
సాక్షి, అమరావతి: ప్రజల భద్రత కోసం నిబంధనలను అనుసరించి హోం శాఖ జీవో నంబర్ 1 జారీ చేసిందని అదనపు డీజీ (శాంతిభద్రతలు) రవిశంకర్ అయ్యన్నార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాదయాత్రలు, రోడ్‌షోలపై ఎలాంటి నిషేధం విధించలేదని తెలిపారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.
కొందరు దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం సభలు, సమావేశాలపై నిషేధం విధించిందని దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు జీవో నంబర్ 1లో నిషేధం అనే మాటే లేదన్నారు. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ రహదారులపైన సభలు, సమావేశాలు పెట్టొద్దని మాత్రమే చెప్పామని వెల్లడించారు.
పూర్తిగా ప్రజల ప్రయాణం, సరుకు రవాణా కోసమే రహదారులను ఉపయోగించాలని జీవోలో పేర్కొన్నారని గుర్తుచేశారు. వైద్యం, ఇతర అత్యవసర ప్రయాణాలు చేసేవారికి ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో సభలు నిర్వహించుకోవాలని సూచించామని తెలిపారు. అత్యవసరమైతే షరతులతో అధికారులు అనుమతినిస్తారని కూడా జీవోలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.
కరెంటు వైర్లు, కాలువలు, డ్రైనేజీలు దగ్గరలో లేకుండా సభలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సభల నిర్వహణకు తగిన ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో జనసేన సభ కోసం అనుమతి కోరితే అన్నీ పరిశీలించి అనుమతి మంజూరు చేశామని చెప్పారు.
చంద్రబాబు కుప్పం పర్యటనలో టీడీపీ నేతలు సరిగా దరఖాస్తు పూర్తి చేయలేదన్నారు. దరఖాస్తు సరిచేసి ఇవ్వాలని పోలీసులు చెప్పినప్పటికీ నిర్వాహకులు స్పందించలేదన్నారు. ఏ పార్టీ అయినా ఒకే రీతిలో జీవో నంబర్1 ను అమలు చేస్తామని వెల్లడించారు. 1861 పోలీసు చట్టం దేశమంతా అమలులో ఉందన్నారు.
ఆ చట్టంలోని సెక్షన్లు 30, 30ఏ, 31లలో పేర్కొన్న అంశాలకు అనుగుణంగానే జీవో నంబర్ 1ను హోం శాఖ జారీ చేసిందన్నారు. కందుకూరు, గుంటూరు జిల్లాల్లో దుర్ఘటనలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఐజీ (శాంతిభద్రతలు) రాజశేఖర్ బాబు పాల్గొన్నారు.