ఢిల్లీ: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌లో భారతీయులు, హిందువులు, ఇతర మైనారిటీల భద్రత కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు అమిత్ షా వెల్లడించారు.
కాగా, బంగ్లాదేశ్ రిజర్వేషన్ల అంశంపై నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లా ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయడం, దేశాన్ని వీడటంతో ముహమ్మద్ యూనుస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. మరోవైపు.. అక్కడ పరిపాలన వ్యవస్థ లేకపోవడంతో కొందరు మూకలు రెచ్చిపోతున్నారు. భారతీయులు, హిందువులు, పలువురు మైనార్టీలపై దాడులకు తెగబడుతున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సైతం చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
సరిహద్దులో నెలకొన్న పరిస్థితులను సమీక్షించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్‌లో భారతీయులు, హిందువులు, ఇతర మైనారిటీల భద్రతను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ..‘బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో రెండు దేశాల సరిహద్దుపై ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడానికి కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్‌లో ఉన్న భారతీయులు, హిందువులతోపాటు ఇతర మైనారిటీ వర్గాల భద్రతకు సంబంధించి అక్కడి ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేపడుతుందన్నారు. బీఎస్‌ఎఫ్ తూర్పు కమాండ్ ఏడీజీ నేతృత్వంలో ఈ కమిటీ నియమించినట్లు చెప్పారు. ఇక, ఈ కమిటీలో దక్షిణ బెంగాల్, త్రిపుర విభాగాల బీఎస్‌ఎఫ్ ఐజీ స్థాయి అధికారులు, ల్యాండ్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment