ఊరిస్తున్న ‘అరుణ్’ కిరణాలు | Budget 2016: Farm sector gets Rs 35000 cr in allocation | Sakshi
Sakshi News home page

ఊరిస్తున్న ‘అరుణ్’ కిరణాలు

Published Tue, Mar 1 2016 1:40 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

ఊరిస్తున్న ‘అరుణ్’ కిరణాలు - Sakshi

ఊరిస్తున్న ‘అరుణ్’ కిరణాలు

అత్యధికుల జీవితాలు సేద్యం చుట్టూ అల్లుకున్న జిల్లాలో.. ఆ రంగానికి కాస్త మేలు చేకూరుతుందనిపించేలా ఉంది కేంద్ర బడ్జెట్. జిల్లాలో వెయ్యికి పైగా గ్రామాలకూ ఇది అనుకూలమే అనిపిస్తోంది.  
 
* ‘స్థానిక’ సంస్థలకు ఇబ్బడిముబ్బడిగా నిధులు
* పంటల బీమా ప్రీమియం గణనీయంగా తగ్గింపు
* 3.6 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్
* కాకినాడ జీజీహెచ్‌లో డయాలసిస్ యూనిట్


 సాక్షి ప్రతినిధి, కాకినాడ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జిల్లాలో భిన్నాభిపాయ్యాలు వ్యక్తమవుతున్నా.. మొత్తం మీద ఆయన ప్రకటించిన వరాలు ఊరిస్తున్నాయనే చెప్పాలి. వ్యవసాయం, వైద్య, ఆరోగ్య రంగాలకు మెరుగ్గా నిధులు కేటాయించడంపై జిల్లాలో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకూ సరిపడినన్ని నిధుల్లేక కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్న గ్రామ పంచాయతీలకు, పురపాలక సంఘాలకు ఈ బడ్జెట్‌లో తీపివార్త వచ్చింది. ఒక్కో పంచాయతీకి రూ.90 లక్షల వరకూ నిధులొస్తాయి. అంటే 228% శాతం అధికంగా నిధులు వస్తాయన్నమాట.

అలాగే శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ అర్బన్ మిషన్ కింద 300 అర్బన్ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తారు. స్వచ్ఛభారత్ అభియాన్ కింద కూడా నిధులు రానున్నాయి. మొత్తం మీద చూస్తే రెండు నగరపాలక సంస్థలు, ఏడు పురపాలక సంఘాలు, మూడు నగర పంచాయతీలు, 1,028 గ్రామ పంచాయతీలు ఉన్న జిల్లాకు దండిగానే నిధులు సమకూరవచ్చు. అయితే 13వ, 14వ ఆర్థిక సంఘాల ద్వారా ఇప్పటికే జిల్లాకు రూ.వంద కోట్ల వరకూ నిధులు వచ్చినా వాటిని ఏవిధంగా ఖర్చు చేయాలనే మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో అవి ఆయా స్థానిక సంస్థల ఖాతాల్లో మూలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్ ద్వారా సమకూర్చే నిధుల వినియోగం స్పష్టమైన మార్గదర్శకాలు ఉంటేనే ఆశించిన ఫలితాలు
 
ఉంటాయని నిపుణులు చెబుతున్నారు..
జిల్లాకు 300 వర్మీ కంపోస్టు యూనిట్లు, 100 హేచరీలు ఇప్పటివరకూ ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు సాగుచేసే పంటలకు 5.5 శాతం బీమా ప్రీమియం చెల్లించాల్సి వచ్చేది. ఈ బడ్జెట్‌లో ఆ ప్రీమియాన్ని ఖరీఫ్‌లో 2 శాతానికి, రబీలో 1.5 శాతానికి తగ్గించారు. జిల్లాలో 5 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇప్పటివరకూ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నవారి పంటలకు మాత్రమే బీమా సౌకర్యం ఉంది. ఇక ప్రీమియం బాగా తగ్గడం రైతులంతా బీమా సౌకర్యం పొందే అవకాశం ఉంది. సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహకంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.

దీనివల్ల 300 వర్మీ కంపోస్టు యూనిట్లు, 100 వర్మీకంపోస్టు హేచరీలు  జిల్లాకు రానున్నాయి. కుప్పనూర్పు కళ్లాలు 500 మంజూరయ్యాయి. వీటన్నింటినీ జాతీయ ఉపాధి హామీ పథకంతో ముడిపెట్టనున్నారు. భూగర్భ జలాల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం భారీగానే నిధులు కేటాయించనుంది. దీనివల్ల కరువు ప్రభావిత ప్రాంతాల్లో చెరువుల్ని అభివృద్ధి చేయడానికి అవకాశం కలుగుతుంది.
 
మరిన్ని జన్‌ఔషధి దుకాణాలు
కిడ్నీ సంబంధిత వ్యాధులు రోజురోజుకూ అధికమవుతున్న పరిస్థితుల్లో జిల్లా ప్రధానాస్పత్రులకు రక్తశుద్ధి యంత్రం (డయాలసిస్ యూనిట్) ప్రకటించడం ఆయా రోగులకు సాంత్వన చేకూర్చేదే. ఈ చికిత్సకు ఇప్పటివరకూ కిడ్నీ రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వచ్చేది. నేషనల్ డయాలసిస్ సర్వీస్ ప్రోగ్రాం కింద నిధులు కేటాయించి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో కాకినాడ జీజీహెచ్‌లో డయాలసిస్ యూనిట్‌ను నిర్వహించనున్నారు. అలాగే తక్కువ ధరలకు ప్రాణావసర మందులను అందించే జనరిక్ మందుల దుకాణాలు మరిన్ని రానున్నాయి.

పీఎం జన్‌ఔషధి యోజన పథకం కింద వీటిని విస్తరించనున్నారు. ఇక వైద్య సౌకర్యం కోసం ఒక్కో కుటుంబానికి రూ.లక్ష వరకూ ప్రయోజనం చేకూర్చేలా కొత్త ఆరోగ్య రక్షణ పథకం అమల్లోకి రానుంది. వయో వృద్ధులకు మరో రూ.30 వేలు అదనంగా ప్రయోజనం కలుగుతుంది.
 
3.6 లక్షల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు
దారిద్య్రరేఖకు దిగువనున్న (బీపీఎల్) కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్ ఉచితంగా లభించనుంది. అదీ కుటుంబంలోని మహిళాసభ్యుల పేరుతో మంజూరు చేస్తారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించాల్సి ఉంటుంది. జిల్లాలో ఉన్న 16 లక్షల బీపీఎల్ (తెల్లరంగు రేషన్ కార్డుల ప్రకారం) కుటుంబాల్లో ఇప్పటికే 11 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మిగిలిన ఐదు లక్షల కుటుంబాల్లో దీపం పథకం కింద ఇటీవల 1.40 లక్షల కనెక్షన్లు ఇచ్చారు. ఇప్పుడు ఉచితంగా కనెక్షను ఇవ్వడం వల్ల 3.60 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది.
 
‘ముద్ర’ నిబంధనలు సరళతరం చేయూలి..
చిరు వ్యాపారులకు రుణసౌకర్యం కల్పించేందుకు ముద్రా రుణాలను పరిచయం చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఏకంగా రూ.1.80 లక్షల కోట్లు కేటాయించింది. అయితే బ్యాంకర్ల సవాల క్ష నిబంధనలు పెడుతుండటంతో ముద్ర రుణాల లక్ష్యం నెరవేరడం లేదు. ఈసారైనా నిబంధనలు సరళతరం చేస్తే చిరు వ్యాపారులకు మేలు చేకూరుతుంది. మరో విశేషం ఏమిటంటే వారంలో అన్ని రోజులు దుకాణాలు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
 
పోల‘వరం’పై చిన్నచూపు..
కాగా వ్యవసాయ ప్రధానమైన జిల్లాకు కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు నామమాత్రంగా నిధులివ్వడంపై నిరసన  స్వరం వినిపిస్తోంది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని చెప్పినా మరోవైపు చుక్కలను తాకుతున్న ఎరువులు, పురుగుమందులను తగ్గించేందుకు ఎలాంటి రాయితీలు ఇస్తామనేది చెప్పకపోవడంపై రైతులు, ఆదాయపు పన్ను మినహారుుంపు పరిమితి పెంచకపోవడంపై ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు.
 
విభజన అంశాలకు బడ్జెట్‌లో చోటేదీ?
ఆంధ్రప్రదేశ్ విభజన నాటి హామీలకు కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి ప్రాధాన్యం లేకపోవడం చూస్తే ఇది పూర్తిగా సీఎం చంద్రబాబునాయుడు అసమర్థతగానే కనిపిస్తోంది. నూతన రాజధాని నిర్మాణంపై ఎంతో నమ్మబలికినప్పటికీ చంద్రబాబుకు బీజేపీ ఇస్తున్న విలువేమిటో కేంద్ర బడ్జెట్ చూస్తే అర్థమవుతోంది. రాష్ట్ర ప్రయోజనాలపై ఎంపీలతో సీఎం ప్రత్యేకంగా సమావేశమైనా ఏ ఒక్కటీ సాధించలేకపోయారు. కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ.100 కోట్లు మాత్రమే విదిలించడాన్ని చూస్తే ఇది ఎన్ని దశాబ్దాలకు పూర్తవుతోందో? అంచనాలు ఎన్నివేల కోట్లకు చేరతాయో? తెలియని పరిస్థితి నెలకొంది.                         
 - జ్యోతుల నెహ్రూ, వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత
 
పోలవరానికి నిధులింతేనా..!
కేంద్ర బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఎలాంటి కేటాయింపులూ లేకపోవడం విచారకరం. పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ.100 కోట్లు కేటాయించడం ఏమాత్రం సమంజసం కాదు. ఇలాగైతే ఈ ప్రాజెక్టు ఎన్నేళ్లపాటు కడతారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఉద్యోగులకు ప్రకటించిన పన్ను రాయితీ కూడా కంటితుడుపుగానే ఉంది.
 - దంటు సూర్యారావు, కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు
 
విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి
సాంకేతిక విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని కేంద్రం చెబుతున్న తరుణంలో ఇప్పుడు కేటాయించిన నిధులు సరిపడవు. యూనివర్సిటీల్లో స్టార్టప్ నెలకొల్పడానికి నిధులు పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. మన రాష్ట్రంలో ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు కూడా తక్కువగా నిధులు కేటాయించారు.
 - కొప్పిరెడ్డి పద్మరాజు, డెరైక్టర్, అకడమిక్ ప్లానింగ్,
 
జేఎన్‌టీయూకే నెల వేతనం కోతే..
ఆదాయపన్ను రాయితీ పెంచకపోవడం ఉద్యోగులను తీవ్రంగా నిరాశపరచింది. రోజురోజుకూ పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పెరుగుతున్న ఇంటి అద్దెలనుబట్టే పీఆర్సీ పెంచాలని కోరుతాం. కానీ పీఆర్సీలో పెంచినా, ఆదాయపన్నుతో జీతం కోత వేసేస్తే ఉపయోగం ఏముంది? ఏడాదంతా కష్టపడి 11 నెలలకే జీతం తీసుకుంటున్నట్లు అవుతోంది. ఒక నెల జీతంపై ఆదాయపన్ను కోత పడుతోంది. రూ.10 లక్షల వరకూ మినహాయింపు ఇవ్వాలని ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని కోరినా ఉపయోగం ఉండడంలేదు.
- బూరిగ ఆశీర్వాదం, ఏపీఎన్‌జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు
 
ఏపీకి నిరాశ
కేంద్ర బడ్జెట్ ఏపీని నిరాశపరచింది. విభజన చట్టంలో ఉన్నవాటిని ఈ బడ్జెట్‌లో సాధించుకోలేకపోయాం. రాజధాని అమరావతికి కూడా నిధులు లేవు. సీఎం చంద్రబాబు చెబుతున్న ప్రత్యేక ప్యాకేజీ కింద కూడా నిధులు లేవు. ప్రత్యేక హోదా ప్రస్తావనకే నోచుకోలేదు. పోలవరం ప్రాజెక్టుకు అంతంతమాత్రంగా నిధులు కేటాయించారు. ఉద్యోగులు, కార్మికులకు శూన్యహస్తం చూపింది. వ్యవసాయ రంగానికి, నీటిపారుదలకు, గ్రామీణ ప్రాంతాలకు మంచి ప్రోత్సాహం అందించింది.

తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి, ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు టీడీపీ ఎంపీలను ‘డిమాండ్ చేయకండి.. రిక్వెస్ట్ చేద్దాం’ అని ఆదేశించడం చంద్రబాబు మార్కు రాజకీయానికి నిదర్శనం. మొన్న రైల్వే బడ్జెట్‌లో, నేడు సాధారణ బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం జరిగింది.
 - చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట
 - సేకరణ : కొత్తపేట

 
ప్రజలకు భారాలు.. కార్పొరేట్లకు రాయితీలు
‘ప్రజలకు భారాలు.. కార్పొరేట్లకు రాయితీలు’ అన్నట్టుగా కేంద్ర బడ్జెట్ ఉంది. తగ్గిన ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి పన్నులు పెంచేలా ఈ బడ్జెట్ ఉంది. పన్నుల ద్వారా 2014-15లో రూ.9,03,615 కోట్ల రాబడి వస్తే, 2015-16లో రూ.9,47,508 కోట్లకు పెరగగా, ఇప్పుడు రూ.10,54,101 కోట్లకు పెంచారు. అంటే ఈ ఏడాది రూ.1,06,593 కోట్ల పన్నుల భారాన్ని ప్రజలపై మోపిందన్నమాట. పోలవరం ప్రాజెక్ట్‌కు కేటాయించిన రూ.100 కోట్లు ఏ మూలకు సరిపోతుంది? మొత్తం రూ.19,78,060 కోట్లుగా ఉన్న బడ్జెట్‌లో రూ.5.5 లక్షల కోట్ల బడాబాబుల పన్ను బకాయిలున్నా వాటిమీద ఎటువంటి చర్యలూ లేవు.

రైతులు వాడే ఎరువులపై రూ.2వేల కోట్లు, ఆహార సబ్సిడీలు రూ.5 వేల కోట్లు తగ్గించారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌కు 16 శాతం కేటాయించాల్సి ఉండగా 7 శాతం, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు 8.6 శాతం కేటాయించాల్సి ఉండగా 4.4 శాతం కేటాయించారు. పాఠశాల విద్యకు 2015-16లో రూ.69,794 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం రూ.63,826  కోట్లకు తగ్గించారు.
 - దువ్వా శేషుబాబ్జీ, సీపీఎం జిల్లా కార్యదర్శి
 
పోలవరానికి మళ్లీ నిరాశే..
కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లు మాత్రమే కేటాయించడం చాలా అన్యాయం. దీంతో ఉభయ గోదావరి జిల్లాల రైతులకు నిరాశే ఎదురైంది. టీడీపీ, బీజేపీ అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్ట్ 2018కి పూర్తి చేస్తామని గత ఎన్నికల్లో చెప్పారు. ఇప్పటివరకూ కనీసం రూ.500 కోట్లు కూడా మంజూరు చేయలేదు. ఇప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వెంటనే రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయకపోతే పోలవరం పూర్తవదు.
 - తాటిపాక మధు, సీపీఐ జిల్లా కార్యదర్శి
 - సేకరణ : కాకినాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement