న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నానాటికీ పెచ్చరిల్లుతున్న ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనే గాక ఇంధన భద్రతపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వెలిబుచ్చారు. శుక్రవారం కౌటిల్య ఎకనమిక్ కాన్‌క్లేవ్ మూడో వార్షిక సదస్సులో ప్రధాని ప్రసంగించారు. పశ్చిమాసియా కల్లోలానికి తోడు రెండేళ్లకు పైగా సాగుతున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ప్రస్తావించారు. భారత ఇంధన అవసరాలు 85 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. వీటిలో అధిక భాగం పశ్చిమాసియా నుంచే వస్తుంది.
ఈ కల్లోల పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోందని మోదీ అన్నారు. అంతర్జాతీయ సమాజంలో మనకు పెరుగుతున్న ప్రతిష్టకు ఇది నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ‘‘సైన్స్, టెక్నాలజీ మొదలుకుని ఇన్నొవేషన్ల దాకా ఆకాశమే హద్దుగా భారత్ సాగుతోంది. రిఫామ్, పెర్‌ఫామ్, ట్రాన్స్‌ఫామ్ నినాదంతో దూసుకుపోతోంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఏకంగా రూ.15 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నాం. పథకాలు తీసుకొచ్చాం. ఎన్డీఏ పదేళ్ల పాలనలో భారత ఆర్థిక ముఖచిత్రాన్నే సమూలంగా మార్చేశాం. మన ఆర్థిక వృద్ధిపై ప్రపంచ నేతలంతా ఎంతగానో నమ్మకం పెట్టుకున్నారు’’ అని చెప్పుకొచ్చారు. 2047కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు అన్ని రంగాల్లోనూ సంస్కరణలను కొనసాగించేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్టు మోదీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment