మన పంతం అవినీతి అంతం | CM YS Jagan Comments In High-level review of Home Department | Sakshi
Sakshi News home page

మన పంతం 'అవినీతి అంతం'

Published Thu, Apr 21 2022 2:36 AM | Last Updated on Thu, Apr 21 2022 2:36 AM

CM YS Jagan Comments In High-level review of Home Department - Sakshi

అవినీతిపై ఫిర్యాదులకు యాప్‌
ప్రజలు అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు వ్యవస్థలను అందుబాటులోకి తేవాలి. దిశ మాదిరిగానే ఏసీబీకి నెల రోజుల్లో ప్రత్యేక యాప్‌ను తీసుకువచ్చి, కార్యాచరణ సిద్ధం చేయాలి. అవినీతిపై ఈ యాప్‌ ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు. తమ వద్దనున్న ఆడియో, వీడియో ఆధారాలతో సహా పత్రాలను నేరుగా అప్‌లోడ్‌ చేయొచ్చు. వాటిని నిర్ధారించడానికి అధునాతన ఫోరెన్సిక్‌ వ్యవస్థలు కూడా ఉండాలి. ఆ యాప్‌కు వచ్చిన ఫిర్యాదులపై ఏసీబీ తక్షణం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి.

ఆధునిక నాగరికత పేరుతో వస్తున్న పెడధోరణులకు అడ్డుకట్ట వేయాలి. డ్రగ్స్, గంజాయిలను పూర్తిగా నిరోధించాలి. మన పిల్లలు వీటి బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. విద్యా సంస్థలపై పూర్తిగా నిఘా ఉంచాలి. జూనియర్‌ కాలేజీ మొదలు డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్‌ కాలేజీలు, యూనివర్సిటీల వరకు ప్రత్యేకంగా దృష్టి సారించాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో అవినీతికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వకూడదు. ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో అవినీతి అన్నదే ఉండకూడదు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో లంచాలన్న మాటే వినిపించకూడదు. ఏసీబీ ప్రధాన విధి అదే. అవినీతి చోటుచేసుకుంటున్న వ్యవస్థలను క్లీన్‌ చేసుకుంటూ వెళ్లాలి’ అని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో హోం శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో అవినీతికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వకూడదని, ఎక్కడా అవినీతి అన్నది కనిపించకూడదని చెప్పారు. ఏసీబీకి ఇది ప్రాథమిక విధి కావాలని, అవినీతి కేసులు ఎక్కువగా నమోదవుతున్న విభాగాలపై ఏసీబీ మరింతగా దృష్టి సారించాలని సూచించారు.

గ్రామ, వార్డు సచివాలయాలు అవినీతికి దూరంగా ఉన్నందున, భవిష్యత్తులో కూడా ఈ వ్యవస్థలో అవినీతి కనిపించకూడదని.. అందుకోసం అవసరమైన ఎస్‌ఓపీలు తయారు చేయాలని ఆదేశించారు. ‘గ్రామ, వార్డు సచివాలయాల్లోకి సబ్‌ రిజిస్ట్రార్‌ వ్యవస్థలు వస్తున్నాయి. సర్వేయర్లు వస్తున్నారు. భూముల పంపకాల వల్ల వచ్చే డివిజన్, సర్వే, రిజిస్ట్రేషన్‌ తదితర ప్రక్రియలన్నీ సచివాలయాల్లోనే జరుగుతాయి. అలాంటి సందర్భాల్లో కూడా అవినీతికి ఆస్కారం ఉండకూడదు. అవినీతి చోటు చేసుకుంటున్న వ్యవస్థలను క్లీన్‌ చేసుకుంటూ వెళ్లాలి’ అని చెప్పారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గోరుముద్ద, సంపూర్ణ పోషణ వంటి కార్యక్రమాల్లో అవినీతికి, లంచాలకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు. మూడేళ్లు కాకముందే  ప్రజలకు రూ.1.35 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) పద్ధతిలో ఇచ్చామన్నారు. మధ్యవర్తులు లేకుండా ఎక్కడా పైసా అవినీతి, వివక్షకు తావు లేకుండా ప్రజల ఖాతాల్లో నగదు జమ చేశామని, వచ్చే రెండేళ్లతో కలిపితే సుమారు రూ.2.5 లక్షల కోట్లు ప్రజలకు అందించనున్నామని తెలిపారు. దేవుడి దయవల్ల ఎలాంటి అవినీతికి చోటు లేకుండా ఇవన్నీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
హోం శాఖపై సమీక్ష సందర్భంగా అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి   
 
మండల స్థాయి వరకూ ఏసీబీ వ్యవస్థ బలోపేతం
► అవినీతి నిరోధానికి 14400 టోల్‌ఫ్రీ నంబరు పెట్టాం. ఈ నంబరుకు విస్తృత ప్రచారం కల్పించాలి. ఏసీబీ విధులేమిటి, ఎలా పని చేస్తుందన్నది విస్తృతంగా ప్రజలకు తెలియాలి. అవినీతి జరుగుతున్నట్టుగా ఆడియో రికార్డ్‌ పంపించినా సరే చర్యలు తీసుకునేట్టుగా వ్యవస్థ ఉండాలి. 
► మండల స్థాయి వరకూ ఏసీబీ వ్యవస్థను బలోపేతం చేయాలి. దిశ, ఎస్‌ఈబీ (స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో), ఏసీబీలకు మండల స్థాయిల్లో స్టేషన్లు ఉండాలి. ఈ మూడింటినీ పర్యవేక్షించడానికి జిల్లా స్థాయిలో ఒక అధికారి ఉండాలి. 
► అవినీతి నిరోధానికి ఒక యాప్‌ను పెట్టాలి. లంచాల కేసుల్లో అరెస్టయిన వారికి వేగంగా శిక్షలు పడాలి. ప్రస్తుతం ఉన్న చట్టాలను పరిశీలించి అవసరమైతే మార్పులు, చేర్పులు చేసి సమర్థవంతంగా అమలు చేయాలి. ఎలాంటి అవినీతి వ్యవహారంపైనైనా ఏసీబీ పర్యవేక్షణ చేపట్టాలి. 
► ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై వచ్చిన ఫిర్యాదులపైనా ఏసీబీ దృష్టి పెట్టాలి. సంబంధిత శాఖలు ఆ ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలను ఏసీబీ పర్యవేక్షించాలి. దీనికోసం వివిధ ప్రభుత్వ విభాగాలు, ఏసీబీ మధ్య సినర్జీ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి. ఏసీబీకి ఫిర్యాదు చేయాల్సిన నంబర్‌ను ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో బాగా కనిపించేలా హోర్డింగ్స్‌ పెట్టాలి. యాప్‌ ద్వారా ఎలా ఫిర్యాదు చేయాలనే సూచనలను ఆ హోర్డింగ్స్‌లో పొందుపరచాలి. 

మరింత సమర్థంగా ‘దిశ’ వ్యవస్థ
► మహిళా భద్రత కోసం దిశ వంటి కార్యక్రమాన్ని మునుపెన్నడూ ఎవరూ చేపట్ట లేదు. మనమే తొలిసారిగా దిశ వ్యవస్థను తీసుకువచ్చాం. హోంమంత్రి, డీజీపీ ప్రతిష్టాత్మకంగా ఈ వ్యవస్థ సమర్థవంతంగా పని చేసేట్టు చూడాలి. 
► ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టిన ప్రతి బాలిక, మహిళ చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటే చాలు భద్రతకు భరోసా లభించినట్లే. దిశ యాప్‌లోని ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కినా, ఫోన్‌ను 5 సార్లు అటూ ఇటూ ఊపినా.. 10 – 15 నిమిషాల్లో పోలీసులు వస్తారు. పోలీసులు స్పందించే సమయం (రెస్పాన్స్‌ టైం)ను ఇంకా తగ్గించడంతో పాటు బాధిత మహిళలకు కచ్చితంగా సహాయం అందాలి. 
► ఎంత వేగంగా ఘటనా స్థలానికి చేరుకోగలిగితే అంత వేగంగా నేరాన్ని నివారించగలుగుతాం. దాంతో మహిళలు, బాధితులకు భద్రత కల్పించే విషయంలో గొప్ప మార్పు వస్తుంది. దిశను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి మెరుగైన ప్రోటోకాల్స్‌ రూపొందించాలి. 
► ఇప్పటి వరకు 1.24 కోట్ల మంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. మన లక్ష్యం నేరాన్ని నివారించడమే కాదు.. ఆ నేరానికి యత్నించిన వ్యక్తికి శిక్ష విధించడం. ఈ మొత్తం ప్రక్రియలో దిశ వ్యవస్థ అత్యంత సమర్థంగా పని చేయాలి. ఈ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ఎటువంటి ప్రతిపాదనలనైనా  ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. 

నిఘా మరింత పటిష్టం కావాలి
► రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, రవాణాను ఉక్కుపాదంతో అణచి వేయాలి. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ)కు ప్రభుత్వం నిర్దేశించిన కార్యకలాపాలు అత్యంత కీలకం. ఎస్‌ఈబీ కోసం ఓ కాల్‌ సెంటర్‌ నంబర్‌ను అందుబాటులోకి తేవాలి. 
► ఎక్కడ ఏం జరిగినా మనకు తక్షణం సమాచారం వచ్చేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, ఏ సమాచారం వచ్చినా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. డ్రగ్స్‌ విక్రయిస్తున్న వారిపైనే కాదు.. మూలాల్లోకి వెళ్లి ఆ వ్యవస్థలను కూకూటి వేళ్లతో సహా పెకలించాలి. 
► చీకటి సామ్రాజ్యాల్లో జరిగే కార్యకలాపాలపై పోలీసులు దృష్టి పెట్టాలి. అందుకోసం నిఘాను పటిష్ట పరచాలి. టయర్‌ వన్‌ సిటీలలో డ్రగ్స్‌ ఘటనలు చూశాం. అలాంటివి మన దగ్గర కూడా జరుగుతున్నాయా అన్నదానిపై దృష్టి పెట్టాలి. మన పిల్లలు, మన విద్యా వ్యవస్థను మనం కాపాడుకోవాలి. మనం చేయకపోతే భవిష్యత్‌ తరం ఫెయిల్‌ అవుతుంది. 
► మన పిల్లలకు మంచి భవిష్యత్‌ అందించే వాతావరణాన్ని అందించాల్సిన బాద్యత మనదే. కొందరి జీవితాలు, కొన్ని కుటుంబాలను నాశనం చేసే పరిస్థితులు మన రాష్ట్రంలో ఎక్కడా ఉండకూడదు. అందుకోసం పోలీసులు అత్యంత సమర్థంగా పని చేయాలి. సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు పాల్పడుతున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. 

ప్రతి నెలా నివేదికలు ఇవ్వాలి
► అవినీతి నిరోధం, దిశ వ్యవస్థ, ఎస్‌ఈబీ పనితీరుకు సంబంధించి మనం చర్చించుకున్న అంశాల్లో మన రాష్ట్రంలో పరిస్థితులను మదింపు చేయండి. ప్రతి నెల నేను నిర్వహించే సమీక్షా సమావేశం నాటికి ఏ స్థాయిలో మెరుగు పడ్డామో బేరీజు వేసి నివేదిక ఇవ్వండి. 
► ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలను పరిశీలించి, సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధం చేయండి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులకు కూడా దిశ, ఎస్‌ఈబీ, ఏసీబీ కార్యకలాపాలు, యాప్స్‌ వినియోగంపై అవగాహన కల్పించాలి. 
► దిశ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకున్న వారికి సలహాలు, సూచనలను నోటిఫికేషన్స్‌ రూపంలో పంపించాలి. తద్వారా ఏదైనా ఆపద ఎదురవ్వగానే యాప్‌ను చురుగ్గా ఉపయోగించగలరు. నేర నిర్ధాణకు అత్యంత కీలకమైన ఫోరెన్సిక్‌ వ్యవస్థలను బలోపేతం చేయాలి. అందుకు అవసరమైన వాటిని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
► ఈ సమీక్షలో హోం శాఖ మంత్రి తానేటి వనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement