కుటుంబానికి రూ. లక్ష ఆరోగ్య బీమా
వైద్య రంగానికి రూ. 38,206 కోట్లు
సీనియర్ సిటిజన్లకు అదనంగా రూ. 30 వేల వరకు ప్యాకేజీ
జాతీయ ఆరోగ్య మిషన్‌కు 19వేల కోట్లు
కిడ్నీ రోగులపై కరుణ
♦ జాతీయ డయాలసిస్ సేవలకు శ్రీకారం
♦ అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలు
♦ దేశవ్యాప్తంగా 3 వేల జన్‌ఔషధి స్టోర్లు
న్యూఢిల్లీ: పేదలు (దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలు), ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల ఆరోగ్య భద్రతపై బడ్జెట్‌లో కేంద్రం కరుణ చూపింది. వారి కోసం కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ పేద, ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల ఆరోగ్య భద్రత కోసం రూ. లక్ష విలువైన ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడతామన్నారు. ఆయా కుటుంబాల్లోని సీనియర్ సిటిజన్ల కోసం (60 ఏళ్లు, అంతకన్నా పైబడిన వ్యక్తులు) రూ. 30 వేల టాప్ అప్ ప్యాకేజీని అందిస్తామన్నారు. ‘‘కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే అది ఆ కుటుంబంపై పెను ఆర్థిక భారం మోపడమే కాకుండా వారి ఆర్థిక భద్రతను దెబ్బతీస్తుంది. అందుకే ఆ కుటుంబాలను ఆదుకునేందుకు కొత్త ఆరోగ్య పథకం తెస్తాం’’ అని జైట్లీ పేర్కొన్నారు. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం తర్వాత ప్రకటించనుంది. జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ. 19,037 కోట్లు కేటాయించారు. ఆరోగ్య రంగానికి రూ. 38,206 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.4,375 కోట్లు ఎక్కువ. అలాగే ఢిల్లీలోని ఎయిమ్స్‌కు రూ. 2,043 కోట్లు, జాతీయ ఎయిడ్స్ నియంత్రణకు 1,700 కోట్లు కేటాయించారు.
న్యూఢిల్లీ: కిడ్నీ రోగులపై బడ్జెట్‌లో కేంద్రం ఉదారత చాటుకుంది. క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోవడం అవసరమైన రోగులకు ఆర్థికంగా, శారీరకంగా ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంది. జాతీయ డయాలసిస్ సేవల కార్యక్రమాన్ని ప్రారంభించి దీని కింద అన్ని జిల్లా ఆస్పత్రుల్లో రోగులకు డయాలసిస్ సేవలు అందించనుంది. అలాగే డయాలసిస్ పరికరాల్లోని కొన్ని భాగాలను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ లేదా కౌంటర్‌వెయిలింగ్ డ్యూటీ, స్పెషల్ అడిషనల్ డ్యూటీ నుంచి మినహాయిస్తామని ప్రతిపాదించింది. ‘‘దేశంలో ఏటా కిడ్నీల వైఫల్యంతో 2.2 లక్షల మంది బాధపడుతుంటే దేశవ్యాప్తంగా సుమారు 4,950 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ప్రైవేటు రంగంలో, ప్రధాన నగరాలు/పట్టణాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. దీంతో 3.4 కోట్ల డయాలసిస్ సెషన్లకు అదనపు డిమాండ్ ఏర్పడుతోంది.
ఒక్కో డయాలసిస్ సెషన్‌కు రూ. 2 వేల ఖర్చవుతుండగా ఏటా ఈ ఖర్చు రూ. 3 లక్షలు దాటుతోంది. డయాలసిస్ కోసం రోగుల కుటుంబాలు తరచూ దూరప్రాంతాలకు ప్రయాణించాల్సి రావడం వల్ల ప్రయా ణ ఖర్చులు మోపెడవుతున్నాయి. దీంతో వారు రోజువారీ వేతనాలూ నష్టపోతున్నారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని జాతీయ డయాలసిస్ సేవల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాం’’ అని జైట్లీ పేర్కొన్నారు. అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలు అందించేందుకు పీపీపీ విధానంలో నిధుల సమీకరణ చేపడతామన్నారు. నాణ్యమైన జనరిక్ మందులను చవకగా ఇచ్చేందుకు ప్రధానమంత్రి జన్‌ఔషధి యోజన కింద 3 వేల స్టోర్లను ఏర్పాటు చేస్తామన్నారు.