పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సర్కార్
కూటమి ఎన్నికల హామీలు, సూపర్ సిక్స్, రెడ్‌బుక్ అరాచకాలపై జనం ప్రశ్నిస్తుండటంతో డైవర్షన్ రాజకీయాలే లక్ష్యంగా అజెండా
రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు, శాంతిభద్రతల వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు సర్కారు ఎత్తుగడ
కొత్తగా ఇప్పుడే మొదలైనట్లు సోషల్ మీడియా పోస్టులపైనే రచ్చ
నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు భృతి, ప్రతి విద్యార్ధికి ఏటా రూ.15 వేలు, ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు, ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని సూపర్ సిక్స్‌లో కూటమి పార్టీల హామీ
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజల కళ్లుగప్పటం... రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై ఎవరూ ప్రశ్నించకుండా రెడ్‌బుక్ అమలుతో దృష్టి మళ్లింపు రాజకీయాలే లక్ష్యంగా సాగుతున్న సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు సోమవారం శాసనసభలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
నేటి ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసన సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
అదే సమయానికి శాసన మండలిలో గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తి అయిన అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెడతారు. మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్‌ను చదువుతారు.
సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్నట్లుగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు రూ.3 వేలు చొప్పున భృతి, స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేలు, రైతన్నలకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం, ప్రతి మహిళకు (19–59 ఏళ్ల వయసు) నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం లాంటి వాగ్దానాలను నెరవేర్చకుండా మభ్యపెడుతున్న కూటమి సర్కారు అసెంబ్లీ సమావేశాలను సైతం డైవర్షన్ రాజకీయాలకే వినియోగించుకోవాలని ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై యథేచ్ఛగా జరుగుతున్న అఘాయిత్యాలు, లైంగిక దాడులు, హత్యలు, శాంతి భద్రతల వైఫల్యం నుంచి దృష్టి మళ్లించేందుకు.. ఇప్పుడే కొత్తగా సోషల్ మీడియాలో పోస్టులు వచ్చినట్లు, వాటిపైనే చర్చించాలనే వైఖరితో ప్రభుత్వం ఉందనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. పలుచోట్ల మైనర్ బాలికలు అత్యాచారాలు, హత్యలకు గురి కావడం నుంచి దృష్టి మళ్లించడమే లక్ష్యంగా సోషల్ మీడియా పోస్టులపై ప్రభుత్వ పెద్దలు ఇటీవల గగ్గోలు పెడుతున్నారు.
ఇదే అంశాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించాలని సన్నద్ధమైనట్లు సమాచారం. మరోపక్క సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బడ్జెట్ సమావేశాల్లో గత సర్కారుపై ఆరోపణలు, నిందలు మోపేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.
సూపర్ సిక్స్ హామీ కింద యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లేదంటే నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి పార్టీలు హామీలిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దీనిపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సూపర్ సిక్స్ హామీ కింద స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. దీని గురించి కూడా సర్కారు నోరు విప్పడం లేదు. ఏటా రైతన్నలకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని ఇస్తామన్నారు.
ప్రతి మహిళకు (19–59 ఏళ్ల వరకు) నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయాన్ని ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లూ వీటి అమలు గురించి ప్రస్తావించకుండా డైవర్షన్ రాజకీయాలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్‌లో ఈ పధకాలకు కేటాయింపులు ఉంటాయో లేదో నేడు తేలనుంది.
ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా మరో నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుండటంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది.
శాసన సభ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు బందోబస్తు ఏర్పాట్లపై డీజీపీ ద్వారకా తిరుమల రావు, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్, శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్‌తో ఆదివారం సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment