పారిస్‌లో జెలెన్‌స్కీతో భేటీ అనంతరం ట్రంప్ పిలుపు
నాటో నుంచి అమెరికా వైదొలగడం సాధ్యమేనని వ్యాఖ్య
వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం తక్షణమే ఆగిపోవాలని అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. నాటో నుంచి అమెరికా వైదొలిగే అంశాన్ని పరిశీలిస్తున్నామని కూడా ఆయన వెల్లడించారు. పారిస్‌లో శనివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్ వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం ట్రంప్ తన సొంత ట్రూత్ సోషల్‌లో.. ‘రష్యాతో వెయ్యి రోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఉక్రెయిన్ ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నా’ అంటూ వ్యాఖ్యానించారు.
‘అవసరమే లేని యుద్ధంలో రష్యా, ఉక్రెయిన్‌లు రెండూ వేలాదిగా సైనికులను పోగొట్టుకున్నాయి. అందుకే చర్చలు ప్రారంభించి, వెంటనే కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలి. ఎన్నో ప్రాణాలు అనవసరంగా బలయ్యాయి. ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కోరుతున్నా’ అని ఆయన పేర్కొన్నారు. ట్రంప్‌తో సమావేశం నిర్మాణాత్మకంగా జరిగిందని అంతకుముందు జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
‘శాంతి ఒప్పందంతో మాకు న్యాయం జరగాలి. రష్యా, పుతిన్, ఇతర దురాక్రమణదారులు ఇలాంటి యుద్ధాలకు దిగే అవకాశం మళ్లీ ఇవ్వరాదు’అని స్పష్టం చేశారు. ఈ యుద్ధంలో తాము 43 వేల మంది సైనికులను కోల్పోయామని, మరో 3.70 లక్షల మంది క్షతగాత్రులయ్యారని జెలెన్‌స్కీ చెప్పారు. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమేనని రష్యా ట్రంప్ ప్రకటనపై ఈ మేరకు స్పందించడం గమనార్హం. అయితే, అధ్యక్షుడిగా పుతిన్ ఉన్నంతకాలం రష్యాతో చర్చల ప్రసక్తే లేదని గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేసిన ప్రకటనను గుర్తు చేసింది.
నాటో నుంచి బయటికొస్తాం
నాటో నుంచి అమెరికా బయటికి వచ్చే విషయం ఇప్పటికీ తమ పరిశీలనలో ఉందని, అది సాధ్యమేనని ట్రంప్ ఎన్‌బీసీ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘నాటోలో అమెరికా బలగాలుండాలంటే బదులుగా యూరప్, కెనడా ప్రభుత్వాలు అందుకయ్యే వ్యయం భరించాలి. అప్పుడే వాళ్లు మమ్మల్ని సమభావంతో చూస్తున్నట్లు లెక్క. అలాగైతేనే మేం నాటోలో కొనసాగుతాం’ అని ఆయన స్పష్టం చేశారు. యూరప్, కెనడాలకు తామెందుకు భద్రత కల్పించాలంటూ అమెరికా అధ్యక్షుడిగా ఉండగా గతంలోనే ఆయన ప్రశ్నించడం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment