ఆదాయపన్ను దాదాపు యథాతథం
న్యూఢిల్లీ: వేతన జీవులపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పెద్దగా కనికరం చూపించలేదు. 2016-17 కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో ప్రస్తుతం ఉన్న ఆదాయ పరిమితి రూ. 2.50 లక్షలను యథాతథంగా ఉంచారు. అద్దె ఇళ్లలో ఉండేవారికి మాత్రం కొంత ఊరట కల్పించారు. సొంత ఇళ్లు లేకుండా అద్దె కడుతున్నవారికి ప్రస్తుతం సెక్షన్ 80 జిజి కింద హెచ్ఆర్‌ఏలో ఏడాదికి రూ. 24 వేల వరకు పన్ను మినహాయింపు ఇస్తుండగా, దాన్ని మాత్రం రూ. 60 వేలకు పెంచారు.
అలాగే, సెక్షన్ 87 ఎ కింద రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి టాక్స్ రిబేట్ సీలింగును రూ. 2 వేల నుంచి రూ. 5వేలకు పెంచారు. దీంతో సామాన్యుడికి పెద్దగా దీనివల్ల ఉపయోగం కనిపించే అవకాశం లేదు. సొంత ఇళ్లలో ఉండేవారికి అసలే ఉపయోగం ఉండదు. కోటి ఆదాయం దాటిన వారికి సర్ చార్జి 12 నుంచి 15 శాతానికి పెంచారు.
30 లక్షల మంది వరకు ఉన్న చిన్న వ్యాపారవేత్తలకు ఉపయోగపడేలా... ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 44ఎడి కింద ప్రిజంప్టివ్ టాక్సేషన్ కోసం ఇప్పటివరకు ఉన్న టర్నోవర్ పరిమితిని ప్రస్తుతమున్న కోటి రూపాయల నుంచి 2 కోట్లకు పెంచారు.