠారీ,ఆటోమొబైల్ డీలర్
వేతన జీవులకు నిరాశే
కేంద్ర బడ్జెట్ వల్ల సామాన్య ప్రజలకు, వేతన జీవులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఈ బడ్జెట్ వారికి నిరాశనే మిగిల్చింది. మార్కెట్‌లో వస్తు,సేవలను వినియోగించే మధ్యతరగతి ప్రజలకు ఆదాయ పన్నులో రాయితీనివ్వాల్సింది. నిజానికి మధ్యతరగతి వేతన జీవుల వల్లనే ఆర్ధిక రంగం అభివృద్ధి చెందుతుంది. కానీ ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించినట్లు కనిపించడం లేదు. ఇక స్వచ్ఛ భారత్‌కు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. ప్రజలపైన సెస్ రూపంలో 0.5 శాతం మేర (రూ.9 వేల కోట్ల వరకు) భారం మోపి, అంతే మొత్తాన్ని స్వచ్ఛ భారత్ కోసం కేటాయించారు. ఇదేం బాగాలేదు. కోటి మందికి నైపుణ్యాలు పెంచి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చేసిన ప్రకటన కూడా వాస్తవానికి దూరంగానే ఉంది.
- ప్రొఫెసర్ నాగేశ్వర్, సామాజిక, ఆర్ధిక రంగ నిపుణులు
పొగరాయుళ్లకు సెగ...
గ్రేటర్‌లో నెలకు సుమారు కే, వంద కోట్ల వరకు సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తుల అమ్మకాలు జరుగుతుంటాయని అంచనా. పొగాకు ఉత్పత్తులపై 10 నుంచి 15 శాతం ఎక్సైజ్ సుంకం విధించడంతో ఒక్కో సిగరెట్ ప్యాకెట్‌పై రూ.10 నుంచి రూ.15 వరకు పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
విమానయానం భారమే
మధ్యతరగతి కలలు గంటున్న విమాన యానం తాజా బడ్జెట్‌తో కలగానే మిగలనుంది. జెట్ ఇంధనాలపై 6 శాతం ఎక్సైజ్‌డ్యూటీ పెంపుతో విమాన చార్జీలకు రెక్కలు రానున్నాయి. దేశ,విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న నగరవాసులు,ఉద్యోగులు,విద్యార్థులు అదనపు భారం భరించక తప్పని పరిస్థితి నెలకొంది. కొందరు విమాన ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
స్టార్టప్‌లకు పన్ను రాయితీ
నగరంలో టీ-హబ్ ప్రారంభంతో ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న స్టార్టప్ కంపెనీలు ఆర్జించే ఆదాయంపై వరుసగా మూడేళ్లపాటు వందశాతం పన్ను రాయితీనివ్వడంతో ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలకు ఊరటనిచ్చే అంశం. ఇక ఒకేరోజులో స్టార్టప్ కంపెనీల రిజిస్ట్రేషన్, అనుమతి ఇస్తామని ప్రకటించడంతో నగరంలో మరిన్ని అంకుర పరిశ్రమలు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బంగారు ఆభరణాలు మరీ ప్రియం
ఇంటి బడ్జెట్‌లో కొంత పొదుపు చేసుకొని పెళ్లిళ్లు, వివాహాది శుభకార్యాలకు నగరంలో మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఆభరణాల దిగుమతిపై ఒకశాతం ఎక్సైజ్‌సుంకం విధించడంతో రూ.10 వేలు ఆపై కొనుగోలు చేసే రెడీమేడ్ ఆభరణాల ధరలు అమాంతం పెరిగే అవకాశాలుండడంతో మహిళలు కొనుగోలును వాయిదా వేసుకునే అవకాశాలుంటాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
అంకెల గారడీలే
కేంద్రం ప్రకటించిన బడ్జెట్ అంకెల గారెడీలా ఉంది. మసిపూసి మారేడు కాయ చేయడం తప్ప సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండబోదు. వేతన జీవులకు ఆదాయ పన్ను నుంచి మరింత ఊరటనిచ్చి ఉండాల్సింది. ఉద్యోగుల పొదుపు మొత్తం ప్రావిడెంట్ ఫండ్ పైన కూడా పన్ను భారం పడుతుంది. ప్రావిడెంట్ ఫండ్‌ను స్థూల ఆదాయంలో జమ చేయడం వల్ల దానికి కూడా పన్ను చెల్లించాల్సి వస్తుంది. అలా కాకుండా ఉద్యోగుల స్థూల ఆదాయం నుంచి పీఎఫ్‌ను పక్కనపెట్టి మిగతా ఆదాయానికి పన్ను విధిస్తే బాగుండేది. అవినీతిని అంతం చేసే ఒక బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయకుండా, పాలనారంగంలో పారదర్శక తను, జవాబుదారీతనాన్ని పెంచకుండా ఇలాంటి బడ్జెట్‌లు మరెన్ని వచ్చినా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండబోదు. - ప్రొఫెసర్ రామచంద్రయ్య,సెస్
పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత తగ్గింది
కేంద్ర బడ్జెట్‌లో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత తగ్గింది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ఆశించిన మేర కేటాయింపులు జరుగలేదు. మౌళిక సదుపాయల కల్పనపై దృష్టి సారించలేదు. కేవలం బడా పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహించే విధంగా రాయితీలు ప్రకటించారు. - అబుల్ ఫత్హే సయ్యద్ బందిగి బాదేషా ఖాద్రీ, డెరైక్టర్, తెలంగాణ చాంబర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ప్రమోషన్ , హైదరాబాద్
చిరుద్యోగులకు ఉపశమనం..
సొంత ఇళ్లు లేని, పనిచేస్తున్న సంస్థ నుంచి ఇంటి అద్దె అలవెన్సు పొందని చిరుద్యోగులకు స్వల్ప ఊరట లభించింది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80జిజి కింద అద్దె మినహాయింపు పరిమితిని రూ.24 వేల నుంచి రూ.60 వేలకు పెంచడం కాస్త ఊరటనిచ్చింది.
వీటి ధరలు తగ్గడం కాస్త ఊరటే..
బ్రెయిలీపేపర్, డయాలసిస్ పరికరాలు, ఈ రీడర్స్, రూటర్స్, బ్రాడ్‌బ్యాండ్ మోడెమ్స్, సెట్‌టాప్ బాక్సులు (టీవీ,ఇంటర్నెట్), డిజిటల్ వీడియో రికార్డర్ల ధరలు తగ్గనుండడం ఊరటనిచ్చే అంశం. ఇక యువత నైపుణ్యాన్ని పెంపొందించేందుకు తాజా బడ్జెట్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు నెలకొల్పుతామనడంతో యువత ఆసక్తిగా ఉన్నారు.
లగ్జరీ కారు కొంటే బాదుడే
గ్రేటర్‌లో ఎగువ మధ్యతరగతి, ఐటీ ఉద్యోగులు అధికంగా కొనుగోలు చేసే లగ్జరీ,ఎస్‌యూవీ కార్లపై 4 శాతం అదనపు బాదుడుకు శ్రీకారం చుట్టారు. దీంతో పది లక్షలు, ఆపై విలువ చేసే కార్ల ధరలు సుమారు రూ.30 నుంచి రూ.50 వేల వరకు పెరిగే అవకాశం ఉందని నగరంలోని ఆటోమొబైల్ డీలర్లు తెలిపారు.
చిన్న ఇళ్లకు ఊరట
60 చదరపు మీటర్ల లోపు విస్తీర్ణం ఉండే ఇళ్లు,ఫ్లాట్లు కొనుగోలు చేసే వేతనజీవులపై సేవా పన్ను మినహాయించడం ఊరటనిస్తోంది. మరోవైపు రూ.35 లక్షల లోపు గృహరుణాలు పొందేవారికి రూ.50 వేల మేర వడ్డీ రాయితీ ప్రకటించడం ఉపశమనం కలిగించే అంశం.
చల్లటి వస్తువులపై బాదుడే
మండు వేసవిలో ఏసీ గాలిలో సేదతీరుదామనుకున్న వారికి నిరాశే మిగిలింది. తాజా బడ్జెట్‌లో వీటిపై పన్ను బాదుడుకు తెరతీయడంతో వీటి ధరలు శ్రేణిని బట్టి రూ.4 నుంచి రూ.8 వేల వరకు పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కిడ్నీ రోగులకు ఓ వరం
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత లభించింది. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు కుటుంబానికి రూ.లక్ష వరకు ఆరోగ్య బీమా కల్పించడం అభినందనీయం. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ కోసం మారు మూల గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చే రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రతి జిల్లా ఆస్పత్రిలోనూ డయాలసిస్ యూనిట్లు ఏర్పాటుతో పాటు జనఔషధి దుకాణాలు పెట్టి తక్కువ ధరకే మందులు అందించాలని నిర్ణయించడం హర్షనీయం.
- డాక్టర్ రూమ సిన్హా, యూరో గైనకాలజిస్ట్, అపోలో ఆస్పత్రి