
న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో అసాధారణ, ప్రత్యేక ప్రతిభ చూపిన వారికి ఇచ్చే ‘పద్మ’ అవార్డుల కోసం 1,200పైగా ప్రతిపాదనలు అందినట్లు హోంశాఖ తెలిపింది. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాటిలో 1,207 ప్రతిపాదనల పరిశీలన పూర్తయిందని ఒక ప్రకటనలో వివరించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీలోగా నామినేషన్లు, ప్రతిపాదనలకు అవకాశం ఉందని తెలిపింది. ఈ అవార్డుల్లో పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ ఉంటాయి.
కేంద్ర ప్రభుత్వం 1954 గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభావంతులకు ప్రకటిస్తోంది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగాలు, ప్రసిద్ధ సంస్థలు, భారతరత్న, పద్మ విభూషణ్ గ్రహీతల నుంచి ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేసిన ప్రకటనలో ప్రతిపాదనలను ఆహ్వానించినట్లు వెల్లడించింది. ప్రతిపాదనలను ఆన్‌లైన్‌లో www.padmaawards.gov.in లోనే పంపాలని కోరింది.