సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులపైన, మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతించేది లేదని స్పష్టంచేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు లేదా పోలీస్ కమిషనర్లు కచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వొచ్చని మినహాయింపునిచ్చింది.
ఈమేరకు హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1861 పోలీస్ చట్టం ప్రకారం హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలతో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తుండటంతోపాటు, వాటి నిర్వహణలో లోటుపాట్లు, నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను బలిగొంటున్న నేపథ్యంలో 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులు పూర్తిగా ప్రజల రాకపోకలు, సరుకు రవాణా కోసమే ఉపయోగించాలని స్పష్టం చేసింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సభల నిర్వహణకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలని ప్రభుత్వం జిల్లాల ఉన్నతాధికారులకు సూచించింది.
రహదారులకు దూరంగా, సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా సరైన ప్రదేశాలను ఎంపిక చేయాలని పేర్కొంది. వివిధ పార్టీలు, ఇతర సంస్థలు సభలను ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించుకోవచ్చని చెప్పింది.
అత్యంత అరుదైన సందర్భాల్లో..
అత్యంత అరుదైన సందర్బాల్లో జిల్లా ఎస్పీలు/ పోలీస్ కమిషనర్లు సంతృప్తి చెందితే షరతులతో సభలు, ర్యాలీలకు అనుమతినివ్వొచ్చు. అందుకు నిర్వాహకులు ముందుగా లిఖితపూర్వకంగా అనుమతి తీసుకోవాలి. సభను ఏ ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు నిర్వహిస్తారు, కచ్చితమైన రూట్ మ్యాప్, హాజరయ్యేవారి సంఖ్య, సక్రమ నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ దరఖాస్తు చేసుకోవాలి. వాటిపై జిల్లా ఎస్పీ/ పోలీస్ కమిషనర్ సంతృప్తిచెందితే నిర్వాహకుల పేరిట షరతులతో అనుమతినిస్తారు. సభ, ర్యాలీ నిర్వహణలో షరతులను ఉల్లంఘిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
ప్రజల ప్రాణాలు కాపాడేందుకే
రాష్ట్రంలో రహదారులపై నియంత్రణ లేకుండా సభలు, ర్యాలీల నిర్వహణ వల్ల సామాన్య ప్రజానీకం ప్రాణాలు కోల్పోతున్నారు. పలువురు తీవ్రంగా గాయపడతున్నారు. ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా కందుకూరులో రోడ్డుపై టీడీపీ నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది సామాన్యులు దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లాలో టీడీపీ నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమంలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
ఈ రెండు దుర్ఘటనల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రహదారులను ఆక్రమించి వేదికల నిర్మాణం, ఇష్టానుసారం ఫ్లెక్సీలు, సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు, చివరి నిమిషాల్లో రూట్ మ్యాప్‌ల మార్పు, ఇరుకుగా బారికేడ్ల నిర్మాణం మొదలైన లోపాలతో ఈ రెండు దుర్ఘటనలు జరిగాయని అధికారులు నిర్ధారించారు. ఈ దుర్ఘటనలపై మెజిస్టీరియల్ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీల నిర్వహణపై నియంత్రణ విధించింది.
రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం..ప్రజల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
Published Tue, Jan 3 2023 3:57 AM | Last Updated on Tue, Jan 3 2023 8:38 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment