
రైతుకు ఓకే... ఉద్యోగికి షాకే...
కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు అరుణ్‌జైట్లీ చాణక్య నీతిని తెలివిగా ప్రదర్శించారు. వాత పెడుతూనే వెన్న రాస్తున్నట్టుగా లెక్కలు చూపించారు. ఆయన సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జిల్లాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల వరకు బడ్జెట్‌పై సానుకూల స్పందనలు వినిపిస్తున్నా, ఉద్యోగులు మాత్రం దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ర్టం, జిల్లా విషయానికి వచ్చే సరికి మాత్రం అంతా బీజేపీ నిర్లక్ష్య వైఖరిపై మండిపడుతున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని సాక్షాత్తు మోదీనే చెప్పినా, ఆ విషయం బడ్జెట్‌లో కానరాలేదు. హోదా బదులు నిధులైనా ఇచ్చారా అంటే అదీ లేదు.
ఇప్పటికే చాలా విషయాల్లో వెనుకబడిన మన జిల్లా బడ్జెట్ కేటాయింపుల్లోనూ వెనుకబడే ఉంది. ఒక్క ప్రాజెక్టయినా రాకపోవడంతో జిల్లా వాసి ఉసూరుమన్నాడు. మిత్రపక్షం నుంచే నిధులు రాబట్టుకోలేని టీడీపీ నేతల అసమర్థ వైఖరిపై విమర్శలు గుప్పించాడు.
- శ్రీకాకుళం, నెట్‌వర్క్
అన్నదాతకు ఊరటే...
రైతులకు రుణాల వడ్డీ మాఫీకి కేటాయింపు, బీమా సదుపాయం కల్పన వంటివి ఊరటనిచ్చే విషయాలు. అయితే రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని ఓ పక్క ప్రకటిస్తూనే మరోవైపు ఎరువుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఆక్షేపణలకు తావిచ్చింది. కొంతవరకు అన్నదాతలు ఈ బడ్జెట్‌పై సానుకూలంగానే స్పందించారు.
ఉద్యోగులకు భంగపాటు
ఆదాయ పన్ను పరిమితి పెంచుతారని ఉద్యోగులందరూ భావిస్తూ బడ్జెట్ కోసం ఎదురుచూశారు. వారికి భంగపాటు కలిగింది. పన్ను పరిమితిని యధాతథంగా కొనసాగించడం వారిలో నిస్పృహకు తా విచ్చింది. అయితే సొంత ఇల్లు లేని ఉద్యోగులకు ఇదివరలో 24వేల వరకు ఇంటి అద్దెను పరిగణలోకి తీసుకోగా ప్రస్తుత బడ్జెట్‌లో ఆ మొత్తాన్ని రూ. 60వేలకు పెంచడం కొంత తృప్తినిచ్చింది.
స్థానిక సంస్థలపై ప్రేమ
స్థానిక సంస్థలకు అదనపు నిధులను కేటాయించడం పంచాయతీలు, మునిసిపాలిటీలకు వరం కానుంది. జిల్లాలో 1100 పంచాయతీలు, ఒక కార్పొరేషన్, మూడు మునిసిపాలిటీలు, రెండు నగర పంచాయతీలు ఉన్నాయి. ఆర్థిక సంఘ నిధులు స్థానిక సంస్థల్లో రోడ్లు నిర్మాణానికే వెచ్చించాలని నిబంధన విధించడంతో పన్నులు అంతంతమాత్రంగా వసూలవుతున్న నేపథ్యంలో పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి వాటికి ఏటా రూ. 90 లక్షల వరకు వచ్చే అవకాశాలు ఉండడంతో గ్రామస్థాయి ప్రజలు కొంత ఉపశమనం పొందనున్నారు.
బీమా... ధీమా
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని బడ్జెట్‌లో పొందుపరచడం జిల్లాలోని లబ్ధిదారులకు ఆనందాన్నిచ్చింది. జిల్లాలో 14వేల మంది పేదలు గ్యాస్ కనెక్షన్లు కోసం దరఖాస్తు చేసుకోగా అవి పెండింగ్‌లో ఉన్నాయి. ఇలాంటి వారికి ప్రయోజనం చేకూరనుంది. అలాగే ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల బీమా కల్పిస్తామని బడ్జెట్‌లో ప్రకటిం చడం కూడా జిల్లా ప్రజలకు సంతృప్తినిచ్చింది.
సుప్రీంకోర్టు కాదన్నా...
ఏ అంశానికీ ఆధార్ కార్డు తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు వెలువరించినా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఆధార్‌ను తప్పనిసరి చేసింది. పలు కీలక పథకాలకు ఆధార్ కార్డు ఉండాలని ప్రకటించింది. జిల్లాలోని సుమారు 15 శాతం మంది పలు కారణాల వల్ల ఆధార్ కార్డును పొందలేకపోయారు. వీరంతా పేద వర్గానికి చెందినవారే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వలన ఇలాంటి వారు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది.
పశువులకు గుర్తింపు కార్డులపై విమర్శలు...
ప్రజలకే పూర్తిస్థాయిలో గుర్తింపు కార్డులు ఇవ్వలేకపోయిన ప్రభుత్వాలు తాజా కేంద్ర బడ్జెట్‌లో పశువులకు గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రకటించడం విమర్శలకు తావిచ్చింది. అలాగే ఆరోగ్య కార్డులు, బీమా కల్పిస్తామని చెప్పడంపై ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్యశ్రీ, ఉద్యోగశ్రీ పథకాలను సవ్యంగా అమలుచేయలేకపోతుండగా కేంద్ర ప్రభుత్వం పశువులను గుర్తింపు కార్డులు,ఆరోగ్య కా ర్డులు ఇచ్చినా ప్రయోజనం ఉండదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
ప్రత్యేక హోదా ఊసే లేదు
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రాకు అ న్యాయమే జరిగింది. రైల్వే బడ్జెట్‌లోనూ ఆశించిన కేటాయింపులు జరగలేదు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా నిధులైనా కేటాయించాల్సింది. కేవలం టీడీపీ వ్యవహార శైలే దీనికి కారణం. ఇది కేవలం ఆ పార్టీ నాయకుల వైఫల్యమే.
- ధర్మాన కృష్ణదాస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు
కార్మికుల పాలిట శాపం
కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు కార్మికులకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. తయారీయేతర రంగాల్లో కార్మిక చట్టాలు అమలు తనీఖీలు ఎత్తివేస్తూ తయారుచేసిన మోడల్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టాన్ని బడ్జెట్‌లో ప్రకటించడం దారుణం. ఇన్సూరెన్స్, పెన్షన్ రంగాల్లో విదేశీ పెట్టుబడుల ప్రవేశానికి అనుకూలంగా సంస్కరణలు ప్రతిపాదించింది. 2016 ఏప్రిల్ 1నుంచి కార్మికుల పీఎఫ్ ఖాతాల్లో జమచేసిన మొత్తాలను విత్‌డ్రాచేసే సమయంలో 60శాతం మీద ప్రభుత్వం పన్ను వేయాలన్న నిర్ణయం అన్యాయం.
- డి.గోవిందరావు, సిఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
మధ్య తరగతికి నిరాశే...
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్య తరగతి ప్ర జలకు నిరాశ కలి గించింది. ఉద్యోగులకు ఎలాంటి ప్రతిపాదనలు లేవు. ప్రత్యేక హోదాపై కనీసం ప్రస్తావన లేదు. పాత ప్యాకేజీపై కూడా నోరు మెదపలేదు. పంటల బీమా రైతులకు ఊరట కలిగిం చింది. గత బడ్జెట్‌లో అంకెలను అటు ఇటుగా మార్చినట్టే ఉంది.
- దువ్వాడ శ్రీకాంత్, పలు కార్మిక సంఘాల సమాఖ్యల గౌరవధ్యక్షులు, పలాస-కాశీబుగ్గ
రైతులకు ఉపయోగమే...
రైతులకు ఈ బడ్జెట్ చాలా ఉపయోగం. ముఖ్యంగా జీడి రైతులకు మరింత ఉపయోగం. రైతు శ్రేయ స్సు కోసం బడ్జెట్‌లో రూ.36 వేల కోట్లు కేటాయించారు. సేంద్రియ ఎరువులపై దృష్టి సారించారు. పప్పు ధాన్యాల దినుసుల కోసం రూ.500 కోట్లు ప్రకటించా రు. జీడి పిక్కల దిగుమతి కోసం కస్టమ్స్ చార్జీలు 5 శాతం పెంచారు. దీని వల్ల స్వ దేశీ పిక్కల రేట్లు పెరిగే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంది.
- మల్లా శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్, పలాస
ఆశాజనకంగా లేదు...
సామాన్యునికి సొంతిల్లు కలే అవుతోంది. సిమెంట్, ఇను ము ధరలు పెంచడం బాలే దు. రైతు సంక్షేమం అంటూ నే వారి నడ్డివిరిచే విధంగా కేటాయింపులు ఉన్నాయి. అరుణ్ జైట్లీ ప్రకటించిన బడ్జెట్ సామాన్యునికి ఆశాజనకంగా లేదు.
- కంబాల జోగులు, రాజాం ఎమ్మెల్యే
ప్రత్యేక హోదా ఏదీ..?
కేంద్ర బడ్జెట్‌లో మనకు ప్రత్యేక హోదా ప్రస్తావించకపోవడం దారుణం. రైల్వే బడ్జెట్‌తో పాటు సాధారణ బడ్జెట్లో ఏపీ ఆశలు అడియాసలయ్యాయి. కేంద్ర బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం లేదు.
- విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే
ప్రత్యేక నిధులు ఇస్తే బాగుండేది...
లోటు బడ్జెట్‌లో ఉన్న ఆంధ్రా కు మరింతగా ఆర్థిక సాయం అందించి ఉంటే బాగుండేది. పోలవరం, అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయిస్తారని అనుకున్నాం. ఇచ్చి ఉంటే బాగుండేది. బడ్జెట్‌లో సంబంధం లేకపోయినా ఇతర మార్గాల ద్వారా నిధులు అధికంగా ఇస్తారని ఆశిస్తున్నాం.
- బగ్గు రమణమూర్తి, నరసన్నపేట ఎమ్మెల్యే
మరింత ప్రాధాన్యం ఇవ్వాలి
శ్రీకాకుళం లాంటి వెనుకబడిన జిల్లాలకు కేంద్రం మరింత ప్రాధాన్యం ఇవ్వా ల్సి ఉంది. కేటాయింపులూ పెంచాల్సి ఉంది. వ్యవసాయం సంక్షోభంలో ఉండడంతో కేంద్రం ప్రకటించిన బడ్జెట్ కొంత ఊరటనిచ్చింది. నీటి పారుదల విషయంలోనూ కేంద్రం మంచి నిర్ణయమే తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలకు ఈ సారి పెద్దపీట లభించింది. వచ్చే బడ్జెట్‌లోనైనా శ్రీకాకుళం జిల్లాకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని, కేటాయింపులు పెరగాలని ఆశిస్తున్నా.
- గుండ లక్ష్మిదేవి, ఎమ్మెల్యే, శ్రీకాకుళం
మళ్లీ మోసపోయారు...
ఉద్యోగ ఉపాధ్యాయులు మళ్లీ మోసపోయారు. ఆదాయ పన్ను పరిమితి పెంచకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన ఉంది. కనీసం రూ.3లక్షలు నుంచి ఐదు లక్షలకు పన్ను మినహాయింపు వర్తించే చర్యలు తీసకుంటుందని అంతా ఆశించారు. కాని మొండిచేయి చూపడం వల్ల ఈ బడ్జెట్ కూడా నిరాశ పరిచింది. ధరలు విపరీతంగా పెంచారు. దీని వల్ల సామాన్యుడు ఇబ్బందులు పడతాడు.
- ఎం. చిన్నబాబు, వైఎస్‌ఆర్ టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
కార్పొరేట్ల కోసమే...
కేంద్ర బడ్జెట్ కార్పొరేట్లు, విదేవీ వ్యాపారులకు అనుకూలంగా ఉంది. బడుగు, బలహీ న వర్గాలకు ఒనగూరిందేమీ లేదు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ బడ్జెట్‌లోనూ న్యాయం జరగలేదు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఊసే లేదు. జన్‌ధన్ యోజన పథకాన్ని అట్టహాసంగా ప్రవేశపెట్టి మన జిల్లాలో సుమారు 7 లక్షల ఖాతాలు తెరిపించారు. కానీ దాని గురించి పట్టించుకోలేదు. విభజన సమయంలో ప్రకటించిన ప్రాజెక్టుల్లో ఒక్కటీ వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు దక్కలేదు.
- రెడ్డి శాంతి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఆదాయ పన్ను పరిమితి పెంచాల్సింది
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్తగా పీఆర్‌సీలు ప్రకటించిన తర్వాత జీతాలు అందరికీ పెరిగాయి. దీనికి తగ్గట్టుగా ఆదాయ పన్ను పరిమితి పెంచకపోవడంతో ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది. 11 నెలల జీతమే ఇంటికి వస్తుంది.దీన్ని గమనించి ఆదాయ పన్ను పరిమితి పెంచుతుందని ఆశించాం. నిరాశే మిగిలింది.
- బమ్మిడి శ్రీరామ్మూర్తి, యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ జిల్లా ఉపాధ్యక్షులు
ఉద్యోగులకు తీవ్ర నిరాశే..
కేంద్రం పార్లమెంట్‌లో ప్రవే శ పెట్టే బడ్జెట్‌పై ఉద్యోగ వర్గాలు ఆతృతగా ఎదురుచూశాయి. కనీసం ఇన్‌కం టాక్స్ రాయితీ పెంచుతుం దని ఆశించాం. యదాతథం గా దీన్ని ఉంచడం ఉద్యోగులకు నష్టమే. ఇన్‌కం టాక్స్ రాయితీ పెంచితే బాగుండేది. - డి.శ్రీనివాస్, ఎన్‌జీఓ సంఘం, నరసన్నపేట తాలూకా అధ్యక్షుడు
పెన్షనర్లకు నిరాశే...
పెన్షనర్లకు ఐటీ మినహాయింపు ఇస్తారని గత మూడేళ్లగా భావి స్తూ వస్తున్నాం. కానీ ఈ ఏడాది కూడా నిరాశే ఎదురైంది. పెంచిన పేస్కేల్ బట్టి ప్రతి చిరుద్యోగితోపాటు విశ్రాంత ఉద్యోగులకు ఐటీ మినహాయింపు లేకపోవడం శోచనీయం. ప్రభుత్వం మరోసారి ఆలోచించాలి.
- డాక్టర్ కె.శ్రీనివాసరావు, డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్
రాష్ట్ర మంత్రులు కళ్లు తెరవాలి
కేంద్రం ప్రకటించిన బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు అందరు మంత్రులు కళ్లు తెరవాలి. రాష్ట్రానికి రూ.22వేల కోట్లు అవసరమని అడిగితే కేంద్రం ఇచ్చింది కేవలం రూ.వెయ్యి కోట్లు. మనకు రైల్వేజోన్‌లోనూ అన్యాయమే జరిగింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కళ్లు తెరవాల్సి ఉంది.
- తాత మురళీధర్, బీజేపీ మండలాధ్యక్షుడు, హిరమండలం
విద్యారంగానికి మొండిచేయి...
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వి ద్యారంగానికి మొండి చేయి చూపారు. కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టం తెచ్చి నిధులు కేటాయించకపోవడం దారుణం. ఉద్యోగస్తు లు దాచుకున్న సొమ్ము, తీసుకుంటే దానిపై ఆదాయపన్ను భారం విధించడం దుర్మార్గమైన చర్య.
- కవిటి పాపారావు, ఐపీటీఎఫ్(1937), జిల్లా ఉపాధ్యక్షుడు
బంగారంపై టాక్స్ తగదు
బంగారంపై ఒక శాతం టాక్స్ పెంచడం సామాన్యుల నెత్తిన కుంపటి పెట్టినట్టే ఉంది. పెళ్లికి బంగారం కొనుగోలు చేయాలంటే పేదవాడు నానా ఇక్కట్లు పడాల్సిందే.
- జె. వెంకటేశ్వరరావు, రోటేరియన్, ఆమదాలవలస
పైన పూత... లోన వాత
అరుణ్‌జైట్లీ బడ్జెట్ పైన పూత... లోన వాత అన్నట్లు ఉంది. మన ఎంపీల అసమర్థతన బడ్జెట్‌లో కనిపిస్తోంది. బడ్జెట్‌లో రూ.14లక్షల 28వేల కోట్లతో ప్రణాళికేతర వ్యయం, రూ.5లక్షల 50వేల కోట్లతో ప్రణాళికావ్యయం చూపారు. అందులో అసలు మన వాటా ఉందా? తమిళనాడును చూసి మనవారు బుద్ధి తెచ్చుకోవాలి. బడ్జెట్‌ను పరిశీలిస్తే బొగ్గు ఆధారిత పరిశ్రమలు, హోటళ్లపై సెస్ విధించారు.
డీజిల్, పెట్రోలు, బంగారంపై పన్నుభారం మోపారు. కంప్యూటర్ పరికరాలపై కూడా సుంకం విధించారు. ఇది పేద విద్యార్థులపై ప్రభావం చూపుతుంది. రూ.15 వేల కోట్లు మాత్రమే రైతు రుణాలపై వడ్డీ మాఫీకి ఇచ్చారు. రాష్ట్రానికి చేసిన అన్యాయంపై ప్రజలను సమాయాత్తపరచాల్సిన అవసరం ఉంది. - తమ్మినేని సీతారాం, వైఎస్సార్‌సీపీ హైపవర్ కమిటీ సభ్యుడు
రైతుకు ఊతమే...
కేంద్ర బడ్జెట్ రైతులకు ఊరటనిచ్చేలా ఉంది. రైతన్నలు ఏజెంట్లు/బ్రోకర్లపై ఆధారపడకుండా తమ పంటను విక్రయించుకునేలా బడ్జెట్‌లో ప్రకటించడం సంతోషకరం. సీతంపేట ఏజెన్సీలోని రైతులు ఇతరులపై ఆధారపడకుం డా ఈ ప్లాట్‌ఫాంల ద్వారా దేశంలో ఎక్కడికైనా కనీసం 10 రకాల ఉత్పత్తులు విక్రయించే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటివరకు 1.55 కోట్ల దీపం కనెక్షన్లు లక్ష్యంగా తీసుకుంటే ఇప్పటికే సుమారు 45లక్షలు మంజూరయ్యాయి.
కేంద్ర బడ్జెట్ ప్రకారం పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల అంశం మరింత ఉపయోగపడుతుంది. పంచాయతీలకు నిధుల పెంపు విషయమై కేంద్రం తీసుకున్న నిర్ణయం హర్షణీయమే. శ్రీకాకుళం విషయంలో అర్బన్ మిషన్ కింద ఇప్పటికే అమృత్ నిధులొస్తున్నాయి. గ్రామాల పరిధిలోనూ అర్బన్ మాదిరి సౌకర్యాలు పెరిగే అవకాశం ఉంది. గతంలో ఇదే అంశంపై ‘పురా’(ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ టు ది రూరల్ ఏరియాస్) పథకం ఉన్నా సోమవారం నాటి బడ్జెట్‌లో పేర్కొన్న అంశం మరింత మేలు కలిగించేదిలా ఉంది.
- లక్ష్మీనృసింహం, కలెక్టర్
పేదవాడిని విస్మరించారు...
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేద వాడిని పూర్తిగా విస్మరించారు. నరేంద్ర మోదీ అభివృద్ధి పేరుతో కార్పొరేట్ శక్తులను ప్రోత్సహించే విధంగా అరుణ్‌జైట్లీతో అంకెల గారడీ చేయించారు.
-దువ్వాడ శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి
వేతన జీవులకు నిరాశే
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2016 కేంద్రబడ్జెట్‌లో వేతన జీవులకు నిరాశే కలిగింది. ప్రతి ఉద్యోగికీ పన్ను మినహాయింపు 2.50 లక్షలు నుంచి 3.50 లక్షలకు పెంచుతారని ఆశించారు. అయితే ఇక్కడ నిరాశే మిగిల్చింది. గృహనిర్మాణ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ప్రతి ఒక్కరికీ గృహం కల్పించే విధంగా రాయితీలు కల్పించడం హర్షణీయం.
- హనుమంతు సాయిరాం, ఏపీ ఎన్‌జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు
వ్యవసాయ రంగానికి పెద్దపీట
వ్యవసాయ రంగానికి కేంద్రం పెద్దపీట వేసిం ది. ఇంత వరకూ ఏ బడ్జెట్‌లో లేని విధంగా రూ.15వేల కోట్లు రైతులు చెల్లించాల్సిన వడ్డీ మాఫీకి కేటాయించారు. వ్యవసాయ రంగానికి రూ.39వేల కోట్లు కేటాయించారు. విత్తనాలు సేకరించి నిల్వ చేసుకునేందుకు రూ.800కోట్లు కేటాయించారు.
- పూడి తిరుపతిరావు, బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్ఛా అధ్యక్షుడు
లక్ష్యం చేరుతారా..?
2018 నాటికి శత శాతం విద్యుద్దీకరణ చేస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నా రు. కానీ ఈ లక్ష్యం చేరుతారో లేదో. గతంతో పోల్చుకుంటే గ్రామీణ, మున్సిపాలిటీలకు కేటాయింపులు బాగున్నాయి. నిధులు పక్కాగా విడుదలైతే గ్రామాల్లో, పట్టణాల్లో మౌలిక వసతులు సాధ్యమవుతాయి. గ్రామీణాభివృద్ధికి మాత్రమే రూ. 87.765 కో ట్లు కేటాయించడం బాగుంది.
- డాక్టర్ కె.అచ్యుతరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, వాణిజ్య శాస్త్రం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ
కేటాయింపులు మరిన్ని ఉండాల్సింది...
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ వెనుకబడి ఉంది. ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులైతే చాలవు. ప్రత్యేకంగా ఏపీకి కేటాయింపులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిం ది. పోలవరం ప్రాజెక్టుకు రూ. 100 కోట్లు, విజయవాడ మెట్రోకు రూ. 100 కోట్లు, ట్రిపుల్ ఐటీకి రూ. 20 కోట్లు, తిరుపతిలో ఐఐటీకి రూ. 40 కోట్లు, విశాఖపట్నంలో ఐఐఎంకు రూ.30 కోట్లు, తేడేపల్లిగూడేం ఎన్‌ఐటీకి రూ. 40 కోట్లు, తిరుపతి ఐఐఎస్‌సీఆర్‌కు రూ. 40 కోట్లు, విశాఖస్టీల్ ప్లాంట్‌కు రూ. 1675 కోట్లు, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌కు రూ. 231.61 కోట్లు, కేంద్రీయ విశ్వవిద్యాలయంకు రూ. కోటి మంజూరు చేశారు. బడ్జెట్ కేటాయింపులు పెంచాల్సింది.
- ప్రొఫెసర్ గుంట తులసీరావు, వాణిజ్య శాస్త్రం సీనియర్ ప్రొఫెసర్, ప్రధానాచార్యులు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం
రెండంకెల వృద్ధి ఎప్పుడో..?
ఇప్పట్లో దేశంలో రెండంకెల వృద్ధిరేటు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. వృద్ధి రేటు 7.6 శాతం, ద్రవ్యోల్బణం 5.4 శాతం ఉన్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అయి తే ప్రణాళికా వ్యయం కంటే ప్రణాళి కేతర వ్యయానికి ప్రాధాన్యతను ఇచ్చారు. ప్రాధాన్యత రంగాలకు తక్కువ కేటాయింపుల వల్ల ప్రగతిలో వెనుక బాటు తప్పదు.
-ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, ఎకనామిక్స్ విభాగాధిపతి, బీఆర్‌ఏయా
సంపన్న వర్గాల కోసమే...
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్న వర్గాలు బాగా అభివృద్ధి చెందడానికే అన్నట్లుగా ఉన్నాయి. గ్రామీణ స్థాయిలో ఉన్న వారికి ఇంకా కేటాయింపులు చేయాలి.
-చింతాడ మంజు, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు
ఉపాధికి అరకొర నిధులు...
గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు నిరోధించే ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అరకొర నిధులు కేటాయిం చారు. మహిళా సాధికారతపై నిర్లక్ష్యం చూపించారు.
- దువ్వాడ వాణి, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది...
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తగిన నిధుల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరం గా విఫలమైంది. నిధులు తీసుకురావడంలో ముఖ్యమంత్రితో పాటు మిగిలిన మంత్రివర్గం విఫలమయ్యారు.
-పేరాడ తిలక్, వైఎస్సార్ సీపీ జిల్లా యువజన అధ్యక్షుడు