అరుణ్ జైట్లీ, జార్జి ఫెర్నాండెజ్, సుష్మా స్వరాజ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగింటి ముద్దుబిడ్డ పీవీ సింధును పద్మభూషణ్ పురస్కారం వరించింది. సింధు సహా తెలంగాణ నుంచి ముగ్గురిని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరిని పద్మ పురస్కారాలు వరించాయి. ప్రజావ్యవహారాల రంగం నుంచి మాజీ కేంద్ర మంత్రులు, దివంగత జార్జి ఫెర్నాండెజ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌లకు కేంద్రం పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రి దివంగత మనోహర్ పారికర్‌కు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. ఇటీవల దివంగతులైన పెజావర మఠాధిపతి శ్రీవిశ్వేశతీర్థ స్వామీజీకి పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది. బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్‌ను పద్మవిభూషణ్ పురస్కారం వరించింది.
గణతంత్ర దినోత్సవ వేళ భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ పురస్కారాలను హోం శాఖ శనివారం ప్రకటించింది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ అనే మూడు కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవ కనబరిచిన వారికి ఏటా కేంద్రం ఈ పురస్కారాలు ప్రకటిస్తుంది. రాష్ట్రపతి భవన్‌లో ఏటా మార్చి, ఏప్రిల్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ పురస్కారాలను అందజేస్తారు. ఈ ఏడాది మొత్తం 141 పురస్కారాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని హోం శాఖ ప్రకటించింది. వీటిలో నాలుగు పురస్కారాలను ఇద్దరికీ కలిపి ప్రకటించారు. 7 పద్మవిభూషణ్, 16 పద్మభూషణ్, 118 పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది.
ప్రధాని ప్రశంసలు..
‘పద్మ’ పురస్కార గ్రహీతలను ప్రధాని మోదీ ప్రశంసించారు. మన సమాజానికి, దేశానికి మానవీయతకు అసాధారణ సేవలందించిన ప్రత్యేక వ్యక్తులు వీరు. వీరందరికీ శుభాకాంక్షలు’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
పద్మవిభూషణ్ (ఏడు) పురస్కారాలు:
1. జార్జి ఫెర్నాండెజ్(మరణానంతరం)
2. అరుణ్ జైట్లీ (మరణానంతరం)
3. అనిరు«ద్ జగ్నాథ్ జీసీఎస్‌కే
4. ఎం.సి. మేరీ కోమ్
5. ఛన్నులాల్ మిశ్రా(హిందుస్తానీ గాయకుడు)
6. సుష్మా స్వరాజ్ (మరణానంతరం)
7. విశ్వేశతీర్థ స్వామీజీ (మరణానంతరం)
పద్మభూషణ్ పొందిన వారిలో ప్రముఖులు: ఎం.ముంతాజ్ అలీ(ఆధ్యాత్మికం,–కేరళ) సయ్యద్ మౌజెం అలీ(మరణానంతరం), (ప్రజావ్యవహారాలు, బంగ్లాదేశ్), ముజఫర్ హుస్సేన్ బేగ్ (ప్రజా వ్యవహారాలు–జమ్మూకశ్మీర్), అజోయ్ చక్రవర్తి (కళలు–పశ్చిమ బెంగాల్), మనోజ్ దాస్ (సాహిత్యం, విద్య–పుదుచ్చేరి), బాల్‌కృష్ణ దోషి (ఆర్కిటెక్చర్–గుజరాత్), కృష్ణమ్మాళ్ జగన్నాథన్ (సామాజిక సేవ–తమిళనాడు), ఎస్.సి.జమీర్(ప్రజా వ్యవహారాలు, నాగాలాండ్), అనిల్ ప్రకాష్ జోషి (సామాజిక సేవ–ఉత్తరాఖండ్), త్సెరింగ్ లాండోల్ (వైద్యం, లదాఖ్), ఆనంద్ మహీంద్ర (వర్తకం, వాణిజ్యం–మహారాష్ట్ర), నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు–కేరళ), మనోహర్ గోపాలకృష్ణ పారికర్ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు– గోవా), పి.వి.సింధు( క్రీడలు– తెలంగాణ), వేణు శ్రీనివాసన్ (వర్తకం, వాణిజ్యం–తమిళనాడు).
118 మందికి పద్మశ్రీ: మొత్తం 118 పద్మ శ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి ఇద్దరికి ఈ పురస్కారం లభించింది. వ్యవసాయ రంగం నుంచి చింతల వెంకటరెడ్డి, సాహిత్యం మరియు విద్య రంగం నుంచి విజయసారథి శ్రీభాష్యం ఈ జాబితాలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి పద్మ శ్రీ పురస్కారం లభించింది. కళల రంగం నుంచి పౌరాణిక నటుడు యడ్ల గోపాలరావు, దళవాయి చలపతిరావులకు ఈ పురస్కారం లభించింది. దళవాయి చలపతిరావు తోలు బొమ్మలాట కథకుడిగా ప్రసిద్ధి చెందారు. ఇక బాలీవుడ్ సినీ ప్రముఖులు కంగనా రనౌత్, కరణ్ జోహార్, ఏక్తా కపూర్, అద్నన్ సమీ తదితరులకు పద్మశ్రీ పురస్కారం లభించింది.
అరుణ్ జైట్లీ: 2019 మేలో ఈయన మృతి చెందారు. 2014–19 సంవత్సరాల మధ్య కేంద్ర కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. సుప్రీంకోర్టు లాయర్ కూడా అయిన జైట్లీ ఆర్థిక మంత్రిగా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వంటి పలు విధానాలను ప్రవేశపెట్టారు. సాధారణ బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్‌ను విలీనం చేశారు.
సుష్మా స్వరాజ్: బీజేపీ సీనియర్ నేత, సుప్రీంకోర్టు లాయర్‌గా పనిచేసిన సుష్మా స్వరాజ్ గత ఏడాది చనిపోయారు. ప్రధాని మోదీ కేబినెట్‌లో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసి అందరి ప్రశంసలు పొందారు. ఇందిరాగాంధీ తర్వాత విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ సుష్మా.
జార్జి ఫెర్నాండెజ్: కార్మిక నాయకుడు, రాజకీయవేత్త, జర్నలిస్టు అయిన జార్జి మాథ్యూ ఫెర్నాండెజ్ లోక్‌సభలో అత్యధిక కాలం సభ్యునిగా కొనసాగిన వారిలో ఒకరు. 1967లో ముంబైలో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటికీ బిహార్ నుంచే ఎక్కువ కాలం ప్రజాప్రతినిధిగా కొనసాగారు.
శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ: ఉడుపి పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ దక్షిణాది ఆధ్యాత్మిక ప్రముఖుల్లో ఒకరు. దాదాపు 8 దశాబ్దాలపాటు ఆధ్యాత్మిక సేవ చేశారు. శ్రీ మధ్వాచార్యుడు స్థాపించిన ఉడుపి అష్ట మఠాల్లో పెజావర మఠం ఒకటి.
విశ్వేశతీర్థ స్వామీజీ, ఛన్నులాల్ మిశ్రా, మనోహర్ పారికర్
అజ్ఞాత హీరోలు
చండీగఢ్‌లోని పీజీఐ ఆస్పత్రి వద్ద రోగులు, వారి సహాయకులకు ఉచితంగా ఆహారం అందజేస్తున్న జగ్దీశ్ లాల్ అహూజా, దాదాపు 25 వేల అనాథ శవాలకు అంతిమ సంస్కారం జరిపిన ఫైజాబాద్‌కు చెందిన మొహమ్మద్ షరీఫ్, గజరాజుల వైద్యుడిగా పేరున్న అస్సాం వాసి కుషాల్ కొన్వర్ తదితర ఎందరో అజ్ఞాత హీరోలను ఈ ఏడాది పద్మశ్రీ వరించింది. 40 గ్రామాల్లోని ప్రత్యేక అవకరాలు కలిగిన 100 మంది పిల్లలకు 2దశాబ్దాలుగా ఉచిత విద్యనందిస్తున్న కశ్మీర్‌కు చెందిన దివ్యాంగుడు జావెద్ తక్, అడవుల్లోని సమస్త జీవజాతుల గురించి తెలిసిన, అటవీ విజ్ఞాన సర్వస్వంగా పేరు తెచ్చుకున్న కర్ణాటకకు చెందిన తులసి గౌడ(72)కు, 40 ఏళ్లుగా ఈశాన్య రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాల్లో విద్యనందిస్తూ అంకుల్ మూసాగా పేరున్న అరుణాచల్‌కు చెందిన సత్యానారాయణ్‌కు ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment