ఆర్థిక రాజధానికి అరసున్నా | Visakhapatnam in the state budget to turn dull | Sakshi
Sakshi News home page

ఆర్థిక రాజధానికి అరసున్నా

Published Thu, Mar 16 2017 2:38 AM | Last Updated on Thu, Sep 27 2018 3:58 PM

ఆర్థిక రాజధానికి అరసున్నా - Sakshi

ఆర్థిక రాజధానికి అరసున్నా

అరకొర కేటాయింపులు
అత్తెసరు ప్రతిపాదనలు
రాష్ట్ర బడ్జెట్‌లో విశాఖకు మొండి చెయ్యి


ఆర్థిక రాజధాని అని ఆకాశానికెత్తేశారు.. ఐటీహబ్‌ చేస్తామని ఊదరగొట్టారు.. జిల్లాను పర్యాటక పుంతగా మార్చేస్తామని మురిపించారు...
తీరా.. బడ్జెట్‌ దగ్గరకొచ్చేసరికి మొండిచెయ్యి చూపారు.. అరకొర కేటాయింపులు.. అత్తెసరు ప్రాజెక్టులు.. అస్పష్ట ప్రతిపాదనలతో విశాఖ జిల్లా ప్రజలను రాష్ట్ర సర్కారు తీవ్ర నిస్పృహకు గురి చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి అసెంబ్లీలో ప్రతిపాదించిన బడ్జెట్‌లో విశాఖ నగరానికి, జిల్లాకు చేసిన కేటాయింపులు చూస్తే.. దేశ విదేశాల ప్రముఖులను మభ్యపెట్టడానికి, ప్రచార ఆర్భాటాలకే వినియోగించుకుంటున్నారని స్పష్టమవుతోంది.

నిధుల కేటాయింపు విషయానికొచ్చేసరికి కూరలో కరివేపాకులా తీసుపారేస్తున్నారని.. బడ్జెట్‌ కేటాయింపులు చూసిన స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.చీటికీ మాటికీ విశాఖకు వచ్చి వాలిపోయే సీఎం చంద్రబాబు.. ఆయా సందర్భాల్లో లెక్కలేనన్ని హామీలు ఇచ్చేస్తున్నారు..ఆ హామీలకూ ఈ బడ్జెట్‌లో చోటు దక్కకుండా పోయింది.తాగు, సాగు నీటికి సంబంధించి జిల్లాకు, నగరానికి అత్యంత కీలకమైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ముష్టి విదిల్చినట్లు రూ.2 కోట్లు పడేశారు. పరిశ్రమలకు అత్యంతావశ్యకమైన ఏలేరు ఆధునికీకరణకూ అరకొర నిధులే విదిల్చారు. సిగ్నేచర్‌ టవర్స్, ఐటీ స్టార్టప్‌ విలేజ్, కేజీహెచ్‌ ఆధునికీకరణ, గాజువాక హౌస్‌ కమిటీ.. తదితర అంశాలన్నీ సోదిలో లేకుండా పోయాయి..ఏతావాతా తేలిందేమిటంటే.. ఈ బడ్జెట్‌లో ఆర్థిక రాజధానికి అరసున్నాయే గతి..

విశాఖపట్నం : విశాఖ వచ్చిన ప్రతిసారీ విశాఖను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తాం, ఆర్థిక రాజధానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తాం అంటూ ముఖ్యమంత్రి హామీలిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో ఆయన హామీలకు మోక్షం లభిస్తుందని అంతా ఎదురుచూశారు. బుధవారం నాటి బడ్జెట్‌లో కేవలం మొక్కుబడి కేటాయింపులతో సరిపెట్టి విశాఖపై తనకున్న ‘ప్రత్యేక అభిమానం’ ఏపాటిదో చాటుకున్నారు. ఏలేరు ఆధునికీకరణకు గత బడ్జెట్‌లో రూ.19.51 కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం రూ.39.36 కోట్లు కేటాయించారు. అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి గత ఏడాది, ఈ సంవత్సరం కూడా కేవలం రూ.2 కోట్లే ఇచ్చారు. విశాఖ, కాకినాడ, తిరుపతి నగరాల అభివృద్ధికి రూ.450 కోట్లు కేటాయిస్తున్నట్టు బడ్జెట్‌లో ప్రకటించారు. అంటే ఈ నిధుల్లో విశాఖకు సగటున రూ.150 కోట్లు వచ్చే అవకాశం ఉంది. విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని లెక్కలేనన్ని సార్లు వేదికలపై ప్రకటించిన చంద్రబాబు ఆ మేరకు కేటాయింపులే చేయలేదు. విశాఖ ఏజెన్సీలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ప్రస్తావనే లేదు.

మెట్రో రైలు ఊసే లేదు
విజయవాడలో నిర్మించ తలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టుకు ఈ బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించగా.. మూడేళ్ల నుంచి ఊరిస్తున్న విశాఖ మెట్రో రైలు ఊసే లేదు. ఏటా కోటి మందిని ఆకర్షిస్తున్న విశాఖ పర్యాటకరంగానికి నిధుల కేటాయింపులో నిర్లక్ష్యాన్ని చూపింది. గాజువాక హౌస్‌కమిటీ భూ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్న హామీకి బడ్జెట్‌లో పరిష్కారం చూపలేదు.

సిగ్నేచర్‌ టవర్స్‌కు మంగళం
మధురవాడ ఐటీ సెజ్‌లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సిగ్నేచర్‌ టవర్స్‌ నిర్మాణానికి గ్లోబల్‌ టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఈ టవర్స్‌కు మంగళం పాడేశారు. స్టార్టప్‌ విలేజ్‌లో ఒక్క కంపెనీ కూడా ఏర్పాటు కాలేదు. చెన్నై మెరీనా బీచ్‌కు ధీటుగా విశాఖ బీచ్‌ను తీర్చిదిద్దుతానని, బర్డ్స్‌ పార్కు, బొటానికల్‌ గార్డెన్, ఓషన్‌ రివర్, బీచ్‌ రిసార్ట్స్, సైన్స్‌ సిటీలు నిర్మిస్తానని, పాడేరు సర్క్యూట్‌ ద్వారా అరకు, లంబసింగిలో సమ్మర్‌ రిసార్ట్స్, ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్, ఎగ్జిబిషన్‌ సెంటర్, ఐఎన్‌ఎస్‌ విరాట్‌ మ్యూజియం కమ్‌ స్టార్‌ హోటల్, ఇంటర్నేషనల్‌ çహోటల్స్‌ వంటివి ఏర్పాటు చేస్తామని ఎన్నో సార్లు సీఎం ప్రకటించారు. కానీ ఈ బడ్జెట్‌లో వాటికి నిధులు కేటాయించడానికి ప్రాధాన్యతే ఇవ్వలేదు.

డీప్‌వాటర్‌ పోర్టు ఊసేలేదు
విశాఖలో ప్రస్తుతం ఉన్న రెండు పోర్టులకు అదనంగా మరో డీప్‌వాటర్‌ పోర్టును తీసుకొస్తానని ఇచ్చిన హామీ ఈ బడ్జెట్‌లో అమలు కాలేదు. భీమిలి–కాకినాడ కారిడార్‌ పొడవున తీర రహదారిని నిర్మిస్తామని, కుర్లాన్, బయోకాన్, ఏసియన్‌ పెయింట్స్‌ తదితర పరిశ్రమలు విశాఖలో ఏర్పాటవుతాయని సీఎం చెప్పారు. కానీ వాటి నిధుల కేటాయింపుపై శ్రద్ధ చూపలేదు. సాగరమాలలో విశాఖ–కాకినాడల మధ్య పోర్టులను కలుపుతూ లాజిస్టిక్‌ హబ్‌గా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. కానీ వీటిలో ఏ ఒక్కటి ఈ బడ్జెట్‌లో చేర్చలేదు.

బీచ్‌రోడ్ల సంగతి మరిచారు?
విశాఖ–కాకినాడ, విశాఖ–చెన్నై, ఇచ్చాపురం–చెన్నైల మధ్య బీచ్‌రోడ్లను నాలుగులైన్ల రహదారులుగా విస్తరించనున్నామని, విశాఖ, గంగవరం, కాకినాడ, కష్ణపట్నం పోర్టుల సామరŠాద్యన్ని విస్తరించేందుకు నిధుల జోలికెళ్లలేదు. స్పోర్ట్స్, మెరైన్‌ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తామని ఎప్పట్నుంచో చెబుతున్నా ఈ బడ్జెట్‌లో వాటి ప్రస్తావన లేదు. హైదరాబాద్‌కు ధీటుగా విశాఖలో కార్పొరేట్‌ ఆస్పత్రుల నిర్మాణానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న హామీకి ఠికాణా లేదు.

ఐటీ హబ్‌ను పట్టించుకోలేదు?
విశాఖను ఐటీ హబ్‌గా మారుస్తామని చెబుతున్న ప్రభుత్వం ఐటీ శాఖకు కేవలం రూ.364 కోట్లు ఇచ్చింది. ఇదే రాష్ట్ర వ్యాప్త ఐటీ అభివృద్ధికి సర్ధుకోవాలంటే కనీసం మౌలిక సదుపాయాల కల్పనకు కాదు కదా రహదారుల నిర్మాణానికి కూడా సరిపోదు. ఇప్పటికే ఐటీ పరిశ్రమలు విశాఖ నుంచి తరలిపోతున్నాయి. వస్తామన్న ఒక్క కంపెనీ కూడా ఇటువైపు చూడటం లేదు. బడ్జెట్‌ కేటాయింపులు చూసిన తర్వాత ఇక విశాఖ ఐటీ హబ్‌ కలేనని తేలిపోయింది.

కేవలం ఒప్పందాలకే పరిమితం?
పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలంగా ఉందని చెబుతూ విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సును మంత్రి గొప్పగా చెప్పుకున్నారు. 2016లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో 328 అవగాహన ఒప్పందాలు చేసుకోగా రూ.4,67,577 కోట్లు మేర పెట్టుబడులు ఆకర్షించామని, 2017లో 664 ఒప్పందాలు చేసుకుని, రూ.10.54 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా 22.34 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడిందని అప్పుడు చెప్పిన అబద్ధాలనే సభా ముఖంగా మరోసారి నమ్మబలికారు. నిజానికి ఈ ఒప్పందాల్లో చాలా వరకూ తప్పుడు ఒప్పందాలని, వీటి వల్ల విశాఖకు ఒరిగేదేమీ లేదని అప్పుడే తేలిపోయింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement