మా ప్రమేయం లేని ఒప్పందాలను  అంగీకరించం: జెలెన్‌స్కీ | Not accept any agreements made without Ukraine says Zelensky | Sakshi
Sakshi News home page

మా ప్రమేయం లేని ఒప్పందాలను  అంగీకరించం: జెలెన్‌స్కీ

Published Fri, Feb 14 2025 2:38 AM | Last Updated on Fri, Feb 14 2025 2:38 AM

Not accept any agreements made without Ukraine says Zelensky

కెమెల్‌నిత్‌స్కీ (ఉక్రెయిన్‌): యుద్ధ విరమణపై తమ ప్రమేయం లేని ఎలాంటి చర్చలు తమకు ఆమోదయోగ్యం కాదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. వాటిని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌– రష్యా యుద్ధ విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం రష్యా అ« ద్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన జెలెన్‌స్కీతోనూ చర్చలు జరిపారు.

 చర్చలకు చొరవ తీసుకుంటున్నట్లు ట్రంప్‌ ప్రకటించాక.. జెలెన్‌స్కీ గురువారం దీనిపై తొలిసారిగా స్పందించారు. ‘ప్రతీది పుతిన్‌ ప్రణాళిక ప్రకారం జరగడానికి వీల్లేదు. దీన్ని మేము అంగీకరించం, అనుమతించం’ అని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. ఒక స్వతంత్ర దేశంగా మా ప్రమేయం లేని ఎలాంటి చర్చలూ మాకు ఆమోదయోగ్యం కాదని మా మిత్రదేశాలకు స్పష్టం చేస్తున్నాని తెలిపారు. శాంతి చర్చలకు ఉక్రెయిన్, యూరప్‌లను దూరంగా పెట్టడం సబబు కాదని నాటో దేశాలు పేర్కొన్నాయి.

 ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం అసాధ్యమని, రష్యా ఆక్రమిత భూభాగాలను ఉక్రెయిన్‌ వదులుకోవాల్సి ఉంటుందని అమెరికా రక్షణ మంత్రి పీటే హెగ్సెత్‌ బుధవారం వ్యాఖ్యానించడంతో.. నాటో దేశాలు చర్చలు ఏకపక్షంగా ఉంటాయేమోనని ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్‌కు అన్యాయం చేస్తున్నారనే వాదనను హెగ్సెత్‌ గురువారం ఖండించారు. ‘ఉక్రెయిన్‌ ప్రమేయం లేకుండా ఉక్రెయిన్‌ గురించి చర్చలు ఉండకూడదు. ఉక్రెయిన్‌ వాదనకు చర్చల్లో ప్రాధాన్యం దక్కాలి’ అని బ్రిటన్‌ రక్షణమంత్రి జాన్‌ హీలి అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement