
నమూనా చిత్రం..
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో త్వరలో భర్తీ కానున్న 18 వేల పోస్టులకు సంబంధించి వయో పరిమితి సడలింపుపై సందిగ్ధం నెలకొంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి రిక్రూట్‌మెంట్‌లో సడలింపునిచ్చిన ప్రభుత్వం.. ఈ సారి నియమకాలకు ఇవ్వకపోవచ్చన్న అభిప్రాయం ఆ శాఖ నుంచి వ్యక్తమవుతోంది.
వయో పరిమితి సడలింపు విషయమై ప్రభుత్వానికి రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రతిపాదన పంపి రెండున్నర నెలలు గడిచినా ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. సడలింపు మినహా మిగిలిన అంతర్గత నిబంధనలకు రెండ్రోజుల క్రితమే ప్రభుత్వం జీవోలు జారీ చేసినట్లు బోర్డు అధికారులు చెప్పారు. కాబట్టి నోటిఫికేషన్ జారీ ప్రక్రియ మొదలుపెట్టామని, మరో 10 రోజుల్లో నోటిఫికేషన్ జారీకి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
‘ఇంగ్లిష్, తెలుగు’లకు వెయిటేజీ..
ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. పోలీస్ శాఖతో పాటు జైళ్లు, అగ్నిమాపక శాఖ పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఫిజికల్ టెస్టుల్లో మార్పులు చేశామని, వాటిపై ఉన్నతాధికారుల కమిటీతో చర్చించి నోటిఫికేషన్‌లో పేర్కొంటామన్నారు. రిజర్వేషన్ల కేటగిరీలో మార్పులుండవని చెప్పారు.
గత నోటిఫికేషన్‌లో ఇంగ్లిష్‌కు వెయిటేజీ ఇచ్చారని.. ఈసారి తెలుగు, ఇంగ్లిష్ రెండింటికీ వెయిటేజీ ఉంటుందన్నారు. నోటిఫికేషన్ జారీ చేసేలోపు వయోసడలింపుపై జీవో వస్తే చేరుస్తామని, లేదంటే యథావిధిగా నోటిఫికేషన్ జారీ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment