నేషనల్ పోలీస్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి
- మహిళా పోలీసుల డిమాండ్‌ను హోం శాఖకు వివరిస్తా
- కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ
- ఎన్‌పీఏ అంతర్జాతీయ సదస్సులో ఢిల్లీ నుంచి స్కైప్ ద్వారా ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: చైనాలో మాదిరిగానే మనదేశంలోనూ నేషనల్ పోలీస్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. వర్సి టీ ఏర్పాటుకు సంబంధించి మహిళా పోలీసు అధికారులు చేసిన ప్రతిపాదనను కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ(ఎన్‌వీపీఎన్‌పీఏ)లో ‘చట్టం అమలులో మహిళ’ అనే అంశంపై 3 రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఢిల్లీ నుంచి స్కైప్ ద్వారా స్మృతి ఇరానీ ప్రసంగించారు. ఇంత మంది మహిళల్ని పోలీసు అధికారులుగా చూస్తుంటే ఆనందంగా ఉందని, అవకాశం వస్తే ఏ రంగంలోనైనా మహిళలు దూసుకుపోగలరన్న దానికి మీరే ఉదాహరణ అని కొనియాడారు.
మహిళా అధికారుల మనోవికాసానికి ఇలాంటి అంతర్జాతీయ సదస్సులు మరిన్ని నిర్వహించాలని, రాబోయే రోజుల్లో దేశంలోని యూనివర్సిటీలతో కలసి ఇటువంటి అంతర్జాతీయ సదస్సులు నిర్వహించాలని ఎన్‌వీపీఎన్‌పీఏను కోరారు. ప్రతి పాఠశాలలో విద్యార్థినులకు ఆత్మరక్షణ మెలకువలు నేర్పేం దుకు పోలీసులతో భాగస్వామ్యమయ్యేలా పాఠశాలలకు ఆదేశాలిస్తామని రాజస్థాన్‌కు చెందిన పోలీసు అధికారి మమత అడిగిన ప్రశ్న కు సమాధానమిచ్చారు.
పోలీసు అకాడమీ, ఇతర విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని పటిష్టపరుస్తామన్నారు. ఈ సదస్సు ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పోలీసింగ్ రంగంలో ఉన్న మహిళలకి నెట్‌వర్క్ ఏర్పడటంతో పాటు అందరూ తమ అనుభవాలను పంచుకోవడం ద్వారా విధి నిర్వహణను సమర్థంగా నిర్వహించే స్థాయికి చేరుకున్నారని ఎన్‌వీపీఎన్‌పీఏ డెరైక్టర్ అరుణ బహుగుణ అన్నారు. వృత్తిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు అంతర్జాతీయ సంబంధాలు ఎంత ముఖ్యమో ఈ సదస్సు తెలియజేసిందని ప్రొఫెసర్ ట్రెసీ గ్రీన్ అన్నారు. 26/11 ముంబై ఉగ్రవాదుల దాడులకు తన భర్త, కూతురు ఎలా బలైపోయారో వన్ లైఫ్ అలయన్స్ ప్రెసిడెంట్ కియస్కెర్ ఉద్వేగభరితంగా వివరించారు.