న్యూఢిల్లీ: మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతకు ముప్పు ఏర్పడిందని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది. ప్రధాని భద్రతకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు కొత్తగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) అనుమతి లేకుండా మంత్రులు, ఉన్నతాధికారులు సైతం ప్రధానికి దగ్గరగా వెళ్లడానికి వీళ్లేదని స్పష్టం చేసింది. ప్రధాని మోదీకి ఊహించని ముప్పు పొంచి ఉందని, 2019 ఎన్నికలకు సంబంధించి సంఘ వ్యతిరేక శక్తులకు ప్రధాని మోదీనే అత్యంత విలువైన లక్ష్యమని ఆ మార్గదర్శకాల్లో హెచ్చరించారు.
‘ఎవరూ కూడా, చివరకు మంత్రులు కూడా ఎస్పీజీ అనుమతి లేకుండా ప్రధాని దగ్గరకు వెళ్లడానికి వీల్లేదు’ అని వాటిలో స్పష్టంగా పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి ప్రధాని మోదీనే కీలక ప్రచారకర్తగా వ్యవహరించాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో రోడ్ షోల సంఖ్యను తగ్గించుకోవాలని ప్రధానికి ఎస్పీజీ సూచించినట్లు సమాచారం. రోడ్‌షోల సమయంలో దాడులకు ఎక్కువ ఆస్కారం ఉంటుందని, అందువల్ల ఎక్కువగా బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుంటే మంచిదని, బహిరంగ సభలకు భద్రత ఏర్పాట్లు చేయడం కొంతవరకు సులభమవుతుందని ఎస్పీజీ ప్రధానికి వివరణ ఇచ్చింది.
తాజా మార్గదర్శకాలను ప్రధాని భద్రతను పర్యవేక్షించే క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్ అధికారులకు వివరించారు. అవసరమైతే, మంత్రులను, అధికారులను కూడా తనిఖీ చేసేందుకు వెనకాడవద్దని స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ సహా మావోల ప్రభావం అధికంగా గల రాష్ట్రాలను సున్నిత ప్రాంతాలుగా గుర్తించి.. ఆయా రాష్ట్రాల పోలీసు చీఫ్‌లు ప్రధాని పర్యటనకు వచ్చినప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ ఆదేశించింది.
మావోల లేఖ వల్లనే!: రాజీవ్ గాంధీ హత్య తరహాలో మోదీని హతమార్చేందుకు అవకాశాలున్నాయంటూ పలు వివరాలున్న ఒక లేఖను పుణె పోలీసులు ఇటీవల బహిర్గత పర్చిన విషయం తెలిసిందే. ఢిల్లీలో మావోయిస్టు సానుభూతిపరుల నుంచి ఆ లేఖను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు కోర్టుకు తెలిపారు.
దాంతో ప్రధాని భద్రత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మరోవైపు, ఇటీవలి పశ్చిమబెంగాల్ పర్యటన సమయంలో.. ఆరంచెల భద్రతావలయాన్ని ఛేదించుకుని మరీ ఓ వ్యక్తి మోదీకి దగ్గరగా వచ్చిన ఘటన భద్రతా దళాలకు ముచ్చెమటలు పట్టించింది. ఈ నేపథ్యంలోనే.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోం కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్‌లతో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment