
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో సాంకేతికంగా తెచ్చిన మార్పులు, విప్లవాత్మకంగా రూపొందించిన యాప్స్.. తదితర అంశాలపై అఖిల భారత డీజీపీల సదస్సులో ‘టెక్నో ఎక్స్‌పో’ ఏర్పాటు చేయనున్నారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ టెకన్‌పూర్‌లో ఉన్న బీఎస్‌ఎఫ్ క్యాంపులో శనివారం నుంచి మూడు రోజల పాటు జరిగే డీజీపీల సదస్సు లో ఈ ఎక్స్‌పోను ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డికి సూచించింది.
ఈ నేపథ్యంలో డీజీపీ మహేందర్‌రెడ్డి ఎక్స్‌పో ఏర్పాట్లను పర్యవేక్షించేం దుకు రెండురోజుల ముందే సీనియర్ ఎస్పీ రమేశ్‌రెడ్డిని గ్వాలియర్ పంపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగే ఈ సదస్సులో రాష్ట్ర పోలీసు శాఖ ప్రత్యేకంగా నిలవనుందని అధికారవర్గాలు తెలిపాయి. కాగా, సదస్సులో పాల్గొనడంకోసం శుక్రవారం రాత్రి డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్ మధ్యప్రదేశ్ వెళ్లారు.
ఎన్నో ప్రత్యేకతలు..
హైదరాబాద్ కమిషనరేట్ నేతృత్వంలో తయారుచేసిన హాక్‌ఐ, లాస్ రిపోర్ట్, హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్ తదితర యాప్స్ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. కేసుల దర్యాప్తు కోసం పోలీసు సిబ్బంది, అధికారుల అంతర్గత వినియోగానికి ‘హైదరాబాద్ కాప్’యాప్ రూపొందించి తర్వాత దానిని టీఎస్ కాప్‌గా అభివృద్ధి చేశారు. దీని పనితీరు, ఉప యోగాలను సదస్సులో ఇతర రాష్ట్రాల అధికారులకు వివరించనున్నారు.
అదేవిధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది నడవడికను పర్యవేక్షించేందుకు చెస్ట్ మౌంటెడ్ కెమెరాలను అందుబాటులోకి తెచ్చారు. దీన్నికూడా టెక్నో ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. హైదరాబాద్‌లో తొలిసారిగా క్రైమ్, సైబర్ ల్యాబ్‌లను ఏర్పా టు చేశారు. వీటన్నింటినీ ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నారు. క్రైమ్ సీన్ రికార్డింగ్ కోసం హైదరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా 3డీ కెమెరాలు ఉపయోగిస్తున్నారు.
ఈ కెమెరాలను ఎక్స్‌పో ద్వారా ఇతర రాష్ట్రాల దృష్టికి తీసుకెళ్లనున్నారు. వీటన్నింటికీ మించి పంజగుట్ట పోలీసు స్టేషన్ దేశంలోనే ‘బెస్ట్ ఆఫ్ త్రీ’గా ఎంపికయ్యింది. ఈ అవార్డును హైదరాబాద్ పోలీసు అధికారులు ఈ సదస్సులో అందుకోనున్నారు. ఇంకా పలు అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో వివరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment