యుద్ధాన్ని ఆపే సత్తా మోదీకి ఉంది : జెలెన్‌స్కీ | Modi Can Influence End Of War In Ukraine Says Zelenskyy, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

Volodymyr Zelensky On Modi: యుద్ధాన్ని ఆపే సత్తా మోదీకి ఉంది

Published Tue, Oct 29 2024 6:23 AM | Last Updated on Tue, Oct 29 2024 9:50 AM

Modi can influence end of war in Ukraine says Zelenskyy

విశ్వాసం వ్యక్తం చేసిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ  

బ్రిక్స్‌ శిఖరాగ్రం విఫలమైందని వ్యాఖ్యలు 

కీవ్‌: ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికే సత్తా భారత ప్రధాని మోదీకి ఉందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ పేర్కొన్నారు. దీని ద్వారా ఆయనకే కాదు, అంతర్జాతీయంగాను భారత్‌ ప్రతిష్ట పెరుగుతుందన్నారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు జెలెన్‌స్కీ ఇటీవల ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉక్రెయిన్‌ సంక్షోభానికి సంబంధించిన పలు విషయాలను ఆయన ప్రస్తావించారు. 

ప్రధాని మోదీ జోక్యంతో ఉక్రెయిన్, రష్యాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయా అన్న ప్రశ్నకు జెలెన్‌స్కీ..‘ప్రధాని మోదీ దీనిని నిజం చేయగలవనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు భారత్‌లోనే చర్చలు జరగొచ్చు. అయితే, యుద్ధం మా గడ్డపై జరుగుతున్నందున మేమిచ్చే షరతులకు లోబడే సంప్రదింపులు జరగాలి’అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు ప్రయతి్నస్తానన్న మోదీ ప్రకటనపై జలెన్‌ స్కీ..మాటలు కాదు, చేతలు అవసరమన్నారు. 

‘జనాభాపరంగా, ఆర్థికంగా, పలుకుబడిపరంగా భారత్‌ పెద్ద దేశం. అలాంటి దేశానికి ప్రధాని అయిన మోదీ..యుద్ధాన్ని ఆపేందుకు ప్రయతి్నస్తామని కేవలం మాటగా చెప్పడం సరికాదు. యుద్ధాన్ని ఆపేందుకు పలుకుబడిని ఉపయోగించాలి. రష్యాను ఆర్థికంగా దెబ్బకొట్టాలి. ఆదేశం నుంచి చౌకగా దొరుకుతున్న చమురును, రక్షణ రంగ ఉత్పత్తులను కొనరాదు. ఫలితంగా ఆ దేశ యుద్ధ సామర్ధ్యం దెబ్బతింటుంది’అని తెలిపారు. యుద్ధం సమయంలో ఎత్తుకుపోయిన మా చిన్నారుల్లో కనీసం వెయ్యి మందినైనా తిరిగి మాకు ఇచ్చేలా మోదీ రష్యాపై తన పలుకుబడిని ఉపయోగించాలన్నారు. 

తటస్థత అంటే రష్యా వైపు ఉన్నట్టే 
‘యుద్ధం జరుగుతున్న సమయంలో తటస్థంగా ఉండటమంటే రష్యా పక్షాన ఉన్నట్లే అర్థం. దురాక్రమణదారు, బాధిత దేశం మధ్య తటస్థత అనేదే ఉండదు. అలా ఉండటమంటే పరోక్షంగా రష్యాకు మద్దతివ్వడమే’అని జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు. ‘బ్రిక్స్‌ శిఖరాగ్రంలో పాల్గొన్న నేతలు కూడా సంక్షోభం సమసేందుకు సహకరిస్తామని చెప్పారు. నా దృష్టిలో అది కూడా మాకంటే రష్యాకే ఎక్కువగా అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నా’అన్నారు. ‘అంతేకాదు, సౌదీ అరేబియా, బ్రెజిల్‌ వంటి దేశాల నేతలు రానందున బ్రిక్స్‌ శిఖరాగ్రం విఫలమైనట్లే లెక్క. ప్రపంచాన్ని పుతిన్‌ పశి్చమ అనుకూల, బ్రిక్స్‌ అనుకూల దేశాలుగా విభజించాలనుకుంటున్నారు. అందుకే, బ్రెజిల్, చైనాలు తీసుకువచి్చన శాంతి ప్రతిపాదనలను సైతం తిరస్కరించారు. ఈ పరిణామం చైనా, బ్రెజిల్‌లకు చెంపపెట్టు వంటిది’అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement