
యూనిఫామ్ పోస్టులకూ వయో పరిమితి పెంపు
పోలీస్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో కూడా గరిష్ట వయో పరిమితిని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో యూనిఫామ్ సర్వీసులను మినహాయించి ఉద్యోగ నియామకాలన్నింటికీ ప్రభుత్వం వయో పరిమితిని పదేళ్లకు పెంచిన విషయం తెలిసిందే. అప్పట్లో యూనిఫామ్ సర్వీసులపై నిర్ణయం తీసుకోలేదు.
తాజాగా నిరుద్యోగుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పోలీస్ శాఖలోని రాష్ట్ర స్థాయి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో మూడేళ్ల పాటు పరిమితిని పెంచింది. అయితే సివిల్ పోలీసులకు ఈ వయోపరిమితి పెంపు వర్తించదు. హోం శాఖ పరిధిలోని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్), జైళ్ల శాఖ, అగ్నిమాపక సర్వీసులకు మాత్రమే ఈ మూడేళ్ల పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.