Dialysis Services
-
43 కేంద్రాలు .. 42 లక్షల డయాలసిస్ సెషన్లు.. కిడ్నీ రోగులకు ఆరోగ్యశ్రీ అండ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూత్రపిండాల వైఫల్యం కేసుల సంఖ్య ఏటా పెరుగుతోంది. వీరిలో కొందరికి క్రమం తప్పకుండా డయాలసిస్ (రక్తశుద్ధి) చేయాల్సి ఉంటోంది. కొందరికి వారానికి రెండుసార్లు... మరికొందరికి మూడు సార్లు డయాలసిస్ చేయాల్సిన అవసరముంటుంది. అయితే ఇదెంతో ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. ప్రైవేటు ఆస్పత్రులు వేలల్లో వసూలు చేస్తుండటంతో పేదలు, మధ్యతరగతి రోగులకు ఈ చికిత్స భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచిత డయాలసిస్ సేవలు అందజేస్తోంది. ప్రాణాపాయ స్థితికి చేరుకోకుండా కాపాడుతోంది. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 43 కేంద్రాల ద్వారా రోగులకు పైసా ఖర్చు లేకుండా ఉచిత డయాలసిస్ నిర్వహిస్తున్నారు. డయాలసిస్ అవసరమైన ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఈ చికిత్సల కోసం ప్రభుత్వం 2014–15 నుంచి 2021–22 నవంబర్ 16 వరకు రూ.575.92 కోట్లు వెచ్చించింది. పెరుగుతున్న కిడ్నీ వైఫల్యాలు రాష్ట్రంలో 2014–15లో 5,598 మంది మూత్రపిండాల వైఫల్య బాధితులు ఆరోగ్యశ్రీ పథకం కింద నమోదు కాగా..ఏటా ఈ సంఖ్య పెరుగుతోంది. ఆరేళ్లలో దాదాపు 4 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. 2015–16లో ఈ సంఖ్య 6,853కి చేరగా, 2016–17లో 7,612, 2017–18లో 8,786, 2018–19లో 10,452, 2019–20లో 10,848కి చేరినట్లు ఆరోగ్యశ్రీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2020–21లో మాత్రం ఈ సంఖ్య స్వల్పంగా తగ్గి 10,610గా నమోదయ్యింది. ఎప్పటికప్పుడు కొత్త కేసులు నమోదవుతున్నా ఏడాదికి సుమారు 2 వేల మందికి పైగా బాధితులు మృతి చెందుతుండడంతో గత మూడేళ్లుగా ఈ రోగుల సంఖ్యలో పెద్దగా పెరుగుదల చోటు చేసుకోలేదని వైద్యవర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఆరోగ్యశ్రీతో పాటు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో నమోదవుతున్న కేసుల్ని కూడా లెక్కిస్తే ఈ రోగుల సంఖ్య రెట్టింపు ఉంటుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డిలో అత్యధికం మూత్రపిండాల వైఫల్య బాధితుల్లో అత్యధికులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నట్లుగా ఆరోగ్యశ్రీ గణాంకాలను బట్టి అర్థమవుతోంది. 02.06.2014 నుంచి 16.11.2021 వరకు రాష్ట్రంలో మొత్తం 42.61 లక్షల డయాలసిస్ సెషన్లు నిర్వహించగా హైదరాబాద్‌లో అత్యధికంగా 10,42,660 చికిత్సలు చేశారు. ఆ తర్వాత రంగారెడ్డిలో 4,87,696 చికిత్సలు జరిగాయి. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ, నిజామాబాద్, హనుమకొండ జిల్లాల్లో కూడా లక్షకు పైగా డయాలసిస్ చికిత్సలు జరిగాయి. అతి తక్కువగా ములుగు జిల్లాలో 5,142 డయాలసిస్ చికిత్సలు నమోదయ్యాయి. మూత్రపిండాల మార్పిడి చికిత్సలు ఎక్కువగా జరగకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బాధితులు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. రోగుల సంఖ్య పెరుగు తుండడంతో డయాలసిస్ మెషీన్ల సంఖ్యను కూడా పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. పేదలపై పంజా.. దేశంలోనూ కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏటా లక్ష మంది కిడ్నీ వ్యాధులకు బలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనంలో తేలింది. నిమ్స్ ఆసుపత్రి వైద్యుల నివేదిక ప్రకారం 2015లో ఏకంగా 1.36 లక్షల మంది మూత్రపిండాల వైఫల్యంతో చనిపోయారు. దశాబ్దం క్రితం అంతగా లేని కిడ్నీ వ్యాధి ఇప్పుడు నాలుగైదు రెట్లు పెరిగింది. షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులు పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు. వివిధ సంస్థలు దేశంలోని 52,273 మంది వ్యాధిగ్రస్తులపై సర్వే నిర్వహించాయి. ప్రాంతం, సామాజిక, ఆర్థిక స్థాయిల వారీగా అధ్యయనం చేశాయి. దక్షిణాది నుంచి వ్యాధికి గురైన వారిలో నెలకు రూ.5 వేల లోపు ఆదాయం ఉన్నవారు ఏకంగా 44.3 శాతం మంది ఉండటం గమనార్హం. అలాగే రూ.20 వేల లోపు ఆదాయం కలిగినవారు 42.9 శాతం మందికి కిడ్నీ వ్యాధికి గురయ్యారు. దీనిని బట్టి కిడ్నీ రోగుల్లో ఎక్కువగా పేదలే ఉంటున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. -
ఒకరు పోతేగానీ మరొకరికి సేవలుండవు..!
ఒకరు బతకాలంటే మరొకరు కన్నుమూయాలా..? ఒకరి ఊపిరి నిలపాలంటే మరొకరి ఉసురు ఆగిపోవాలా..? జిల్లాలోని కిడ్నీవ్యాధిగ్రస్తులు ఇలా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఒకరి స్థానం ఖాళీ అయితే గానీ మరొకరికి డయాలసిస్ అందని కఠిన స్థితిలో ఉన్నారు. చాలా మంది ఇక్కడ కొన ఊపిరితో డయాలసిస్ సేవల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రమాణాలు చేయడం, ప్రకటనలు ఇవ్వడం తప్ప సేవలు మర్చిపోయిన సర్కారు తీరుతో వీరు విసిగిపోయారు. జనం ప్రాణాలు కాపాడలేని అసమర్థ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాశీబుగ్గ : ఇటీవల పలాస మండలంలో ఉద్దానం ప్రాంతానికి చెందిన ఒక కిడ్నీవ్యాధిగ్రస్తుడు మరణించాడు. ఆ విషయం తెలుసుకున్న సుమారు ఆరుగురు రోగులు ఆస్పత్రి వారిని సంప్రదించారు. తాము విశాఖ, శ్రీకాకుళం వెళ్లలేమని, పలాసలో డయాలసిస్ అయ్యేలా అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. ఇలా డయాలసిస్ సేవల కోసం ఎదురుచూస్తున్న వారు ఇంకా వందలాదిగా ఉన్నారు. ఉద్దానం కిడ్నీవ్యాధిగ్రస్తులు విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కిడ్నీవ్యాధి సోకిన వారిలో అధికంగా డయాలసిస్ చివరి దశలో ఉన్న వారు ఇక బతుకుపై ఆశలు వదిలేసుకుంటారు. కానీ వీరి వెనుక డయాలసిస్ సేవల కోసం ఎదురుచూస్తున్న వారు మాత్రం అంతకంటే నరకం అనుభవిస్తున్నారు. తమ వంతు ఎప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఒకరు చనిపోతే గానీ తమకు సేవలు అందని దౌర్భాగ్య పరిస్థితిని తలచుకుని కుమిలిపోతున్నారు. ప్రభుత్వం కపట ప్రేమ రెండున్నర దశాబ్దాలుగా ఉద్దానం, తీర ప్రాంతాల ప్రజలను వణికిస్తున్న కిడ్నీ భూతంతో వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికీ వీరి కోసం ప్రభుత్వం ఎలాంటి శాశ్వత పరిష్కారం చూపలేదు. జిల్లాలో 7 ఉద్దాన తీర ప్రాంతంలో సుమారు 20 వేల మంది ప్రజలు కిడ్నీ వ్యాధితో బాధపడుతుంటే వారిలో పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో కేవలం 80 మంది రోగులు మాత్రమే డయాలసిస్ చేసుకుంటున్నారు. అంటే ప్రభుత్వం ఏ స్థాయిలో విఫలమైందో ఊహించుకోవచ్చు. కొందరికే అవకాశం.. ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అవసరమైన డయాలసిస్ కేంద్రాల్లో సదుపాయాలు లేక, ఉచిత మందులు అందక, సిబ్బంది కొరత వేధిస్తుండడంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పలాస డయాలసిస్ కేంద్రంలో కేవలం డయాలసిస్ మిషన్లు (హెచ్డి) 9 ఉండగా వీటిలో 7 పాజిటివ్, 2 నెగిటివ్ మిషన్లు ఉన్నాయి. దీనిలో 80 మంది రోగులకు రోజుకు 3 షిఫ్ట్‌లలో 27 మందికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 8 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. మరో ఇద్దరు రావాల్సి ఉంది. మిగిలిన రోగులు డయాలసిస్ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇక్కడ సదుపాయాలు లేకపోవడంతో చాలా మంది రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సుదూర ప్రాంతాల్లో గల ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ప్రకటనలకే పరిమితమా..? జిల్లాకు వచ్చిన ప్రతిసారీ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అది చేస్తాం. ఇది చేస్తాం అని గొప్పలు చెబుతున్న ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు వాటిని నెరవేర్చడంలో మాత్రం విఫలం అవుతున్నారు. రోగులకు ఉచిత మందులు అందిస్తానని, డయాలసిస్ కేంద్రాలను పెంచుతానని, వారికి పింఛన్లు అందిస్తానని అనేక హామీలిచ్చి వెళ్లిపోయారే తప్ప వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం నెఫ్రాలజిస్టు నియామకం చేపట్టకపోవడంతో డయాలసిస్ చేసుకుంటున్న కిడ్నీ రోగులకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 38 మండలాల పరిధిలో 20వేలమందికిపైగా అన్నిరకాల కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ముఖ్యంగా ఉద్దాన ప్రాంతంలో కవిటి, వజ్రపుకొత్తూరు, పలాస, మందస, ఇచ్ఛాపురం, సొంపేట, కంచిలితో మొత్తం ఏడు మండలాలు అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో డయాలసిస్ కేంద్రాల్లో పాలకొండలో 50 మంది రోగులు, శ్రీకాకుళం రిమ్స్‌లో 125 మంది, టెక్కలి 72 మంది, పలాసలో 80మంది, సొంపేటలో 100 మంది, కవిటి, 50 మంది రోగులు డయాలసిస్ పొందుతున్నారు. ప్రతి సెంటర్ వద్ద సుమారు ఐదు నుంచి పదికిపైగా కిడ్నీ రోగులు వెయిటింగ్లో ఉన్నారు. ఇందులో ఎవరైనా చనిపోతే మిగిలిన వెయింట్‌లో ఉన్నవారికి అవకాశం కలుగుతుంది. పలాసలో డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులు తిత్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి కీడ్నీ ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ముఖ్యమంత్రి మందస మండలం హరిపురం, వజ్రపుకొత్తూరు మండలాల పరిధి అక్కుపల్లిలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు. వజ్రపుకొత్తూరు మండలంలో అధికంగా కిడ్నీరోగులు గుణుపల్లి, బాతుపురం, బైపల్లి, యుఆర్కే పురం, అక్కుపల్లి గ్రామాల ప్రజలు అక్కుపల్లిలో ఏర్పాటు చేస్తారని ఎదురుచూస్తున్నారు. కానీ ఇంతవరకు జరగలేదు. ముఖ్యమంత్రి ప్రకటించిన పింఛన్లు కేవలం 225 మందికి మాత్రమే అందుతున్నాయి. మిగిలిన వారంతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. పలాసలో నామమాత్రపు సేవలు పలాస సామాజిక ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రంలో అరకొర సేవలు అందుతున్నాయి. నాలుగు షిఫ్టులలో జరుగుతున్న డయాలసిస్ సేవలు కొందరికే పరిమితమయ్యాయి. 8 మంచాలపై జరుగుతున్న డయాలసిస్ కోసం మూడు షిఫ్టుల్లో రోజుకు 24 మందికి మాత్రమే జరుగుతుంది. పలాస నియోజకవర్గ పరిధిలో ఉన్న ఉద్దాన కిడ్నీ రోగులు 700 మందికిపైగా డయాలసిస్ జరుపుకుంటున్నారు. అత్యవసరమైన వారు విశాఖ, శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు వెళ్లి రూ.వేలల్లో ఖర్చు పెడుతున్నారు. మా సొంతగ్రామం గొల్లమాకన్నపల్లిలో ఇప్పటివరకు 50 మందికిపైగా చనిపోయారు. ఇంకా చాలామంది రోగులకు సేవలు అందడంలేదు. – రాపాక అప్పలస్వామి, కిడ్నీ రోగి, గొల్ల మాకన్నపల్లి, పలాస మండలం అత్యవసర పరిస్థితి ప్రకటించాలి.. ప్రస్తుతం ఉద్దాన ప్రాంతంలో ఉన్న కిడ్నీరోగుల మరణాలను నమోదు చేసి తక్షణమే అత్యవస మెడికల్ ప్రకటించి అందరిని ఆదుకోవాలి. ఉచిత మందులు, డయాలసిస్ పూర్తి సేవలు, రవాణా ఖర్చులు అందించాలి. ఆర్టీసీ బస్సుపాసులు ఇస్తున్నప్పటికీ అనేక ప్రాంతాలకు ఆర్టీసీ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. – పత్తిరి దశరథ,కిడ్నీ వ్యాధిగ్రస్తుడు, బొడ్డపాడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. ప్రభుత్వం కేవలం ప్రకటనలు చేస్తోంది గానీ పనులు చేయడం లేదు. చివరి దశలో మరణానికి సిద్ధంగా ఉన్నవారికి పింఛన్లు ప్రకటించారు. మేమంతా వారి తరఫున అడుగుతున్నాం. సీరం క్రియాటిన్ తగ్గుదల ప్రారంభం నుంచి పింఛన్ అందిస్తే కాస్త అయినా మేలు జరుగుతుంది. ప్రస్తుతం సౌకర్యాలు లేకుండా డయాలసిస్ నడుపుతున్నారు. ప్రత్యేకమైన గ్రూపుల వారు విశాఖ వెళ్లాల్సి వస్తోంది. ఇకనైనా వారిపై శ్రద్ధ చూపాలి. – సీదిరి అప్పలరాజు, వైఎస్సార్ సీపీ పలాస ఎమ్మెల్యే అభ్యర్థి -
నెల రోజుల్లో డయాలసిస్ సేవలు
నాలుగు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు ప్రారంభమైన టెండర్ల ప్రకియ పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో వైద్యసేవలు ఎంజీఎం ఆస్పత్రిపై తగ్గనున్న బారం ఎంజీఎం : ప్రభుత్వ ఆస్పత్రుల్లో కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు జిల్లాలోని వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులలో డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నర్సంపేట, మహబూబాబాద్. జనగామ, ఏటూరునాగారం ఆస్పత్రుల్లో పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రారంభించనున్నారు. నెల రోజుల్లోనే ఈ నాలుగు ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించేలా రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా టెండర్లు సైతం పిలిచారు. ఎంజీఎం ఆస్పత్రిపై తగ్గనున్న బారం వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం నాలుగు జిల్లాల నుంచి కిడ్నీ వ్యాధి బాధితులు డయాలసిస్ చేసుకునేందుకు ఎంజీఎం ఆస్పత్రిపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రిలో పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో డయాలసిస్ సేవలు కొనసాగుతుండగా సుమారు 300 మంది రోగులు రోజూ ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ఒక్కోరోగికి నెలకు 8 నుంచి పదిసార్లు డయాలసిస్ చేయాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. రోజురోజుకు రోగులు పెరుగుతుండడంతో ఎంజీఎం ఆస్పత్రిలో డయాలసిస్ యూనిట్లు సరిపోక పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లాలో త్వరలో ఏర్పాటు చేసే డయాలసిస్ కేంద్రాలతో ఆయా ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తొలగడంతో పాటు మెరుగైన సేవలందుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఒక్కో డయాలసిస్ కేంద్రానికి రూ.50 లక్షలు ఖర్చు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే 34 డయాలసిస్ కేంద్రాల్లో భాగంగా జిల్లాలో నాలుగు ఆస్పత్రుల్లో ఈ సేవలను అందుబాటులోకి తేనుందని వైద్యవిధాన పరిషత్ జిల్లా కోర్డినేటర్ ఆకుల సంజీవయ్య తెలిపారు. ఒక్కో ఆస్పత్రిలో నాలుగు యూనిట్లను ఏర్పాటు చేసేవిధంగా ప్రతిపాదనలు చేశామన్నారు. ఒక్కో ఆస్పత్రిలో ఏర్పాటు చేసే డయాలసిస్ సెంటర్‌కు రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని లె లిపారు. జిల్లాలో ప్రస్తుతం వంద పడకలతో మహబూబ్‌బాద్, జనగామ, 50 పడకలతో నర్సంపేట, 30 పడకలతో ఏటూరునాగారం ఆస్పత్రులు కొనసాగుతున్నాయన్నారు. ఈ ఆస్పత్రుల్లో సూపర్‌స్పెషాలిటీ సేవలైన నెప్రాలజీ, యురాలజీ వంటి విభాగంలో అందుబాటులోకి రావడం వల్ల పేదలకు మెరుగైన సేవలు అందుతాయని, ముఖ్యంగా ఏటూరునాగారం వంటి ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. -
కుటుంబానికి రూ. లక్ష ఆరోగ్య బీమా
వైద్య రంగానికి రూ. 38,206 కోట్లు సీనియర్ సిటిజన్లకు అదనంగా రూ. 30 వేల వరకు ప్యాకేజీ జాతీయ ఆరోగ్య మిషన్‌కు 19వేల కోట్లు కిడ్నీ రోగులపై కరుణ ♦ జాతీయ డయాలసిస్ సేవలకు శ్రీకారం ♦ అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలు ♦ దేశవ్యాప్తంగా 3 వేల జన్ఔషధి స్టోర్లు న్యూఢిల్లీ: పేదలు (దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలు), ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల ఆరోగ్య భద్రతపై బడ్జెట్లో కేంద్రం కరుణ చూపింది. వారి కోసం కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ పేద, ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల ఆరోగ్య భద్రత కోసం రూ. లక్ష విలువైన ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడతామన్నారు. ఆయా కుటుంబాల్లోని సీనియర్ సిటిజన్ల కోసం (60 ఏళ్లు, అంతకన్నా పైబడిన వ్యక్తులు) రూ. 30 వేల టాప్ అప్ ప్యాకేజీని అందిస్తామన్నారు. ‘‘కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే అది ఆ కుటుంబంపై పెను ఆర్థిక భారం మోపడమే కాకుండా వారి ఆర్థిక భద్రతను దెబ్బతీస్తుంది. అందుకే ఆ కుటుంబాలను ఆదుకునేందుకు కొత్త ఆరోగ్య పథకం తెస్తాం’’ అని జైట్లీ పేర్కొన్నారు. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం తర్వాత ప్రకటించనుంది. జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ. 19,037 కోట్లు కేటాయించారు. ఆరోగ్య రంగానికి రూ. 38,206 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.4,375 కోట్లు ఎక్కువ. అలాగే ఢిల్లీలోని ఎయిమ్స్‌కు రూ. 2,043 కోట్లు, జాతీయ ఎయిడ్స్ నియంత్రణకు 1,700 కోట్లు కేటాయించారు. న్యూఢిల్లీ: కిడ్నీ రోగులపై బడ్జెట్లో కేంద్రం ఉదారత చాటుకుంది. క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోవడం అవసరమైన రోగులకు ఆర్థికంగా, శారీరకంగా ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంది. జాతీయ డయాలసిస్ సేవల కార్యక్రమాన్ని ప్రారంభించి దీని కింద అన్ని జిల్లా ఆస్పత్రుల్లో రోగులకు డయాలసిస్ సేవలు అందించనుంది. అలాగే డయాలసిస్ పరికరాల్లోని కొన్ని భాగాలను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ లేదా కౌంటర్వెయిలింగ్ డ్యూటీ, స్పెషల్ అడిషనల్ డ్యూటీ నుంచి మినహాయిస్తామని ప్రతిపాదించింది. ‘‘దేశంలో ఏటా కిడ్నీల వైఫల్యంతో 2.2 లక్షల మంది బాధపడుతుంటే దేశవ్యాప్తంగా సుమారు 4,950 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ప్రైవేటు రంగంలో, ప్రధాన నగరాలు/పట్టణాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. దీంతో 3.4 కోట్ల డయాలసిస్ సెషన్లకు అదనపు డిమాండ్ ఏర్పడుతోంది. ఒక్కో డయాలసిస్ సెషన్‌కు రూ. 2 వేల ఖర్చవుతుండగా ఏటా ఈ ఖర్చు రూ. 3 లక్షలు దాటుతోంది. డయాలసిస్ కోసం రోగుల కుటుంబాలు తరచూ దూరప్రాంతాలకు ప్రయాణించాల్సి రావడం వల్ల ప్రయా ణ ఖర్చులు మోపెడవుతున్నాయి. దీంతో వారు రోజువారీ వేతనాలూ నష్టపోతున్నారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని జాతీయ డయాలసిస్ సేవల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాం’’ అని జైట్లీ పేర్కొన్నారు. అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలు అందించేందుకు పీపీపీ విధానంలో నిధుల సమీకరణ చేపడతామన్నారు. నాణ్యమైన జనరిక్ మందులను చవకగా ఇచ్చేందుకు ప్రధానమంత్రి జన్ఔషధి యోజన కింద 3 వేల స్టోర్లను ఏర్పాటు చేస్తామన్నారు.